ఏరివేత.. కార్డుల్లో కోత

ABN , First Publish Date - 2021-06-17T04:18:17+05:30 IST

వివిధ రకాల పింఛన్ల ఏరివేతకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విచారణ జిల్లాలో వేగవంతమైంది.

ఏరివేత..  కార్డుల్లో కోత
డీఆర్‌డీఏ కార్యాలయం

సామాజిక పింఛన్ల రద్దుకు రంగం సిద్ధం?

తొలుత వితంతు, ఒంటరి మహిళలపై విచారణ

సివిల్‌ సప్లయీస్‌ డేలా ఆధారంగా నోటీసులు

గడువులోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు


జిల్లాలో కొన్ని రకాల సామాజిక పింఛన్లను రద్దు చేయడానికి రంగం సిద్ధమైంది. తొలుత ఒంటరి మహిళ, వితంతు పింఛన్ల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే కొందరు పింఛనుదారులకు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ నోటీసుల్లో తమ అర్హతను నిర్ధారించుకుని సంబంధిత కార్యాలయాల్లో తెలియచేయాలని పేర్కొంటున్నారు. ఈ నోటీసులు అందుకున్న లబ్ధిదారులు కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.


నెల్లూరు (హరనాథపురం),  జూన 16 : వివిధ రకాల పింఛన్ల ఏరివేతకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విచారణ జిల్లాలో వేగవంతమైంది. ప్రతి రేషన కార్డుదారుడు తప్పకుండా ఈకేవైసీ పక్కాగా చేసుకొంటేనే రేషన సరుకులతోపాటు ఇతర ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతాయని అధికారులు పదే పదే చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకొన్నారు. ఇదే లబ్ధిదారుల కొంప ముంచుతుందని వారు భావించలేదు. భర్త బతికి ఉన్నప్పుడు రేషన సరుకులు పొందుతున్న ప్రస్తుత వితంతువు, కార్డులో తన భర్త పేరు తొలగించి ఉండక పోతే ఆమె పెన్షన వెంటనే రద్దవుతుంది. రేషన కార్డు ద్వారా ఇతర ఫలాలు పొందినా ఆ కార్డు రద్దవుతుంది. అలాగే ఒంటరి మహిళగా సామాజిక పెన్షన పొందుతూ  ఆ తరువాత పెళ్లి చేసుకొని భర్తతో కలిసి రేషనకార్డు పొంది ఉంటే ఆమె పెన్షన కూడా రద్దవుతుంది. ప్రతి రేషన కార్డుదారుకు ఈకేవైసీ చేయించడంతో భార్యాభర్తలు రేషన బియ్యం తీసుకొంటున్నట్లు బయట పడింది. భర్త ఉండి పెన్షను పొందుతున్న వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధించి వివరాలను క్షుణ్ణంగా  సేకరిస్తున్నారు. మరోవైపు వితంతు పెన్షన పొందుతున్న మహిళ  వివరాలు సరిగా లేవని నిర్ధారణ అయినా వారి పెన్షన్లు రద్దయిపోతాయి. భర్త ఉండి వితంతు, ఒంటరి మహిళలు పెన్షన పొందుతుంటే వారి పెన్షన రద్దు చేయడంలో తప్పులేదని, ఏదో ఒక సాకుతో  పెన్షన్లు రద్దు చేస్తే నిజమైన లబ్ధిదారులకు తీవ్రంగా అన్యాయం జరిగే అవకాశం ఉందని సామాజిక పెన్షనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 


గతానికి ఇప్పటికీ తేడా :


గతంలో వితంతు మహిళ పెన్షన పొందాలంటే భర్త చనిపోయినట్లు తెలియచేసి, దరఖాస్తు చేస్తే పెన్షనను పొందే వీలుండేది. ఇప్పుడు బియ్యం కార్డును కూడా పరిగణలోకి తీసుకొంటున్నారు. సామాజిక పింఛన్లకు సంబంధించి సివిల్‌ సప్లయీస్‌ డేటాను ఆధారంగా పెన్షన్ల వివరాలు సేకరిస్తున్నారు. ఈ విధానంలో కూడా పలు రకాల పెన్షన్లు రద్దు అయ్యే అవకాశం ఉంది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత కార్మిక, కల్లుగీత కార్మికులు, అభయహస్తం, ఫిషర్‌మన, ఒంటరి మహిళ,  ట్రాన్సజెండర్‌, కిడ్నీ, డప్పు కళాకారులు, చర్మకారులు, డీఎంహెచఓ, కళాకారులు, ఏఆర్‌టీ పెన్షనలు తదితర 16 రకాల పెన్షన్లు ఇలా 3,66,677 మంది ఉన్నారు. ఈ పెన్షనర్ల అందరికీ ప్రతి నెలా రూ.90.63 కోట్లు అందజేస్తున్నారు. సివిల్‌ సప్లయీస్‌ డేటా ఆధారంగా చర్యలు తీసుకొంటే ఎన్నో పెన్షన్లు రద్దయ్యే అవకాశం ఉంది.


విచారణ చేస్తున్నారు 


సివిల్‌ సప్లయీస్‌ వారి డేటా ఆధారంగా వితంతు, ఒంటరి మహిళా పెన్షన్లకు సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్లు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. వారిలో కొందరికి భర్తలు ఉన్నట్లు, రేషన కార్డు ద్వారా రేషన సరుకులు పొందుతున్నట్లు తెలిసింది. ఈ విచారణలో అలాంటి వారు ఉంటే చర్యలు తీసుకొంటాం.

- సాంబశివారెడి, ప్రాజెక్టు డైరెక్టర్‌, డీఆర్‌డీఏ

Updated Date - 2021-06-17T04:18:17+05:30 IST