వ్యాక్సినేషన్‌ కేంద్రం పునరుద్ధరించండి

ABN , First Publish Date - 2021-05-18T04:03:17+05:30 IST

స్థానికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటుచేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను మూసివేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాక్సినేషన్‌ కేంద్రం పునరుద్ధరించండి
మాధవధారలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం

పది రోజులే తెరిచి మూసివేయడం అన్యాయం

జీవీఎంసీ 49, 50, 51 వార్డుల ప్రజలు వినతి

విశాఖపట్నం, మే 17: స్థానికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాటుచేసిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను మూసివేయడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విశాఖనగరం మాధవధార అంబేడ్కర్‌ కాలనీలోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన ఈ సెంటర్‌ వల్ల జీవీఎంసీ 49, 50, 51వ వార్డు ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండేది.


అటు బర్మాక్యాంపు నుంచి ఇటుమాధవధార ఆర్‌అండ్‌బీ కూడలి వరకు ఉన్న మూడు వార్డుల వారికి ఎంతో అందుబాటులోకి వచ్చినట్టయింది. పదిరోజులు టీకా మందు వేశాక ఎందుకో దీన్ని మూసివేశారు. కంచరపాలెం ఆర్పీపేట కేంద్రాలను కొనసాగిస్తూ మధ్యలోని ఈ కేంద్రాన్ని ఎందుకు మూసివేశారని ప్రశ్నిస్తున్నారు. మురళీనగర్‌ ప్రాథమిక పాఠశాల కేంద్రంలోనూ మొక్కుబడిగా రెండు రోజులు టీకామందు వేసి తర్వాత స్టాక్‌ లేదని నిలిపివేశారు.


ఈ ప్రాంతంలో చాలామంది రెండో డోస్‌ ఇంజక్షన్‌ కోసం వేచిఉన్నారు. మొదటి డోస్‌ వేసుకున్న ఎనిమిది వారాల్లో రెండోడోస్‌ వేసుకోవాల్సి ఉంది. దీంతో ఆలామంది స్థానిక కార్పొరేటర్‌ రెయ్యి వెంకటరమణ వద్దకు వెళ్లి కేంద్రం తెరిచేలా చూడాలని కోరగా, ఆయన సమస్య ఉత్తరం వైసీపీ సమన్వయకర్త కె.కె.రాజు దృష్టికి తీసుకువెళ్లారు. మరి ఏమవుతుందో చూడాలి.

Updated Date - 2021-05-18T04:03:17+05:30 IST