ఒక్క నెలలో 43 వేల కార్డులు ఔట్‌!

ABN , First Publish Date - 2021-10-14T04:28:23+05:30 IST

అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెలలోనే 43వేల రేషన కార్డులను అధికారులు రద్దు చేశారు.

ఒక్క నెలలో  43 వేల కార్డులు  ఔట్‌!

సెప్టెంబరులో కార్డుల సంఖ్య 8.99 లక్షలు

అక్టోబరులో 8.56 లక్షలు

రకరకాల కారణాలతో రద్దు

కార్యాలయాల చుట్టూ పేదల ప్రదక్షిణలు

పునరుద్ధరిస్తామంటున్నా అనేక అనుమానాలు


నెల్లూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) :


ఇతడి పేరు కలికిరి శ్రీనివాసులు. సంగంవాసి. వయసు 35 ఏళ్లు. బాల్యంలో విద్యుత్‌షాక్‌తో రెండు చేతులుపోయాయి. తల్లి ఓబులమ్మతో కలిసి ఉంటున్నాడు. వీరి రేషన్‌కార్డు నెంబరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ 091900100128. గతంలో ఇద్దరికీ 10 కేజీల బియ్యం ఇచ్చేవారు. ఈ నెల రేషన్‌ బియ్యం పంపిణీలో ఒకరికే బియ్యం ఇచ్చారు. ఈకేవైసీ లేదనే సాకుతో రెండు చేతులు లేని శ్రీనివాసులుకు బియ్యం ఆపేశారు. అంతేకాదు.. దివ్యాంగుల పింఛన్‌ రూ.3000 కూడా రద్దవుతుందనే భయం వారిలో నెలకొంది. 


మండల కేంద్రం మర్రిపాడులోని కంచంరెడ్డి వీరమ్మ వితంతు పింఛను పొందుతోంది. రెండు నెలల క్రితం ఈమె పింఛనను అధికారులు తొలగించారు. తాజాగా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందనే సాకుతో రేషన కార్డునూ తొలగించారు. 


కావలి మండలం చెలంచర్లకు చెందిన గుర్రం వెంకట సుబ్బయ్య. వయసు 85. కొంత కాలం క్రితం భార్య పిల్లలు చనిపోయారు. దీంతో ఈయన కూడా మరణించాడని బియ్యం కార్డును రద్దు చేశారు.


పెంచినట్టే పెంచి..


ఇవి ఉదాహరణలు మాత్రమే. జిల్లావ్యాప్తంగా ఇలాంటి బాధితులెందరో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ నెలలోనే  43వేల రేషన కార్డులను అధికారులు రద్దు చేశారు. గత నాలుగు నెలలుగా నెలకు కొన్ని చొప్పున సామాజిక పింఛన్లను రద్దుచేసిన ప్రభుత్వం ఇప్పుడు బియ్యం కార్డుల రద్దు కార్యక్రమం మొదలు పెట్టింది. ఏక కాలంలో వేల సంఖ్యలో కార్డులు రద్దు కావడంతో జిల్లావ్యాప్తంగా పేదల నుంచి ఆహాకారాలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు పింఛను రద్దు కాబడిన వృద్ధులతో కిటకిటలాడిన మండల పరిషత కార్యాలయాలు ఇప్పుడు కార్డుదారుల కన్నీళ్లతో తడిసి ముద్ద కానున్నాయి. 


జూన నుంచి అక్టోబరు వరకు జిల్లాలో కార్డుల సంఖ్యను పరిశీలిస్తే ప్రతి నెలా కొద్దొగొప్పో కార్డుల సంఖ్య పెంచుతూ వచ్చారు. అయితే, ఈ నెలలో ఒకేసారి 43వేల కార్డులు రద్దు చేశారు. జూనలో 8,89,232 కార్డులు ఉండగా జూలై నాటికి  8,92,842, ఆగస్టులో 8,86,500 సెప్టెంబరులో 8,99,005 కార్డులు ఉన్నాయి. ఆగస్టులో కొంతమేర కార్డుల సంఖ్య తగ్గినా సెప్టెంబరు నాటికి మళ్లీ పెరిగాయి. అయితే అక్టోబరు వచ్చే నాటికి జిల్లాలో కార్డుల సంఖ్య 8,56,100లకు తగ్గాయి. అంటే సెప్టెంబరుతో పోల్చితే అక్టోబరులో  43వేల కార్డులు రద్దు చేశారు. 


కరెంటు బిల్లులే ప్రధాన కారణం


అక్టోబరులో రద్దు అయిన 43వేల కార్డుల్లో ఉద్యోగ వర్గాలకు చెందిన 11వేల కార్డులు ఉన్నాయి. సచివాలయాల్లో పనిచేసేవారు, వివిధ శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగాలు చేసే వారికి సంబంధించిన 11వేల కార్డులను రద్దు చేశారు. మిగిలిన 33 వేల కార్డులు సామాన్య ప్రజలకు చెందినవి. వీటిలో కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని, స్థిరాస్తులు ఉన్నాయని, తదితర కారణాలు చూపుతూ వీటిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. 


వస్తాయో... రావో!? 


రద్దయిన కార్డులు తిరిగి పునరుద్ధరించబడతాయో లేదోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరైనా ఆధారాలు చూపితే కార్డులను తిరిగి పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నా, ఆ పని ఎప్పటికి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. పింఛన్ల విషయంలోనూ ఇదే చెప్పారు. నాలుగు నెలల కాలంగా ఇప్పటికి ఆ పని జరగలేదు.  పింఛన్లు రద్దు అయిన పేదలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు తప్ప ప్రయోజనం కనిపించడం లేదు. కార్డుల పరిస్థితి కూడా ఇంతేనేమో అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. 

Updated Date - 2021-10-14T04:28:23+05:30 IST