ఎట్టకేలకు రైతులకు శుభవార్త

ABN , First Publish Date - 2020-04-08T11:08:56+05:30 IST

జిల్లాలో రెండో పంట సాగు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. నెల నుంచి ఐఏబీ

ఎట్టకేలకు రైతులకు శుభవార్త

27.5 టీఎంసీలు.. 2.47 లక్షల ఎకరాలకు..

డెల్టాకు 20, కావలి కాలువకు 4.4,

ఉత్తర, దక్షిణ కాలువలకు 3 టీఎంసీల కేటాయింపు

కరోనా నేపథ్యంలో ఐఏబీ లేకుండా తీర్మానం


నెల్లూరు, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రెండో పంట సాగు కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎట్టకేలకు శుభవార్త అందింది. నెల నుంచి ఐఏబీ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు కూడా నిర్వహించే పరిస్థితి లేదు.  ఎట్టకేలకు మంత్రి, అధికారులు మంగళవారం సమావేశమై నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల మూడో వారం నుంచి రెండో పంటకు నీరు విడుదల చేసేలా నిర్ణయించారు. ఏ ఆయక ట్టుకు ఎంత వరకు నీరివ్వాలన్నది కూడా తీర్మానించారు. 


భవిష్యత్‌ అవసరాలకు పోగా..

ప్రస్తుతం సోమశిలలో ఉన్న నీటిలో రాబోవు అవసరాలకు పోగా, మిగిలిన నీటిని పెన్నా డెల్టాతో పాటు కావలి కాలువ, ఉత్తర, దక్షిణ కాలువలకు సాగునీరిచ్చేలా నిర్ణయించారు.  27.5 టీఎంసీలను 2,47,500 ఎకరాల సాగుకు అందించ నున్నారు. ప్రస్తుతం సోమశిలలో 47.5 టీఎంసీల నీరుంది. అందులో డెడ్‌ స్టోరేజీ 7.5 టీఎంసీలు, నీటి ఆవిరి 2 టీఎంసీలు, జిల్లా తాగునీటికి 5.5 టీఎంసీలు, రాబోవు ఇతర అవసరాలకు 3.5 టీఎంసీలను లెక్కగట్టారు. ఇవి పోగా 27.5 టీఎంసీలు మిగిలి ఉంటుంది. ఈ నీటినే రెండో పంటకు ఇవ్వాలని తీర్మానించారు. 


కేటాయింపులు ఇలా..

ఒక్క టీఎంసీతో 9 వేల ఎకరాలు పండించేలా నిర్ణయిం చారు. సోమశిల కింద మొదటి హక్కు కలిగిన డెల్టాలో 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో రిజిస్టర్డ్‌ ఆయకట్టు 1.80 లక్షల ఎకరాలు. ఈ ఆయకట్టు వరకు మాత్రమే నీరిచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు 20 టీఎంసీలను కేటాయించారు. కావలి కాలువ కింద 40 వేల ఎకరాలకు 4.4 టీఎంసీలు, ఉత్తర కాలువ కింద 17,500 ఎకరాలకు 1.94 టీఎంసీలు, దక్షిణ కాలువ కింద 10 వేల ఎకరాలకు 1.1 టీఎంసీల నీటి కేటాయింపు జరిపారు. ఐఏబీ నిర్వహించడం సాధ్యపడకపోవడం, సమయం మించిపోతుండడంతో రైతులను దృష్టిలో పెట్టుకొని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 


రైతులకు స్పష్టత ఇవ్వాలి..

ఇప్పుడు జరిపిన కేటాయింపులను ఎకరాల్లోనే కాకుండా ఏ కాలువ కింద ఎంత ఆయకట్టు వరకు నీరు ఇస్తున్నారన్నది రైతులకు స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత ఇరిగేషన్‌ అధికారులపై ఉంది. ఈ విషయంపై రైతులకు స్పష్టత లేకపోతే అనధికార ఆయకట్టులో కూడా రైతులు సాగుకు పూనుకునే ప్రమాద ముంది. 


నీటి విడుదలకు అనుమతి

ఈ విషయమై ఇరిగేషన్‌ ఎస్‌ఈ ప్రసాదరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ నీటి కేటాయింపుల మినిట్స్‌కు మంత్రులు, కలెక్టర్‌ అనుమతి లభించిందని చెప్పారు. రైతులంతా కేటాయించిన ఆయకట్టు వరకు సాగు చేయాలే తప్ప, అంతకుమించి  సాగువద్దని ఆయన కోరారు. 


నీటి విడుదల అభినందనీయం

తమ విజ్ఞప్తి మేరకు రెండో పంటకు నీటి విడుదలపై త్వరగా నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని జిల్లా రైతు సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. తమ హక్కులను కాపాడుతూ రిజిస్టర్డ్‌ ఆయకట్టు వరకు నీరిచ్చేలా నిర్ణయం తీసుకున్న జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఆ సంఘం నాయకులు బెజవాడ గోవిందరెడ్డి, నెల్లూరు నిరంజన్‌రెడ్డి, పి పురందర్‌రెడ్డి, తదితరులు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. 


Updated Date - 2020-04-08T11:08:56+05:30 IST