పరిహారం కోసం గండికోట నిర్వాసితుల నిరసన

ABN , First Publish Date - 2020-07-07T11:02:44+05:30 IST

మండలంలోని దత్తాపురం, బుక్కపట్నం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులు తమకు పరిహారం రాలేదంటూ కొండాపురం తహసీల్దార్‌

పరిహారం కోసం గండికోట నిర్వాసితుల నిరసన

ప్రభుత్వానికి 170 మంది బాధితుల వేడుకోలు


కొండాపురం, జూలై 6: మండలంలోని దత్తాపురం, బుక్కపట్నం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులు తమకు పరిహారం రాలేదంటూ కొండాపురం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. సోషల్‌ ఎకనామిక్‌ సర్వేలో దత్తాపురం గ్రామానికి సంబంధించి 170మందికి పైగా పేర్లున్నా 2017 నుంచి ఇంతవరకు తమకు పరిహారం అందలేదన్నారు. మొదటి విడత 14 గ్రామాల్లో తామున్నామని, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పరిహారం రాలేదని వారు నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్‌అండ్‌ఆర్‌ కింద స్థలం కోరుకున్న వారికి ఇంతవరకు రూ.1.85లక్షల పరిహారాన్ని ఇవ్వలేదని తెలిపారు. ఈ మేరకు వినతిపత్రాన్ని తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డికి అందించారు. ఈ కార్యక్రమంలో మండల సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు, ముంపువాసులు ఈశ్వర్‌రెడ్డి, బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో సీపీఐ కార్యదర్శి మనోహర్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ వెలిగొండ నిర్వాసితుల్లాగానే గండికోట నిర్వాసితులకు రూ.12.50లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

  

ఇల్లు కూలదోయడాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు

స్థానిక రామచంద్రనగర్‌లో ఇల్లు కూలదోయడానికి వచ్చిన ఎక్సకవేటర్‌ను స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ నేత శివ ఇంటి వద్దకు పరిహారం ఇచ్చేందుకు, ఇల్లు కూలదోయడానికి అధికారులు వచ్చారు. తాము ఇల్లు ఖాళీ చేయడానికి గడువు ఇవ్వాలని, అన్ని వసతులు కల్పించాకే ఖాళీ చేస్తామని, ఇల్లు కూలదోయకుండా చెక్కులు ఇవ్వాలని కోరారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇల్లు కూలదోయందే చెక్కులు ఇవ్వమని అధికారులు వెళ్లిపోయారు.


వెంటనే ఇళ్లు కూలదోయడం ఆపాలి..ఎంపీకి గండికోట నిర్వాసితుల వినతి

కొండాపురంలో గండికోట పునరావాసం కోసం వెంటనే ఇళ్లు కూలదోయడాన్ని ఆపాలని నిర్వాసితులు సోమవారం పులివెందులలో కడప ఎంపీ వైఎస్‌ అవినా్‌షరెడ్డికి విజ్ఞప్తిచేశారు. ఇళ్లు కూలదోయడం వల్ల ఇప్పటికిప్పుడు ఎక్కడకు వెళ్లాలని పరిహారం ఇవ్వందే ఇళ్లు ఎలా కట్టుకుంటామని వారు ఎంపీకి వివరించారు. పరిహారం ఇచ్చిన తర్వాత నీళ్లు వస్తే తామే వెళ్లిపోతామని, ఇళ్లు కూలదోయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో పాటు తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎంపీకి తెలిపారు. ఎంపీని కలిసిన వారిలో సింగిల్‌విండో అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, సీపీఐ, వైసీపీ నేతలు ఉన్నారు.

Updated Date - 2020-07-07T11:02:44+05:30 IST