Abn logo
Sep 22 2021 @ 00:57AM

జలకళ

వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లకు పెరిగిన ఇన్‌ఫ్లో

గరిష్ఠానికి చేరిన మేహాద్రిగెడ

వేసవిలో నీటికి ఢోకా ఉండబోదంటున్న జీవీఎంసీ అధికారులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరానికి నీరందించే రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి.  కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. మిగిలిన రిజర్వాయర్లలో కూడా నీటిమట్టాలు గరిష్ఠ స్థాయిలకు సమీపిస్తుండడంతో మరో రెండేళ్లు నగరానికి తాగునీటి ఇబ్బందులు వుండవని జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు.  


నగర జనాభా సుమారు 20 లక్షలు. వీరి కోసం ప్రతిరోజూ 64 మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరం. ఇంకా పరిశ్రమలకు మరో 45 ఎంజీడీ అవసరం. ఈ నీటిని ఏలేరు, మేహాద్రిగెడ్డ, రైవాడ, తాటిపూడి, గోస్తనీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్ల నుంచి నగరానికి జీవీఎంసీ సరఫరా చేస్తోంది. అయితే ఈ ఏడాది సెప్టెంబరు మొదటివారం వరకూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. పరిస్థితి ఇలాగే వుంటే వేసవిలో నగరానికి నీటి ఎద్దటి తప్పదనే ఆందోళన వ్యక్తమైంది. అలాంటి తరుణంలో గత 20 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో క్రమంగా రిజర్వాయర్లలో నీటి మట్టం పెరగడం మొదలైంది. ఏలేరు రిజర్వాయర్‌ నీటిమట్టం గరిష్ఠ స్థాయి 86.56 మీటర్లు కాగా ప్రస్తుతం 80.58 మీటర్లు ఉంది. అలాగే రైవాడలో 114 మీటర్లకు గాను ప్రస్తుతం 110.37 మీటర్లకి చేరింది. మేహాద్రిగెడ్డ గరిష్ఠ స్థాయి 61 అడుగులు కాగా ప్రస్తుతం 60.1 అడుగులు, తాటిపూడి 297 అడుగులకుగాను ప్రస్తుతం 284.7 అడుగులకు చేరింది. ముడసర్లోవ రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 169 అడుగులు కాగా...ప్రస్తుతం 163 అడుగుల మేరు నీరు ఉంది. గంభీరం రిజర్వాయర్‌ గరిష్ఠం 126 అడుగులు కాగా ప్రస్తుతం 120.7 అడుగులకు చేరింది. రిజర్వాయర్లకు ఇన్‌ఫ్లో ఇంకా కొనసాగుతుండడంతో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతోంది. రిజర్వాయర్లలో నీటిమట్టం పెరుగుతుండడంతో జీవీఎంసీ నీటిసరఫరా విభాగం అధికారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.


రిజర్వాయర్లలో ప్రస్తుత నీటిమట్టం

రిజర్వాయర్‌     గరిష్ఠం            కనిష్ఠం                    ప్రస్తుతం

ఏలేరు         86.56 మీటర్లు     72.54 మీటర్లు             80.58 మీటర్లు

రైవాడ        114 మీటర్లు       99 మీటర్లు               110.37 మీటర్లు

మేహద్రిగెడ్డ    61 అడుగులు     44 అడుగులు             60.1 అడుగులు

తాటిపూడి     297 అడుగులు    251 అడుగులు            284.7 అడుగులు

గోస్తనీ          35 అడుగులు     21.6 అడుగులు         33 అడుగులు

ముడసర్లోవ    169 అడుగులు    152 అడుగులు           163 అడుగులు

గంభీరం       126 అడుగులు    107 అడుగులు           120.7 అడుగులు