గ్రామస్థాయిలోనే వినతులు పరిష్కరించండి

ABN , First Publish Date - 2021-10-19T05:25:48+05:30 IST

సచివాలయాలకు వచ్చే వినతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకూ గ్రామస్థాయిలోనే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూర్యకుమారి సిబ్బందిని ఆదేశించారు.

గ్రామస్థాయిలోనే వినతులు పరిష్కరించండి
అర్జీదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

  తిరస్కరిస్తే కారణం చెప్పాలి 

  జనన, మరణ ధ్రువ పత్రాల జారీలో జాప్యం వద్దు

  అధికారులను ఆదేశించిన  కలెక్టర్‌ సూర్యకుమారి 

కలెక్టరేట్‌, అక్టోబరు 18:   సచివాలయాలకు వచ్చే వినతులపై ప్రత్యేకంగా  దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకూ గ్రామస్థాయిలోనే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూర్యకుమారి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల నుంచి వినతలు స్వీకరించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ...  ఏదైనా వినతిని  పరిష్కరించే అవకా శం లేని పక్షంలో ఏ కారణంతో తిరస్కరిస్తున్నారో? అర్జీదారునికి తెలియజే యాలన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా వస్తున్న వినతులపై సమీక్షించిన ఆమె జనన, మరణ ధ్రువ పత్రాల జారీలో కొంత జాప్యం జరుగుతుందని తెలిపారు.  దీనిని నివారించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి నేరుగా ప్రజలతో మాట్లాడాలని సూచించారు.  పథకాల అమలును తెలుసుకోవాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సి నేషన్‌పై  అపోహలు తొలగించాలన్నారు.  

‘స్పందన’ వెలవెల 

పైడితల్లమ్మ జాతర ప్రభావం  కలెక్టరేట్‌ ‘స్పందన’పై పడింది. ప్రతి వారం నిర్వహించే  ఈ కార్యక్రమానికి 300 నుంచి 500 మంది అర్జీదారులు వచ్చేవారు. వివిధ కార్మిక, ఉద్యోగ, వ్యవసాయ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు కూడా నిర్వహించేవారు. అయితే సోమవారం  కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనకు కనీస స్థాయిలో అర్జీదారులు రాలేదు.  వివిధ సమస్యలపై 85 వినతలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు  12, డీఆర్‌డీఏ 15, వైద్య ఆరోగ్య శాఖ 12, జిల్లా ఆసుపత్రులు సమన్వయ అధికారికి 3, పౌర సరఫరాల శాఖకు 5 చొప్పున వినతులు వచ్చాయి. వాటిని ఆయా శాఖాధికారులకు పంపించారు.   కలెక్టర్‌ సూర్యకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  నలుగురు జేసీలు, డీఆర్‌వో, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ తదితరులు పాల్గొన్నారు. 

 ప్రత్యామ్నాయ ఎరువులు వాడండి 

పొటాష్‌కు బదులుగా ప్రత్యా మ్నాయ ఎరువులు వాడాలని కలెక్టర్‌ సూర్యకుమారి సూచించారు. ప్రసుత్తం జిల్లాలో 1,23,650 హెక్టార్ల మేర వరి పంట చిరు పొట్టదశలో ఉందని, దీనికి పొటాష్‌ వేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్లో 10వేల మెట్రిక్‌ టన్నులు పొటాష్‌ (ఎంవోపీ)ఎరువులకు గాను 7,453 మెట్రిక్‌ టన్నుల సర ఫరా జరిగిందని తెలిపారు.  ఈనెలాఖరు నాటికి 600 మెట్రిక్‌ టన్నుల ఎంవోపీ వస్తుందని వివరించారు. అంతర్జాతీయ కొరత కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. రబీకి అవసరమైన డీఏపీ, ఎంవోపీ ఎరువులకు ప్రత్యామ్నాయంగా కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగించాలని సూచించారు. 

ఇళ్ల స్థలాల పరిశీలన 

గంట్యాడ: మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ఇవ్వనున్న స్థలాలను కలెక్టర్‌ సూర్యకుమారి నందాంలో సోమవారం పరిశీలించారు. నగరానికి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ భూములను మధ్య తరగతి ప్రజలకు అతితక్కువ ధరకు ఇవ్వాలని సర్కార్‌ భావించిన సంగతి తెలిసిందే. దీనిలోభాగంగా ఈ డీపట్టా భూములను కలెక్టర్‌ పరిశీలించారు. రికార్డులను కూడా తనిఖీ చేశారు. ఈమెతో పాటు జేసీ కిషోర్‌కుమార్‌ ఉన్నారు.

 

Updated Date - 2021-10-19T05:25:48+05:30 IST