Chitrajyothy Logo
Advertisement

చూసిందే... చూడబుద్ధేస్తోంది

twitter-iconwatsapp-iconfb-icon

వైన్‌కి ఓ లక్షణం ఉంది. ఎంత పాతదైతే అంత కిక్‌.కొన్ని సినిమాలు వైన్‌లాంటివే. యేళ్లు గడుస్తున్నా, వాటి క్రేజ్‌ తగ్గదు. సరికదా... పెరుగుతూ పోతుంటుంది. ‘పోకిరి’నే తీసుకోండి. విడుదలై పదహారేళ్లయ్యింది. దాన్ని మళ్లీ రిలీజ్‌ చేస్తే... టికెట్ల కోసం అభిమానులు క్యూ కట్టారు. చూసిన సినిమాకే.. థియేటర్లో మళ్లీ విజుల్సూ.. వన్స్‌మోర్లూ! ఓరకంగా ‘పోకిరి’ రీ రిలీజ్‌...చిత్రసీమలో కొత్త చర్చను లేవనెత్తింది. పాత సినిమాలకు కొత్త సొగసులు అద్ది, మళ్లీ రిలీజ్‌ చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలో పడ్డారంతా. రాబోయే రోజుల్లో ఇది ఓ ట్రెండ్‌గా మారే అవకాశం ఉంది.

చూసిందే... చూడబుద్ధేస్తోంది

సెకండ్‌ రిలీజ్‌ అనే మాట చిత్రసీమలో వినిపించి చాలా ఏళ్లయ్యింది. టీవీలు, ఛానళ్లూ లేని కాలంలో ఓ సూపర్‌ హిట్‌ చిత్రాన్ని రెండు మూడేళ్ల తరవాత మళ్లీ రిలీజ్‌ చేసేవారు. ప్రేక్షకులూ వాటిని అలానే ఆదరించేవారు. సెకండ్‌ రిలీజ్‌, థర్డ్‌ రిలీజ్‌లలో కూడా వంద రోజులు ఆడిన సినిమాలున్నాయి. అప్పట్లో సినిమా తప్ప మరో కాలక్షేపం లేదు. సినిమా కోసం థియేటర్లకు రావాల్సిందే. అందుకే... ఓ సినిమాని ఎన్నిసార్లు రిలీజ్‌ చేసినా ఆదరణ తగ్గేది కాదు. ఇప్పుడు అలా కాదు. శాటిలైట్‌ ఛానళ్లు బాగా విస్తరించాయి. టీవీలో వేసిన సినిమానే మళ్లీ వేస్తుంటారు. యూ ట్యూబ్‌ ఎలానూ ఉంది. అందులో నచ్చిన సినిమానీ, ప్రియమైన సన్నివేశాల్ని ఎన్నిసార్లు కావాలనుకుంటే, అన్నిసార్లు చూడొచ్చు. ఇక ఓటీటీలు అంటారా? మీట నొక్కితే వినోదం వెంట పడుతుంది. ఈ రోజుల్లో సినిమా ఎంత బాగున్నా, రెండోసారి థియేటర్లలో చూడడం లేదు. ‘ఓటీటీలోనో, శాటిలైట్‌లోనో వస్తుంది కదా’ అనుకుంటున్నారు. అలాంటి తరుణంలోనూ ‘పోకిరి’ రీ రిలీజ్‌, వాటికొచ్చిన కలక్షన్లూ... కొత్త ఆశలకు ఊపిరి పోస్తున్నాయి.

మహేశ్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న ‘పోకిరి’ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించారు. 4కె, డీటీఎస్‌ హంగులతో ఈ సినిమాని కొత్తగా తీర్చిదిద్దారు. ఈ షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలన్నది ఉద్దేశ్యం. పాత సినిమా, అప్పటికే చాలాసార్లు చూసేసిన సినిమా. కాబట్టి... స్పందన ఎలా ఉంటుందో అనుకొన్నారు. కానీ తీరా చూస్తే అభిమానుల నుంచి టికెట్ల కోసం పోటీ ఏర్పడింది. దాంతో థియేటర్లని పెంచుకొంటూ పోయారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ కలిపి దాదాపు 350 థియేటర్లలో పోకిరిని ప్రదర్శించారు. ఈ షోల ద్వారా రూ.3 కోట్లు ఆదాయం వచ్చింది. సాధారణంగా అగ్ర కథానాయకుల చిత్రాలకు ప్రీమియర్లు ప్రదర్శిస్తుంటారు. ఎంపిక చేసిన కొన్ని ప్రధాన నగరాల్లో ఈ స్పెషల్‌ షోలు ఏర్పాటు చేస్తారు. వాటికి ఎంత స్పందన వస్తుందో.. ‘పోకిరి’కి అంత వచ్చింది. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్‌ హంగామా మామూలుగా లేదు. విడుదలైంది పోకిరినా? లేదంటే మహేశ్‌ కొత్త సినిమానా? అన్నంత రేంజ్‌లో ఆ సందడి కనిపించింది. కొన్ని చోట్ల ‘ఒక్కడు’ చిత్రాన్ని ప్రదర్శించారు. దానికీ రెస్పాన్స్‌ అదిరిపోయింది.

గతేడాది పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజున ‘గబ్బర్‌ సింగ్‌’, ‘తొలి ప్రేమ’, ‘ఖుషి’ చిత్రాలన్ని ఓ థియేటర్లో వరుసగా ప్రదర్శిస్తే... అభిమానులు కిక్కిరిసిపోయారు. ఓరకంగా.. ‘పోకిరి’ రీ రిలీజ్‌కి ఈ స్పందన ఓ కారణం కావొచ్చు. ఈసారి పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజున ‘జల్సా’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ‘జల్సా’కి ఇప్పుడు ఆధునిక హంగులు జోడిస్తున్నారు. కొన్ని చోట్ల ‘జానీ’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల్నీ పునః ప్రదర్శిస్తారని టాక్‌. ఈ చిత్రాలకూ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్‌ చరిత్రను తిరగరాసిన కొన్ని చిత్రాల్ని ఇలానే విడుదల చేస్తే స్పందన బాగుంటుందన్నది నిర్మాతల ఆలోచన. ‘శివ’, ‘ఇంద్ర’, ‘ఠాగూర్‌’, ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’... తదితర చిత్రాల్ని రీ రీలీజ్‌ చేసే దిశగా ఆలోచిస్తున్నారు.

ఈ రీలీజ్‌లకు ఆద్యం పోసిన చిత్రం ‘మాయాబజార్‌’ అని చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్రసీమ గర్వంగా చెప్పుకొనే చిత్రాల్లో ‘మాయాబజార్‌’ ఒకటి. అదో గోల్డెన్‌ మూవీ. మాయాబజార్‌ నుంచి స్ఫూర్తి పొందని కళాకారుడు ఉండరేమో..? ఆ చిత్రాన్ని ఈతరం ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో రంగులు అద్దారు. కలర్‌ లో ‘మాయాబజార్‌’ని విడుదల చేశారు. చాలా యేళ్ల క్రితమే ఈ ప్రయోగం జరిగింది. దానికి మంచి ఫలితం కూడా దక్కింది. ‘మాయాబజార్‌’ని అభిమానించే ఆతరం అభిమానులు, ఈ చిత్రరాజం గురించి తెలుసుకోవాలని ఆరాటపడిన ఈతరం సినీ ప్రేక్షకులకు.. ఈ రంగుల సినిమా బాగా నచ్చింది. అయితే ఓ బ్లాక్‌ అండ్‌  వైట్‌ చిత్రాన్ని పూర్తి స్థాయి కలర్‌ చిత్రంగా మార్చడం వెనుక చాలా శ్రమ దాగి ఉంటుంది. ఖర్చు కూడా అధికం. కాబట్టే ఆ తరవాత అలాంటి ప్రయత్నాలు జరగలేదు. ‘మిస్సమ్మ’, ‘దేవదాసు’ లాంటి క్లాసిక్స్‌ని కూడా రంగుల్లో మారుస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ.. కుదర్లేదు.టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఓ పాత సినిమాకి రంగులు అద్దడమో, ఫోర్‌ కె సొబగు తీర్చిదిద్దడమో తేలికైన వ్యవహారం. ఒక్కో సినిమాకీ అన్నీ కలుపుకొని రూ.20 లక్షల వరకూ ఖర్చువుతుంది. కోట్లలో ఆదాయం వస్తున్నప్పుడు ఈ మాత్రం ఖర్చు పెట్టడం పెద్ద సమస్య కాదు. అయితే ఎన్ని సినిమాలు రీ రిలీజ్‌లు చేసినా అదంతా అభిమానుల కోసమే. సాధారణ ప్రేక్షకులు పాత సినిమాల్ని చూడ్డానికి థియేటర్లకు రారు. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకుల తీరు మారిపోయింది. థియేటర్‌కి వెళ్లి రూపాయి ఖర్చు పెట్టాలన్నా, పది రకాలుగా ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు టీవీల్లో, ఓటీటీల్లో అందుబాటులో ఉన్న పాత సినిమాల్ని టికెట్టు కొని మరీ చూస్తారనుకోవడం అత్యాశే. ఇది కేవలం అభిమానుల స్పెషల్‌ మాత్రమే.

రెండు నిమిషాల్లో ఫుల్‌!


‘పోకిరి’ని డిజిటల్‌ చేయడం వెనుక జరిగిన ప్రోసెస్‌ ఆసక్తికరం. డిజిటల్‌ చేయాలంటే ముందు ప్రింట్‌ వెర్షన్‌ కావాలి. ఎందుకంటే ‘పోకిరి’ రోజుల్లో డిజిటల్‌ లేదు. ప్రింట్‌లో మాత్రమే ఆ సినిమా విడుదలైంది. ఆ ప్రింట్‌ వెర్షన్‌ కోసం చిత్ర బృందం అన్వేషణ ప్రారంభించింది. ఎట్టకేలకు ఎక్కడో మారుమూల గ్రామంలో ఓ డిస్టిబ్యూటర్‌ దగ్గర ‘పోకిరి’ ప్రింట్‌ ఉందని తెలిసింది. దాన్ని వెదికి పట్టుకొంటే.. అందులో రెండు సీన్లు లేవు. దాంతో మళ్లీ ప్రింట్‌ కోసం గాలింపు మొదలైంది. మరో ప్రింటు అత్యంత  కష్టం మీద వెదికి పట్టుకొని హైదరాబాద్‌లోని ప్రసాద్‌ లాబ్స్‌లో డిజిటలైజ్డ్‌ చేశారు. అంతా అయ్యాక.. సౌండ్‌ మిస్సయ్యింది. ‘పోకిరి’ సమయంలో సౌండ్‌ కోసం వేరే సీడీ ఏర్పాటు చేసి పంపేవారు. ఆ సీడీలు ఎక్కడా లేవు. దాని కోసం లండన్‌ వరకూ వెళ్లాల్సివచ్చింది. లండన్‌లో ఓ సౌండ్‌ డిజైనర్‌ ఉన్నాడు. సినిమాలకు సంబంధించిన సౌండ్‌ ట్రాకులు సేకరించి, భద్రపరచడం తన హాబీ. అతన్ని పట్టుకొంటే.. ‘పోకిరి’ సౌండ్‌ దొరికింది.

చూసిందే... చూడబుద్ధేస్తోంది

అక్కడితో అయిపోలేదు. ఈ సినిమాని రీ రిలీజ్‌ చేయడానికి ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ‘పాత సినిమాల్ని మళ్లీ ఎవరు చూస్తారు’ అనేది వాళ్ల భయం. దానికితోడు ఈ టికెట్లన్నీ ఆన్‌ లైన్‌లో అమ్మాలని నిర్వాహకులు నిబంధన పెట్టారు. ఆన్‌ లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ మారు మూల గ్రామాల్లోకి ఇంకా విస్తరించలేదు. దాంతో.. పోకిరి టికెట్లు అమ్మడం కష్టమే అనిపించింది. చివరికి ఓ పోర్టల్‌తో మాట్లాడి, నిర్ణీత సమయంలో ఆన్‌లైన్‌లో పోకిరి టికెట్లు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేశారు. పోకిరి టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచగానే.. రెండంటే రెండు నిమిషాల్లో అన్నీ అమ్ముడుపోయాయి. అది చూసి నిర్వాహకులు షాక్‌ తిన్నారు. టికెట్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ చూసి థియేటర్లు పెంచుకొంటూ పోయారు. ఏఎంబీలో రెండు షోలు చాలు అనుకొంటే, చివరికి 12 షోలు వేయాల్సివచ్చింది. చివరి నిమిషాల్లో ప్రసాద్‌ ఐమాక్స్‌లోనూ విరివిగా షోలు ప్రదర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రతీ టికెట్‌నీ ఆన్‌ లైన్‌లోనే కొనుగోలు చేయడం విశేషం. టికెట్ల దారా వచ్చిన ఆదాయాన్ని ఆడిట్‌ చేయడం విశేషం. 

చూసిందే... చూడబుద్ధేస్తోంది

‘‘పోకిరి సినిమా కోసం జనాలు థియేటర్ల ముందు సందడి చేయడం ఇప్పుడో కొత్త చర్చకు దారి తీసింది. సినిమాల్ని  చూడ్డానికి జనాలు రావడం లేదన్నది ఒట్టి మాటే అని ‘పోకిరి’తో తేటతెల్లమైంది. థియేటరికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అనేది ఇప్పటికీ జనాలు కోరుకుంటున్నారు. ఓ సినిమాని థియేటర్లో చూడాలన్న కోరిక వాళ్లకు ఇంకా ఉంది. కాకపోతే.. వాళ్లకు నచ్చేలా సినిమా తీయాలంతే. పాత సినిమాకే ఈ రేంజ్‌లో గిరాకీ ఉంటే, కొత్త సినిమాలకు ఇంకెంత స్థాయిలో ఆదరణ ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన తరుణం ఇది’’

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...