ఆశల గల్లంతు! రిజర్వేషన్లతో మారిన కొందరి జాతకాలు

ABN , First Publish Date - 2021-04-16T06:09:25+05:30 IST

ఆశల గల్లంతు! రిజర్వేషన్లతో మారిన కొందరి జాతకాలు

ఆశల గల్లంతు! రిజర్వేషన్లతో మారిన కొందరి జాతకాలు

అభ్యర్థుల ఎంపికకు పార్టీల కసరత్తు

మంత్రి పువ్వాడను కలుస్తున్న టీఆర్‌ఎస్‌ ఆశావహులు 

పోటీపై నేడు వామపక్షాల నిర్ణయం

జాబితాలు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ 

ఖమ్మం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల నగారా మోగడం.. రిజర్వేషన్ల కేటాయింపు కూడా ముగిసిన నేపథ్యంలో అప్పటి వరకు అభ్యర్థిత్వాలు ఆశించిన ప్రధాన రాజకీయపార్టీల్లోని ఆశావహులు కొందరి ఆశలు గల్లంతైతే.. కొందరి జాతకాలు తీరుమారయ్యాయి. కొన్ని డివిజన్లలో తాము పోటీ చేయాలని భావించిన వారు.. అక్కడ మహిళలకు రిజర్వేషన్‌ కావడంతో వారి సతీమణులను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత కార్పొరేషన్‌ మేయర్‌గా పనిచేసిన పాపాలాల్‌, డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన బత్తుల మురళి.. తమ డివిజన్లలో మారిన రిజర్వేషన్లతో పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పగడాల నాగరాజు కూడా తన డివిజన్‌ బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయనకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. చావా నారాయణరావు ప్రానినిధ్యం వహించిన డివిజన్‌ ఈసారి జనరల్‌ మహిళ కావడంతో ఆయన తన సతీమణిని బరిలోకి దించబోతున్నారు. టికెట్‌ ఆశించి టీడీపీ నుంచి ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన చిరుమామిళ్ల నాగేశ్వరరావు డివిజన్‌ కూడా జనరల్‌ మహిళ కావడంతో ఆయన సతీమణి పోటీచేసే అవకాశం ఉంది. జనరల్‌కు రిజర్వ్‌ అయిన కొన్ని డివిజన్లలో ఆశావహులకు మహిళా కోటా నిరాశ పరిచింది. టీఆర్‌ఎస్‌ నగర నాయకుడు సరిపుడి సతీష్‌ 11వ డివిజన్‌ జనరల్‌ మహిళ కావడంతో ఆయన భార్య బరిలో దిగే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన దీపక్‌చౌదరి, తిలక్‌ డివిజన్లు జనరల్‌కావడంతో మళ్లీ వారికి పోటీచేసే అవకాశం ఉంది. వడ్డెబోయిన నర్సింహారావు డివిజన్‌ రిజర్వేషన్‌ కూడా అనుకూలంగా ఉండడంతో తిరిగి ఆయన పోటీ చేయనున్నారు. టీఆర్‌ఎస్‌లో పలువురు పోటీ చేద్దామని ఆశించిన నాయకులకు కూడా ఆయా డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్‌ కావడంతో వారి ఆసక్తికి బ్రేకులు పడ్డాయి. 

అభ్యర్థుల ఖరారుపై పార్టీల దృష్టి..

అధికార టీఆర్‌ఎస్‌లో అభ్యర్థిత్వాల కోసం పోటీ పెరిగింది. బరిలో దిగాలనకుంటున్న ఆశావహులు మంత్రి పువ్వాడను కలుస్తుండగా.. ఇప్పటికే కొందరికి సిగ్నల్‌ కూడా ఇచ్చారని, దీంతోవారంతా ఆయా డివిజన్లలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కాగా గత సారి కార్పొరేటర్‌గా పోటీచేసిన వారిలో సగంమందికి పైగా టికెట్లు దక్కే అవకాశం లేదు. పోటీచేసే అవకాశం లేని నాయకులకు.. వారి భార్యలకు టికెట్లు ఇస్తామన్న హామీ లభిస్తుండడంతో వారు కొంత ఊరట పొందుతున్నారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా శుక్రవారం వెలువడే అవకాశం ఉంది. విపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా డివిజన్ల వారీగా జాబితా సిద్ధం చేస్తోంది. మాజీ కార్పొరేటర్లతో పాటు పార్టీ నగర ముఖ్యనాయకులందరినీ ఎన్నికలబరిలో దించబోతున్నారు. సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ కూడా అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తుండటంతో పాటు.. రంగంలోకి దిగాలని రాష్ట్ర, జిల్లా నేతలను అధిష్ఠానం ఆదేశించడతో ముఖ్యనాయకులంతా పోటీకి దిగుతున్నారు. ఇక సీపీఎం, సీపీఐ పోటీ విషయంలో అధికారికంగా తమ నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించబోతున్నాయి. ఇప్పటికే ఈ రెండు పార్టీలు టీఆర్‌ఎస్‌తో జట్టు కట్టబోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. సీపీఐ ఐదు డివిజన్లు, సీపీఎం ఆరు డివిజన్లను అడుగుతున్నట్టు ప్రచారం. వామపక్షాలు అడిగినట్టు కాకుండా కొన్న డివిజన్లు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని, పొత్తు కుదిరితే కో ఆప్షన్‌లో వామపక్షాలకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 

కార్పొరేషన్‌ బరిలో మంత్రి పువ్వాడ సతీమణి?

ఖమ్మం మేయర్‌ ఆమేనంటూ ప్రచారం

ఈనెల 30న ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి బరిలోకి దిగుతున్నారన్న  ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో ఆమె 20వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తారని, ఆమే మేయర్‌ అవుతారంటూ ప్రచారం జరుగుతోంది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఖమ్మంలో తన భర్త పువ్వాడ అజయ్‌కుమార్‌ విజయంకోసం ఆమె విస్తృత ప్రచారం చేశారు. పలుచోట్ల సభలు, డివిజన్ల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించి అజయ్‌కుమార్‌ విజయంలో సగభాగంగా నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటివరకు ఆమె పోటీ చేయకపోయినా రాజకీయకుటుంబ నేపథ్యం ఉండడం, గత ఎన్నికల్లో తన భర్త తరపున ప్రచారం చేసి జనంలోకి వెళ్లడం ద్వారా ఆమె ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని తెలుస్తోంది. 20డివిజన్‌ అబ్యర్థిగా టీఆర్‌ఎస్‌ నుంచి నామినేషన్‌ వేసే అవకాశం ఉందని తెలుస్తుండగా.. దీనిపై మంత్రి పువ్వాడ కానీ, ఆయన అనుయాయుల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. 

Updated Date - 2021-04-16T06:09:25+05:30 IST