Hyderabad లో బెటర్‌ ట్రాఫిక్‌ కోసం.. ఇతర నగరాల్లో అధ్యయనం..

ABN , First Publish Date - 2022-01-10T15:12:35+05:30 IST

మహా నగరంలో ట్రాఫిక్‌లో చిక్కితే ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి...

Hyderabad లో బెటర్‌ ట్రాఫిక్‌ కోసం.. ఇతర నగరాల్లో అధ్యయనం..

హైదరాబాద్‌ సిటీ : మహా నగరంలో ట్రాఫిక్‌లో చిక్కితే ఎప్పుడు బయటపడతామో తెలియని పరిస్థితి. అందులో అంబులెన్స్‌లు చిక్కుకుంటే వాటికి దారి కల్పించేందుకు పోలీసులు నానా కష్టాలు పడతారు. ఒక్కోసారి ఆలస్యం కారణంగా రోగుల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొంటోంది. అలాగే మంత్రుల పర్యటనలు, సమావేశాలు, ఇతర వీవీఐపీ మూమెంట్‌ సమయంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నిలిపివేస్తుండటంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమస్యలను క్రోడీకరించి ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి వాహనదారులను గట్టెక్కించడానికి హైదరాబాద్‌ సిటీ లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.


ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి సుమారు పది మెట్రోపాలిటన్‌ నగరాల్లో పర్యటించడానికి సిటీ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్‌ పోలీస్‌ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా నగరాల్లో బెటర్‌ ట్రాఫిక్‌ కోసం అక్కడి ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారు..?, అత్యవసర వాహనాలు సాఫీగా వెళ్లడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు..?, వీవీఐపీలు వెళ్తున్న సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..? వంటి అంశాలపై ఈ బృందాలు అధ్యయనం చేయనున్నాయి. వాటిలోని మంచి ప్రణాళికలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకొని నగరంలో అమలు చేయనున్నాయి. గతంలో ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా పని చేసిన అనుభవం ఉన్న సీపీ సీవీ ఆనంద్‌, ఇటీవల సిటీ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏవీ.రంగనాథ్‌ నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులను గాడిలో పెట్టేందుకు కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2022-01-10T15:12:35+05:30 IST