వారెంట్ల అమలు ద్వారానే పెండింగ్‌ కేసుల పరిష్కారం

ABN , First Publish Date - 2021-04-16T06:21:35+05:30 IST

వారెంట్ల అమలు ద్వారానే సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమవుతాయని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి అన్నారు.

వారెంట్ల అమలు ద్వారానే పెండింగ్‌ కేసుల పరిష్కారం
మాట్లాడుతున్న సీపీ కమలాసన్‌ రెడ్డి

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 15: వారెంట్ల అమలు ద్వారానే సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమవుతాయని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి అన్నారు. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ పెండింగ్‌ వారెంట్లను వేగవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చారు. గురువారం సమన్లు, వారెంట్లు, మెడికల్‌ సర్టిఫికెట్ల విభాగాలకు చెందిన పోలీసులకు కమిషనరేట్‌ కేంద్రంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పెండింగ్‌ వారెంట్ల అమలు కోసం ఆపరేషన్‌ తలాష్‌ ప్రవేశపెట్టామన్నారు. ఆపరేషన్‌ తలాష్‌లో భాగంగా ఇప్పటివరకు 67 పెండింగ్‌ వారెంట్లను కమిషనరేట్‌ పోలీసులు అమలు చేశారని తెలిపారు. దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వారెంట్లను పలు కేసులు పరిష్కారం కాలేపోతున్నాయని, కొన్ని సంవత్సరాల నుంచి వివిధ కేసుల్లో పరారీలో ఉన్న నిందితులపై ఉన్న వారెంట్లను అమలు చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగితే ఆశించిన ఫలితాలను సాధించవచ్చని చెప్పారు. రెండు నెలల వ్యవధిలో అమలైన వారెంట్లపై పోలీస్‌స్టేషన్ల వారీగా సమీక్షించారు. కరీంనగర్‌ టౌన్‌ డివిజన్‌ విభాగానికి చెందిన బృందాలు చురుకుగా పనిచేస్తూ ఆశించిన స్థాయిలో పెండింగ్‌ వారెంట్లను అమలు చేశాయని అభినందింంచారు.  దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వారెంట్లను వేగవంతంగా అమలు చేసే వివిధ స్థాయిలకు చెందిన పోలీసులకు రివార్డులను అందజేస్తామని, నామమాత్రంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్‌ వారెంట్ల అమలులో కొన్ని అవరోధాలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ అమలు చేయాలని పేర్కొన్నారు. కమిషనరేట్‌ వ్యాప్తంగా 480 వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. పెండింగ్‌ వారెంట్ల అమలులో చురుకుగా పనిచేస్తున్న కరీంనగర్‌ టౌన్‌ డివిజన్‌కు చెందిన పోలీసులను స్ఫూర్తిగా తీసుకుని మిగతా డివిజన్లకు చెందిన పోలీసులు పట్టుదలతో పని చేయాలన్నారు. ఈ నెల చివరి వరకు ఆపరేషన్‌ తలాష్‌ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. అడిషనల్‌ డీసీపీ(పరిపాలన) జి చంద్రమోహన్‌, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, సీహెచ్‌ నగేశ్‌, శశిధర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:21:35+05:30 IST