బోస్‌ రాజీనామా

ABN , First Publish Date - 2020-07-02T10:09:49+05:30 IST

మంత్రి బోస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు..

బోస్‌ రాజీనామా

రాజ్యసభ సభ్యుడిగా ఎంపికవడంతో మండలి, మంత్రి పదవికి రాజీనామా

అమాత్య పదవిపై ఆశావహుల కన్ను

జిల్లా పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా వైవీ సుబ్బారెడ్డి నియామకం


కాకినాడ(ఆంధ్రజ్యోతి): మంత్రి బోస్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను  సీఎం జగన్‌కు బుధవారం అందజేశారు. డిప్యూటీ సీఎం హోదాలో రెవెన్యూశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న బోస్‌ గత నెల 19న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దీంతో మంత్రి పదవికి, శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందులోభాగంగా మండలి సభ్యత్వానికి  రాజీనామా చేస్తున్నట్టు మండలి కార్యదర్శికి అందించారు.


ఈయనతోపాటు జిల్లా ఇంఛా ర్జి మంత్రి మోపిదేవి కూడా తన మండలి సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. దీంతో వీటిని కార్యదర్శి ఆమోదిం చారు. ఆ వెంటనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు రెండు ఖాళీగా ఉన్నట్టు మండలి కార్యదర్శి నోటిఫికేషన్‌ విడు దల చేశారు. అనంతరం సీఎం జగన్‌ను కలిసి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలను బోస్‌ అందించారు. అటు ఇంఛార్జి మంత్రి మోపిదేవి కూడా మంత్రి పదవికి రాజీనామా చేశారు. కాగా బోస్‌ మంత్రి గా బాధ్యతలు చేపట్టి ఏడాది దాటుతోంది. అమాత్య పదవికి రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ ఏడాదికాలం ఎంతో స్వేచ్ఛగా పనిచేశానని వివరించారు.


అటు బోస్‌ రాజీనామాతో జిల్లాలో ఇద్దరు మంత్రులే ఉన్నట్టు అయింది. అయితే ఖాళీ అయిన మంత్రి పదవిని సీఎం జగన్‌ భర్తీ చేస్తే జిల్లాలో అమాత్య పదవి ఎవరిని వరిస్తుందనేదానిపై అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. అవకాశం కోసం పలువురు బీసీ నేతలు ఇప్పటికే బలంగా పావులు కదుపుతున్నారు. అటు మోపిదేవి రాజీనామతో జిల్లా ఇంఛార్జి మంత్రి పదవి కూడా ఖాళీ అయింది. కాగా పార్టీ సంస్థాగత బలోపేతం చర్యల్లో భాగంగా జిల్లా పార్టీ వ్యవహారాల పర్యవేక్షకుడిగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని నియ మిస్తున్నట్టు వైసీపీ అధికారికంగా బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

Updated Date - 2020-07-02T10:09:49+05:30 IST