ఎక్కడివక్కడే

ABN , First Publish Date - 2020-10-10T06:02:37+05:30 IST

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ (రెపో) రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైతే రేట్లను

ఎక్కడివక్కడే

కీలక వడ్డీ రేట్లు యథాతథం.. అవసరమైతే భవిష్యత్‌లో మరింత తగ్గిస్తాం

2020-21లో వృద్ధి క్షీణత -9.5 శాతం

వచ్చే మార్చికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5% 

ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష అంచనాలు 


ముంబై: భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక వడ్డీ (రెపో) రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు అవసరమైతే రేట్లను మరింత తగ్గిస్తామని సంకేతాలిచ్చింది. మూడు రోజుల ఎంపీసీ సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కమిటీ నిర్ణయాలను ప్రకటించారు. వడ్డీరేట్లను యధావిధిగా కొనసాగించాలని, వృద్ధికి అనుకూలమైన ద్రవ్య విధానాన్ని కొనసాగించాలని ఎంపీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఓటువేశారు. ఈ ఏడాది మార్చి, మే నెలల్లో ఆర్‌బీఐ రెపో రేటును మొత్తం 1.15 శాతం తగ్గించింది. ఆగస్టుతోపాటు తాజా సమీక్షలో మాత్రం రేట్ల కోతకు విరామం పలికింది. అయినప్పటికీ, వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంచడంతోపాటు రుణాల వ్యయా న్ని తగ్గించేందుకు పలు చర్యలను ప్రకటించింది.


వచ్చేవారం రూ.20,000 కోట్ల ఓఎంఓ 

వ్యవస్థలో ద్రవ్య లభ్యతను మరింత పెంచేందుకు వచ్చే వారంలో రూ.20,000 కోట్ల విలువైన ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంఓ) చేపట్టనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయన్నునట్లు తెలిపింది. అంతేకాదు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రుణాలు సేకరించేందుకు రాష్ట్రాలు జారీ చేసే సెక్యూరిటీల కొనుగోలుకూ ఈ నిధులను ఉపయోగించనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. జీఎస్‌టీ వసూళ్లు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రాల రుణ సేకరణ దీంతో సులభతరం కానుంది. 


రిటైల్‌ రుణాల పరిమితి పెంపు 

రిటైల్‌, ఎస్‌ఎంఈ విభాగాలకు రుణాల మంజూరు పరిమితిని రూ.5 కోట్ల నుంచి రూ.7.5 కోట్లకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. కొత్త రుణాలతోపాటు ఇంక్రిమెంటల్‌ రుణాలకూ ఈ పరిమితి పెంపును వర్తింపజేసింది. 


సమీక్ష ముఖ్యాంశాలు

4 శాతంగా రెపో రేటు యథాతథం

రివర్స్‌ రెపో సహా మిగతా రేట్లలోనూ మార్పులేదు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో జీడీపీ వృద్ధి రేటు -9.5 శాతానికి క్షీణించవచ్చు.

జూలై-సెప్టెంబరు త్రైమాసికం(క్యూ2)లో -9.8%,

క్యూ3లో -5.6%, క్యూ4లో 0.5% వృద్ధి అంచనా 

2021-22 క్యూ1 వృద్ధి అంచనా 20.6 శాతం 

వృద్ధికి ఊతమిచ్చే ద్రవ్య విధానం కొనసాగింపు 

కరోనాతో పోరాటంలో భారత ఆర్థిక వ్యవస్థ నిర్ణయాత్మక దశకు చేరుకుంది. 

జూలై-సెప్టెంబరు రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.8% 

ప్రస్తుత ధరల పెరుగుదల తాత్కాలిక పరిణామమే.. 

డిసెంబరు, మార్చి త్రైమాసికాల్ల్లో ధరలు క్రమంగా తగ్గుముఖం 

వచ్చే మార్చి నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.5% 


రూ.లక్ష కోట్ల టీఎల్‌టీఆర్‌ఓ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ద్రవ్య లభ్యతను మెరుగుపర్చేందుకు 2021 మార్చి 31లోగా రూ.లక్ష కోట్ల విలువైన ఆన్‌ ట్యాప్‌ టార్గెటెడ్‌ లాంగ్‌టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌ (టీఎల్‌టీఆర్‌ఓ) చేపట్టనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ పథకం ద్వారా రెపో అనుసంధానిత ఫ్లోటింగ్‌ రేట్లకు మూడేళ్ల వరకు కాలపరిమితితో నిధులు అందించడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంక్‌లు ఈ పథకం ద్వారా పొందే నిధులను కార్పొరేట్‌ బాండ్లు, కమర్షియల్‌ పేపర్లు, ఎంపిక చేసిన రంగాల కంపెనీలు జారీ చేసే ఎన్‌సీడీలలో పెట్టుబడులు పెట్టేందుకు, ఎంపిక చేసిన రంగ కంపెనీలకు రుణాలిచ్చేందుకూ బ్యాంక్‌లు  ఉపయోగించుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 


 డిసెంబరు నుంచి నిరంతర ఆర్‌టీజీఎస్‌ 

దేశీయ వ్యాపారాలు, సంస్థలకు వేగవంతమైన, నిరంతరాయ చెల్లింపులకు వెసులుబాటు కల్పించేందుకు ఆర్‌బీఐ మరో నిర్ణయం తీసుకుంది. ఈ డిసెంబరు నుంచి రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) సేవలను నిరంతరం (సవంత్సరం పొడుగునా రోజుకు 24 గంటలపాటు) అందుబాటులోకి తేనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ సేవలు  ప్రతినెలా 2,4వ శనివారాలు మినహాయించి మిగతా అన్ని పనిదినాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.


గృహ రుణాలకు ప్రోత్సాహం

గృహ రుణాలను ప్రోత్సహించడం ద్వారా స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేందుకు రుణాల రిస్క్‌ వెయిటేజ్‌ను హేతుబద్ధీకరించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. బ్యాంక్‌లు కొత్తగా మంజూరు చేసే గృహ రుణాల రిస్క్‌ను కేవలం లోన్‌ టు వేల్యూ (ఎల్‌టీవీ) రేషియోకు అనుసంధానం చేస్తాయి. ఈ నిష్పత్తి ఎంత తక్కువగా ఉంటే రిస్క్‌ అంత తక్కువగా ఉన్నట్లు. 


ఎగుమతిదారులకు ఊరట 

కరోనా సంక్షోభంతో కుదేలైన ఎగుమతిదారులకు ఆర్‌బీఐ ఊరట కల్పించింది. ఎగుమతిదారుల కార్యకలాపాల అప్రమత్తం చేసే ‘సిస్టమ్‌ బేస్డ్‌ ఆటోమెటిక్‌ కాషన్‌ లిస్టింగ్‌’ను నిలిపివేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ తెలిపారు.  

Updated Date - 2020-10-10T06:02:37+05:30 IST