‘స్పందన’ కరువు?

ABN , First Publish Date - 2021-10-05T05:08:20+05:30 IST

- ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలసలో గ్రామకంఠం భూమిని కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. దీనిపై గ్రామానికి చెందిన సీర సాంబమూర్తి తహసీల్దారు కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలలు గడిచిపోతున్నా, పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్‌లో ‘స్పందన’ కార్యక్రమానికి అర్జీ పెట్టుకున్నారు. అయినా స్పందన లేదు. - కొత్తూరు మండలం వనస గ్రామానికి చెందిన కోటేశ్వరరావు బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి కార్డులో ఆయన పేరును తొలగించాల్సి ఉండగా.. మృతి చెందినట్లు ఏడాది కిందట ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. తాను బతికే ఉన్నానని, కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. .. ఇలా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అర్జీలు పెట్టుకొని.. అనేకమంది కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘స్పందన’ కరువు?
అర్జీదారుల సమస్యలు వింటున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లఠ్కర్‌

- కార్యాలయాల్లో పేరుకుపోతున్న అర్జీలు

- సిఫారసు ఉంటేనే భూ వివాదాలకు పరిష్కారం 

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

- ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలసలో గ్రామకంఠం భూమిని  కబ్జాదారులు ఆక్రమిస్తున్నారు. దీనిపై గ్రామానికి చెందిన సీర సాంబమూర్తి తహసీల్దారు కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. రెండు నెలలు గడిచిపోతున్నా, పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్‌లో ‘స్పందన’ కార్యక్రమానికి అర్జీ పెట్టుకున్నారు. అయినా స్పందన లేదు.

- కొత్తూరు మండలం వనస గ్రామానికి చెందిన కోటేశ్వరరావు బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తండ్రి కార్డులో ఆయన పేరును తొలగించాల్సి ఉండగా.. మృతి చెందినట్లు ఏడాది కిందట ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. తాను బతికే ఉన్నానని, కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా నెలల తరబడి తిరుగుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారు. 

.. ఇలా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అర్జీలు పెట్టుకొని.. అనేకమంది కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించండి మహాప్రభో అని వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

--------------

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతి సోమవారం జడ్పీ కార్యాలయంతో పాటు మండల, రెవెన్యూ డివిజన్‌ స్థాయి కార్యాలయాల్లో అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. కానీ, సమస్యల పరిష్కారంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో జిల్లాలో వేలాది అర్జీలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ప్రతి వారం సుమారు 300 వరకు వినతులు వస్తున్నాయి. వీటిలో సగం కూడా పరిష్కారం కావడం లేదు. వినతులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పదేపదే హెచ్చరిస్తున్నా.. అర్జీలకు మోక్షం కలగడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో పేదల భూ సమస్యలకు సంబంధించి, కొత్త పింఛన్లు, ఇళ్ల పట్టాల మంజూరు, బియ్యం కార్డుల కోసం  పెట్టుకున్న అర్జీలు పరిష్కారం కావడం లేదు. వినతులు స్వీకరించడమే తప్ప సమస్యలకు పరిష్కరించడం లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదాల పరిష్కారం విషయంలో నేతల సిఫారసులు ఉంటేనే రెవెన్యూ అధికారులు స్పందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మ్యుటేషన్‌, యాజమాన్య హక్కుల మార్పిడి, నకిలీ పట్టాల జారీ వంటి అర్జీలకు నేతలు చెప్పిన వెంటనే, రెవెన్యూ శాఖలో తమ రేట్లు మాట్లాడుకొని పని కానిచ్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  


 మొన్నటి వరకు కరోనా సాకు...

పేదల అర్జీల పరిష్కారానికి కొద్ది రోజుల కిందటి వరకూ కొందరు అధికారులు కరోనాను సాకుగా చూపించారు. మరికొందరు ఆన్‌లైన్‌లో స్పష్టత లేకుండా, అర్జీదారుడి సమస్యకు పరిష్కారం చూపకుండానే సమాధానం ఇచ్చేస్తున్నారు. ఏ శాఖలో ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయనే దానిపై అధికారుల్లోనే స్పష్టత కొరవడింది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల్లో పేరుకుపోయిన అర్జీలపై కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌ దృష్టి సారించారు. అధికారులు సాంకేతిక సమస్యలు చూపుతూ అర్జీలు పరిష్కరించడం లేదని గుర్తించారు. వారం రోజుల్లో అర్జీలన్నీ పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు అర్జీలు పరిష్కరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందో లేదో వేచిచూడాలి. 


వినతులు పరిష్కరించండి 

- అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 4: ‘స్పందన’లో పెండింగ్‌ దరఖాస్తులపై దృష్టి సారించాలని.. అర్జీలను ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేసి పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘స్పందన’లో కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చినవారి నుంచి 360 వినతులు స్వీకరించారు. పింఛన్లు, రేషన్‌కార్డులపై వినతులు వెల్లువెత్తాయి. పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో కూడా ఎక్కువ మంది దరఖాస్తులు అందించారు. కొన్ని వినతులపై అక్కడిక్కడే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిపై మండల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జేసీలు సుమిత్‌కుమార్‌, శ్రీనివాసులు, డీఆర్వో దయానిధి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-05T05:08:20+05:30 IST