పంజాగుట్ట,
జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఆరు శాతం ఉన్న అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు
ఎలా కేటాయిస్తారని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు.
రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించడాన్ని తాము పూర్తిగా
వ్యతిరేకిస్తున్నామని అన్నారు. శనివారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో
ఏర్పాటుచేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
జాజుల శ్రీనివా్‌సగౌడ్, మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, గిరిజన
లంబాడీల ఐక్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ తదితరులు
మాట్లాడారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లు
ఆర్డీవోలు, తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇస్తామని, ఈనెల 27న నగరంలో ఎస్సీ,
ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలతో కలిసి జేఏసీగా ఏర్పడి విస్తృతస్థాయి
సమావేశాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి,
రిజర్వేషన్ల లక్ష్యానికి తూట్లు పొడవడానికే కేంద్రం అగ్రవర్ణ పేదలకు
రిజర్వేషన్లు తెచ్చిందని జాజుల శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు. తొమ్మిది శాతం
ఉన్న అగ్రవర్ణాలకు 90 శాతం పదవులు, ఉద్యోగాలు, 90శాతం ఉన్న బడుగు, బలహీన
వర్గాలకు 9 శాతం పదవులా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో రైతుల మాదిరి
ఉద్యమం చేస్తామన్నారు. బండి సంజయ్‌కి దమ్ముంటే ప్రధాని మోదీని ఒప్పించి
తగ్గించిన రిజర్వేషన్లను తిరిగి పెంచాలన్నారు. రిజర్వేషన్లపై
న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. కేవలం నిజమైన అగ్రవర్ణ పేదలకు తాము
వ్యతిరేకం కాదని రాజ్ కుమార్ జాదవ్, చెన్నయ్య అన్నారు. జనాభా
ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ,
బీసీ ప్రజాప్రతినిధుల ఇళ్లతోపాటు, ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని
హెచ్చరించారు. సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు శ్యామ్, భాస్కర్,
వెంకట్రావు, విక్రమ్ గౌడ్, రమేష్ పాల్గొన్నారు.