విదేశీ మారకం తగ్గుతున్న తరుణంలో నిల్వలు పెంచుకున్న సెంట్రల్ బ్యాంక్
రెండేళ్లలో 100 టన్నులకు పైగా కొనుగోలు
ముంబై: భారతీయులతో పాటు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)కూ బంగారంపై మక్కువే. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆరు నెలల్లో ఆర్బీఐ బంగారం నిల్వలను 16.58 టన్నుల మేర పెంచుకుంది. దాంతో 2022 మార్చి చివరి నాటికి మన సెంట్రల్ బ్యాంక్ వద్దనున్న పసిడి ఖజానా 760.42 టన్నులకు పెరిగింది. ఈ మధ్యకాలంలో విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గుకుంటూ వచ్చిన తరుణంలో ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటూ రావడం గమనార్హం. 2021 సెప్టెంబరులో ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 64,245 కోట్ల డాలర్లకు చేరుకున్న ఆర్బీఐ ఫారెక్స్ నిల్వలు.. క్రమంగా తగ్గుతూ వచ్చి ఈ నెల 6తో ముగిసిన వారానికి 59,595 కోట్ల డాలర్లకు పడిపోయాయి. అంటే, గడిచిన ఏడు నెలలకు పైగా కాలంలో విదేశీ మారకం ఖజానా 4,650 కోట్ల డాలర్ల మేర తగ్గిందన్నమాట. ఈ ఏడాది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తన పెట్టుబడులను ఉపసంహరించుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలకు బంగారం కొంత స్థిరత్వం చేకూర్చనుంది.
2017-18 నుంచే కొనుగోళ్ల పునఃప్రారంభం
ఆర్బీఐ ముందుజాగ్రత్త చర్యగా 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచే బంగారం కొనుగోళ్లను ప్రారంభించింది. గడిచిన రెండేళ్లలోనే పసిడి నిల్వలను 100 టన్నులకు పైగా పెంచుకుంది. ఆర్బీఐ తన మొత్తం బంగారంలో 453.52 టన్నులను విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (బీఓఈ), బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ (బీఐఎస్) సేఫ్ కస్టడీలో ఉంచింది. మరో 295.82 టన్నులను దేశీయంగా భద్రపరిచింది.
ఫారెక్స్ రిజర్వ్‌లో పెరిగిన బంగారం వాటా
విలువపరంగా (డాలర్లలో) ఆర్బీఐ వద్దనున్న మొత్తం విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా గణనీయంగా పెరిగింది. 2021 సెప్టెంబరులో ఈ వాటా 5.88 శాతంగా నమోదు కాగా.. 2022 మార్చి చివరినాటికి 7.01 శాతానికి చేరుకుంది. దాదాపు ఎనిమిదేళ్ల (2014 నాటి) గరిష్ఠ స్థాయి ఇది. అంతేకాదు, ఈ మార్చితో ముగిసిన 6 నెలల్లో ఆర్బీఐ బంగారం నిల్వల విలువ 516 కోట్ల డాలర్ల మేర పెరిగి 4,255 కోట్ల డాలర్లకు చేరుకుంది.
ప్రపంచంలో మూడో అతిపెద్ద రిజర్వ్ బంగారమే..
ప్రపంచంలో అతిపెద్ద ఆస్తి రిజర్వుల్లో బంగారానిది మూడో స్థానం. అమెరికా డాలర్, యూరో కరెన్సీ నిల్వలు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
9వ స్థానంలో భారత్
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో బంగారానికి ప్రత్యక్ష పాత్రేమీ లేనప్పటికీ, ఆయా దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంక్‌లు జాతీయ సంపదను పరిరక్షించుకోవడంతో పాటు ఆర్థిక సంక్షోభాల నుంచి రక్షణ కోసం భారీగా బంగారం నిల్వలను పోగేసుకుంటున్నాయి. ఈ విషయంలో భారత్ 9వ స్థానంలో ఉంది. గడిచిన కొన్నేళ్లలో కేవలం ఆర్బీఐ మాత్రమే కాదు, అమెరికా వంటి అగ్రరాజ్యాల సెంట్రల్ బ్యాంక్‌లూ పసిడి నిల్వలను భారీగా పెంచుకున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు మొత్తం 84 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అంతక్రితం మూడు నెలల్లో (అక్టోబరు-డిసెంబరు) కొనుగోలు చేసిన 41.2 టన్నులతో పోలిస్తే రెండింతల కన్నా అధికం.