సర్వేయర్లకు రీసర్వే అలవెన్సు

ABN , First Publish Date - 2022-01-25T09:00:01+05:30 IST

భూముల సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలన్న ప్రతిపాదనపై కదలిక వచ్చింది.

సర్వేయర్లకు రీసర్వే అలవెన్సు


స్టీరింగ్‌ కమిటీ ముందుకు ప్రతిపాదన 

(అమరావతి-ఆంధ్రజ్యోతి): భూముల సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లకు ప్రత్యేక అలవెన్సు ఇవ్వాలన్న ప్రతిపాదనపై కదలిక వచ్చింది. సర్వే సెటిల్‌మెంట్‌ కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ ఈ ప్రతిపాదనను స్టీరింగ్‌ కమిటీ ముందుకు తీసుకువెళ్లినట్లు తెలిసింది. వందేళ్ల తర్వాత భూసర్వే జరుగుతున్నందున సర్వేయర్లు అంకితభావంతో కష్టపడి పని చేస్తున్నారని, వారికి రీసర్వే అలవెన్సు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి భారం కలగకుండా, సర్వేయర్ల కష్టాన్ని గౌరవించేలా అలవెన్సు నిర్ధారించాలని ఆయన కోరినట్లు తెలిసింది. రీసర్వే ప్రాజెక్టు అమలు తీరుపై సమీక్షించేందుకు ఇటీవల స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. సీఎం ప్రధాన సలహాదారు అజేయకల్లాం నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రీ సర్వే అలవెన్సును కమిషనర్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది. రాష్ట్రంలో భూముల సర్వే కోసమే 11,500 మంది గ్రామ సర్వేయర్లను ప్రభుత్వం నియమించింది. సర్వేశాఖ పరిధిలో 850 మంది రెగ్యులర్‌ సర్వేయర్లు, 250 మంది సర్వే ఇన్‌స్పెక్టర్లు, 150 మంది డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. వీరితోపాటు సర్వే శాఖలో క్షేత్రస్థాయి సిబ్బంది కూడా రీసర్వేలో భాగస్వాములవుతున్నారు. ఇప్పటికే ఏడాదిగా క్షేత్రస్థాయి సేవల్లో ఉంటూ భూముల సర్వేను సజావుగా చేపట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక సర్వే అలవెన్సు ఇవ్వాలని కోరుతున్నారు. తొలుత ఈ డిమాండ్‌పై అధికారులు పెద్దగా స్పందించలేదు. ఇటీవల 51 గ్రామాల్లో రీసర్వే రికార్డులు చూసిన తర్వాత సర్వేయర్ల కష్టం బయటకొచ్చింది. దీంతో ఉన్నతాధికారులు సానుకూలంగా ముందుకొచ్చారు. దీనిపై సముచిత నిర్ణయం తీసుకోవాలని స్టీరింగ్‌ కమిటీని కమిషనర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ కోరినట్లు తెలిసింది. ఆర్థిక పరమైన అంశం కాబట్టి దీనిపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించాలని నిర్ణయించారు.

Updated Date - 2022-01-25T09:00:01+05:30 IST