డీఎల్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు: బాలినేని

ABN , First Publish Date - 2021-10-17T01:46:57+05:30 IST

రాష్ట్రంలో ఎలాంటి కరెంటు కోతలు లేవని విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కానీ ప్రభుత్వం కోతలను అమలు చేస్తున్నదంటూ

డీఎల్‌ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదు: బాలినేని

ఒంగోలు: రాష్ట్రంలో ఎలాంటి కరెంటు కోతలు లేవని విద్యుత్‌, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కానీ ప్రభుత్వం కోతలను అమలు చేస్తున్నదంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అలాంటి వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో కొంత విద్యుత్‌ సమస్య ఏర్పడిన విషయం వాస్తమేనన్నారు. దానిని అధిగమించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రె డ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆరు గంటలపాటు విద్యుత్‌ కోత అమలు చేస్తున్నట్లు ఆరాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారన్నారు. కానీ ఆ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్‌లో లేదని మంత్రి స్పష్టం  చేశారు. గత ప్రభుత్వ హయాంలో యూనిట్‌ విద్యుత్‌ను రూ.4.50 పైసలకు కొనుగోలు చేసి భారాలు మోపారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోలార్‌ విద్యుత్‌ను రూ.2.50 పైసలకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా కోర్టును ఆశ్రయించి అడ్డుకునేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బొగ్గు కొరత తీవ్రంగా ఉన్నదని మంత్రి అన్నారు. ఎంత ఖర్చు చేసైనా ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తుందని తెలిపారు. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని బాలినేని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-17T01:46:57+05:30 IST