నీరే లేదు కానీ.. నీటి తీరువా!

ABN , First Publish Date - 2021-06-16T05:11:21+05:30 IST

నీరు లేదు కానీ..నీటి తీరువా కట్టాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారని పలాస, వజ్రపుకొత్తూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే వంశధార కాలువ కానీ గత రెండేళ్లుగా చుక్క నీరు రావడం లేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం ఎకరాకు రూ.200 చొప్పున

నీరే లేదు కానీ.. నీటి తీరువా!
పలాస సమీపంలో షట్టర్‌ తూము వద్ద నిలిచిన చెత్త, వ్యర్థాలు




పన్ను కట్టాలని తాఖీదులు

ఆందోళనలో రైతులు

కొన్నేళ్లుగా శివారు ఆయకట్టుకు అందని వంశ‘ధార’

(పలాస)

నీరు లేదు కానీ..నీటి తీరువా కట్టాలని అధికారులు హుకుం జారీ చేస్తున్నారని పలాస, వజ్రపుకొత్తూరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే వంశధార కాలువ కానీ గత రెండేళ్లుగా చుక్క నీరు రావడం లేదని చెబుతున్నారు. అధికారులు మాత్రం ఎకరాకు రూ.200 చొప్పున నీటి తీరువా కట్టాలని నోటీసులు జారీ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంశధార ఎడమ ప్రధాన కాలువలో ఈ రెండు మండలాలు శివారు ఆయకట్టుగా ఉన్నాయి. పదిహేనేళ్లుగా కాలువలు పూర్తిస్థాయిలో ఆధునికీకరణకు నోచుకోలేదు. వరదల సమయంలో మాత్రమే శివారు ఆయకట్టుకు వంశధార నీరు కనిపిస్తుంది. లేకుంటే గగనమే. ఈ పరిస్థితుల్లో నీటి తీరువా కట్టాలని వీఆర్వోలు తాఖీదులు జారీ చేస్తున్నారు. వాస్తవానికి వంశధార నీరు ముందుగా శివారు ప్రాంతాలకు ఇచ్చి... తరువాత ఎగువ ప్రాంతాలకు ఇవ్వాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా టెక్కలి, నందిగాం మండలాల వరకే నీరు విడుదల అవుతుండడంతో రైతులకు సాగునీరు అందడం లేదు. దీనికి తోడు వంశధార నీరు పూర్తి సామర్ధ్యంతో విడుదల చేసినా పూడికలు, మరమ్మతుల కారణంగా నీరు అటు నుంచి అటే వెళ్లిపోతోంది. దీనిపై ఆ శాఖ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు రైతులు తీసుకువెళ్లినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. రెండు మండలాల్లో వంశధార కాలువ కింద 5వేల ఎకరాలు సాగవుతోంది. దీనికి ఆనుకొని 9 చెరువులు వరకూ ఉన్నాయి. అధికారులు తక్షణం స్పందించి కాలువలు ఆధునికీకరించి పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసినప్పుడే నీటితీరువా వసూలు చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనిపై తహసీల్దారు ఎల్‌.మధుసూధనరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా రైతుల నుంచి వినతులు వచ్చాయని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. 





Updated Date - 2021-06-16T05:11:21+05:30 IST