14 తరువాత రైళ్లకు రిజర్వేషన్‌.. 20వ వరకు రిగ్రెట్‌

ABN , First Publish Date - 2020-04-04T11:54:08+05:30 IST

14 తరువాత రైళ్లకు రిజర్వేషన్‌.. 20వ వరకు రిగ్రెట్‌

14 తరువాత రైళ్లకు రిజర్వేషన్‌..  20వ వరకు రిగ్రెట్‌

  •  బుక్‌ చేసుకునేందుకు అవకాశం 
  • లాక్‌డౌన్‌ తరువాత ప్రయాణాలకు ఏర్పాట్లు 
  • ముందుగానే టిక్కెట్ల రిజర్వేషన్‌ 
  • 20వ తేదీ వరకు రిగ్రెట్‌ 
  •  ఫ్లైట్‌ టిక్కెట్ల బుకింగ్‌కూ విమానయాన సంస్థలు అవకాశం 
  • ట్రావెల్‌ ఏజెన్సీలకు పెరుగుతున్న ఎంక్వయిరీలు   

(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను ఈ నెల 14వ తేదీ తరువాత పొడిగించే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం చూచాయగా వెల్లడించడంతో ప్రయాణాలకు అనేకమంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా వుందని గత నెల మార్చి 22న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ఆ తరువాత కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కరోజు కర్ఫ్యూతో కరోనా కట్టడి కాదని, లాక్‌డౌన్‌తోనే సాధ్యమంటూ మూడు వారాలు ప్రజలకు ఇళ్లకే పరిమితం కావాలని కోరింది. ఏప్రిల్‌ 14 వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించింది. అంతేకాకుండా ప్రజా రవాణాలోని రైల్వేలు, బస్సులు, విమాన సర్వీసులు, ప్రైవేటు సర్వీసులు అన్నింటినీ పూర్తిగా ఎక్కడికక్కడ నిలిపివేసింది.    బయట వారెవరూ దేశంలోకి రాకుండా సరిహద్దులు మూసేసింది. అలాగే రాష్ట్రాలు కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు జిల్లా సరిహద్దులను కూడా మూసేశాయి. దాంతో ఇతర ప్రాంతాలకు పనులపై వెళ్లినవారు ఎక్కడివారక్కడ చిక్కుకుపోయారు. వెనక్కి వచ్చే అవకాశం లేకుండా పోయింది.ఇలాంటి వారంతా తమ స్వస్థలాలకు ఎప్పుడు చేరుకుందామా? అని ఎదురుచూస్తున్నారు.


   మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నందున లాక్‌డౌన్‌ ఇంకా పెంచుతారేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని ప్రధాని సంకేతాలు ఇవ్వడంతో ఎవరికి వారు స్వస్థలాలకు ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైళ్లలో 120 రోజులు ముందుగానే టిక్కెట్లను రిజర్వ్‌ చేసుకునే సౌకర్యం ఉంది. రైల్వే అధికారులు ప్రభుత్వ ఆదేశం మేరు ఏప్రిల్‌ 14 వరకు మాత్రమే టిక్కెట్లను ఇవ్వకుండా బ్లాక్‌ చేశారు. ఆ తరువాత ఎవరైనా బుక్‌ చేసుకునే వీలుంది. దాంతో ఇతర రాష్ట్రాల్లో, జిల్లాల్లో వుండిపోయిన వారు వారి స్వస్థలాలకు వెళ్లడానికి రైలు టిక్కెట్లను బుక్‌ చేసుకుంటున్నారు. అయితే కొన్ని రైళ్లలో ఏప్రిల్‌ 15 నుంచి 20వ తేదీ వరకు టిక్కెట్లు బుక్‌ అయిపోయాయని, టిక్కెట్‌కు యత్నిస్తే రిగ్రెట్‌ అని తిరస్కరిస్తోందని తెలుస్తోంది.    అలాగే పలు విమానయాన సంస్థలు కూడా టిక్కెట్లను బుక్‌ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ అంశాలపై ట్రావెల్‌ ఏజెంట్లకు ఎక్కువగా ఎంక్వయిరీలు వస్తున్నాయి. తమకు టిక్కెట్లు బుక్‌ చేయాలని పలు వ్యాపార సంస్థలు, వ్యక్తులు కోరుతున్నారు.


   కానీ విమానాలకు మాత్రం అంతగా డిమాండ్‌ లేదని సమాచారం. ఇక ప్రజా రవాణా సంస్థ బస్సులకు ముందుగా టిక్కెట్‌ బుక్‌ చేసుకునే సౌలభ్యం వున్నప్పటికీ ఎవరూ దానిని పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. బస్సులు రోడ్లపైకి వస్తే...ఏదో ఒకటి పట్టుకొని గమ్యం చేరుకోవచ్చుననే ధీమాతో వున్నట్టు ట్రావెల్‌ ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు టిక్కెట్లు బుక్‌ చేసుకుంటున్న వారంతా లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకుపోయినవారేనని, ఇతరులు ఎవరూ ఈ సమయంలో ప్రయాణానికి సిద్ధంగా లేరని, ఏప్రిల్‌ 14 తరువాత ఒక వారం రోజులు తప్ప ఆ తరువాత కొన్నిరోజులు పెద్దగా రద్దీ వుండదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి

Updated Date - 2020-04-04T11:54:08+05:30 IST