ఇక ఇంటి వద్దకే రేషన్‌!

ABN , First Publish Date - 2021-01-21T04:47:56+05:30 IST

సరుకుల కోసం ఇక రేషన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం ఉండదు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాహనాలద్వారా ఇంటి వద్దే సరుకులు ఇవ్వనున్నారు.

ఇక ఇంటి వద్దకే రేషన్‌!
ఈ వాహనాల ద్వారానే ఇంటింటికీ రేషన్‌ సరుకులు సరఫరా చేస్తారు!

ఫిబ్రవరి నుంచి అమలుకు సిద్ధం

1 నుంచి 18వ తేదీ వరకు సరఫరా

నేడు మినీ ట్రక్కులు ప్రారంభింనున్న మంత్రులు


నెల్లూరు (హరనాథపురం), జనవరి 20 : సరుకుల కోసం ఇక రేషన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడాల్సిన  అవసరం ఉండదు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వాహనాలద్వారా ఇంటి వద్దే సరుకులు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను  రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాస్‌, కొడాలి నాని, మేకపాటి గౌతంరెడ్డి, అనీల్‌ కుమార్‌యాదవ్‌ గురువారం ప్రారంభించనున్నారు.


524 వాహనాలు


ఇంటింటికీ రేషన్‌ సరఫరాకు సంబంధించి జిల్లాకు 525 మినీ ట్రక్కులు అవసరమని అధికారులు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, ఓబీసీ కార్పొరేషన్‌ల ద్వారా సంబంధిత లబ్ధిదారులకు 60 శాతం సబ్సిడీతో ఈ ట్రక్కులను మంజూరు చేశారు. ఇప్పటికే 490 వాహనాలు జిల్లాకు చేరుకోగా, మిగిలిన 34 వాహనాలు బుధవారం రాత్రికి వచ్చేస్తాయి. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న వాహనాలకు రిజిస్ట్రేషన్లు బుధవారం రాత్రిలోగా పూర్తి చేయనున్నారు. తూకపు మిషన్‌, మైకు, చార్జింగ్‌ మిషన్‌, ఈపాస్‌ యంత్రం, సీట్లు, లైట్లు ఇలా 42 వసతులు ఈ వాహనంలో ఉన్నాయి.


వలంటరీ వ్యవస్థతో..


గ్రామ, వార్డు వలంటరీ వ్యవస్థను పౌర సరఫరాల శాఖతో అనుసంధానం చేసి ప్రతినెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఇంటింటికీ సన్నబియ్యం సరఫరా చేస్తారు. జిల్లాలో 8.70 లక్షల రేషన్‌కార్డులు ఉండగా, 1857 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా బియ్యం, గోధుమలు, చక్కెర, కందిపప్పు వంటి సరకులను ఒకేదఫా అందచేయనున్నారు. 


కలెక్టర్‌ పరీశీలన


స్టేడియంలో ఉన్న మినీట్రక్కులను కలెక్టర్‌ చక్రధర్‌బాబు బుధవారం పరిశీలించారు. ట్రయల్‌ రన్‌ను స్వయంగా పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ హరేందిరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


విజయవంతంగా అమలు చేస్తాం 

ఇంటింటికీ రేషన్‌ సరుకుల పంపిణీ పథకాన్ని జిల్లాలో విజయవంతం అమలు చేస్తాం. రేషన్‌ షాపులు, క్లస్టర్ల మ్యాపింగ్‌ ప్రక్రియను పూర్తి చేశాం. రూట్‌ మ్యాప్‌ సిద్ధం అయింది. 

- బాలకృష్ణారావు, జిల్లా పౌరసరఫరాల అధికారి



Updated Date - 2021-01-21T04:47:56+05:30 IST