జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుతాం.
‘గణ’ అంటే ప్రజలు. ‘తంత్రం’ అంటే పాలన.. గణతంత్రం అంటే ప్రజాపాలన అని అర్థం. ఇక్కడ రాచరికం పాలన ఉండదు. ఎవరినైనా సరే ప్రతి ఐదేళ్లకోసారి ప్రజలు ఎన్నుకోవాల్సిందే.
బ్రిటీష్ వాళ్లు మనదేశాన్ని 200 ఏళ్లు పాలించారు. ఆగష్టు 15, 1947 స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చైర్మన్‌గా ఆగష్టు 29, 1947న రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. నవంబరు 26, 1949న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ అమోదం తెలిపింది. అప్పటి వరకూ బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారమే మన పాలన సాగేది. అయితే 1950 జనవరి 26 వ తేదీన డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మన దేశానికి తొలి రాష్ట్రపతి అయ్యారు. ఆ రోజు 21 ఫిరంగులతో సెల్యూట్‌ను అందుకున్నారు. అలా మన దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే ఆ రోజునుంచి మన దేశాన్ని ప్రజాస్వామ్య, సర్వసత్తాక, గణతంత్రదేశంగా పిలుచుకుంటున్నాం.