రేషన్‌డీలార్‌

ABN , First Publish Date - 2020-05-23T08:43:29+05:30 IST

మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 2,303 మంది డీలర్లు నిత్యావసరాల కోటాను పూర్తిచేశారు.

రేషన్‌డీలార్‌

ఆంధ్రజ్యోతి, విజయవాడ : మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 2,303 మంది డీలర్లు నిత్యావసరాల కోటాను పూర్తిచేశారు. ఈ కోటా ద్వారా వచ్చిన కమీషన్‌ను తిరిగి ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన నిత్యావసరాల కోటాకు డీలర్లు డీడీలు కట్టారు. సగటున 500 కార్డులు కలిగిన డీలర్‌ పంచదారకు రూ.20వేలు, కందిపప్పుకు రూ.5వేలు చొప్పున చెల్లిస్తాడు. బియ్యానికి కట్టే పనిలేదు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 2,303 మంది డీలర్లు ఒక్కొక్కరు రూ.20వేలు చొప్పున రూ.4.60 కోట్ల మేర డీడీలు చెల్లించారు.


ఈలోపు అనుకోకుండా కరోనా రావడంతో లాక్‌డౌన్‌ ప్రారంభమై పేదల కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఈ తరుణంలో కార్డుదారులకు ఉచిత నిత్యావసరాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ మొదటి అర్థనెల ఒకటో విడత ఉచిత కోటాను, ఏప్రిల్‌ రెండో అర్థనెల రెండో విడత కోటాను, మే మొదటి అర్థనెలలో మూడో విడత కోటాను, మే రెండో అర్థనెలలో నాల్గో విడత కోటా నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కోటాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్నవి కావటంతో డీలర్లు కట్టిన డీడీలు సివిల్‌ సప్లయిస్‌ దగ్గరే ఉండిపోయాయి.


డీలర్లు తమకు చెక్కుల రూపంలో ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్‌లకు పంపించాల్సిందిగా కోరినా ఇప్పటివరకు వారు కట్టిన డీడీల మొత్తాన్ని చెల్లించలేదు. ఇక ఉచిత నిత్యావసరాల విషయానికి వస్తే డీలర్లు పంపిణీ చేశారు కాబట్టి వారికి న్యాయబద్ధంగా కమీషన్లు ఇవ్వాలి. డీలర్ల సంఘాలు కోరితే  మొదటి విడత ఉచిత  నిత్యావసరాల కోటా కమీషన్‌ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ మొత్తాన్ని ఏప్రిల్‌ పంచదారకు డీలర్లు కట్టే డీడీలుగా ఉపయోగించుకున్నారు. అంటే డీలర్లకు నేరుగా కమీషన్‌ రాలేదు. మిగిలిన మూడు విడతల కోటాలకు కమీషన్‌ చెల్లింపుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. రెండు నెలలుగా డీలర్లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. 


డోర్‌ డెలివరీతోనూ సమస్య

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కార్డుదారులు రేషన్‌ డిపోలకు రాకుండా నేరుగా డోర్‌ డెలివరీ చేస్తామన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ బాధ్యతలను రెవెన్యూ యంత్రాంగానికి అప్పగిస్తే ఖర్చును మాత్రం డీలర్లపైనే మోపారు. ప్యాకింగ్‌, ట్రాన్స్‌పోర్టు సదుపాయం, హమాలీకి కూలీ వంటివి కూడా డీలర్లు చెల్లించారు. చాలామంది తహసీల్దార్లు డీలర్లు ఖర్చుపెట్టిన డబ్బును ఇప్పటివరకు చెల్లించలేదు.


కొంతమంది తహసీల్దార్లు ఈ సొమ్మును సొంత అవసరాలకు ఉపయోగించారన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో డీలర్లకు చెల్లించాల్సిన డబ్బును చెల్లించకపోవటం వల్ల రెండు నెలలుగా గుమాస్తాకు జీతం, షాపు అద్దెను కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇంటర్నెట్‌ చార్జీలు, కరెంట్‌ బిల్లు, శానిటైజర్లు, సబ్బుల కోసం ఎదురు ఖర్చు చేయాల్సి వస్తోంది. 


తీరిక లేదా..?

డీలర్లను పెట్టుబడి వనరులుగా ఉపయోగించుకుంటున్న సివిల్‌ సప్లయిస్‌కు వారి సమస్యలు మాత్రం కనిపించట్లేదు. తమకు సంబంధం లేని తప్పుల వల్ల నిత్యావసరాల కోటాను పొందలేకపోతున్న డీలర్లు సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

Updated Date - 2020-05-23T08:43:29+05:30 IST