Sep 28 2021 @ 19:16PM

నేను ఎవ‌రినీ విమ‌ర్శించ‌లేదు: ‘రిపబ్లిక్’ చిత్ర దర్శకుడు

సుప్రీమ్ హీరో సాయితేజ్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ చిత్రం ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌కాబోతోంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా చిత్ర విశేషాలను మీడియాకు తెలియజేశారు. 


ఆయన మాట్లాడుతూ..

‘‘సెన్సార్ స‌భ్యుల‌కు సినిమా చాలా బాగా న‌చ్చింది. సింగిల్ క‌ట్ లేకుండా సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. చాలా నిష్ప‌క్షంగా, ఎలాంటి భేదభావాలు లేకుండా నిజాయితీగా తెర‌కెక్కించార‌ని అప్రిషియేట్ చేశారు. ఇందులో ప్ర‌జ‌ల‌కు ఏదీ మంచిది అనేది చెప్ప‌లేదు. ఓ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అనుకున్న‌ప్పుడు అది ఎలా అవ్య‌స్థంగా ఉంద‌ని ఎత్తి చూపిస్తూనే, అదొక వ్య‌వ‌స్థ‌గా మారాల‌ని సొల్యూష‌న్‌గా నిర్వ‌చ‌నం చెప్పే ప్ర‌య‌త్నం చేశాం. ఇప్పుడు స‌మాజంలోని వ్య‌వ‌స్థ‌లు, మ‌న ఆలోచ‌న‌లు, దాని వ‌ల్ల ప్ర‌భావిత‌మయ్యే అంశాల‌ను ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాను. వ్య‌క్తిగ‌తంగా దూషించిన‌ప్పుడు ఇత‌రులు బాధప‌డ‌తారు. దాని నుంచి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అదే మ‌న‌స్సాక్షితో మాట్లాడిన‌ప్పుడు ఏమీ కాదు. నొప్పించే విధంలో కాకుండా చెప్పాలి. బ్యూరోక్రాట్స్ మీద‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ‌నే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాను. పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు ఏమైనా చేయ‌వ‌చ్చు అనే ఓ భావ‌న అంద‌రిలో ఉంది. దాన్ని అంద‌రం ఎంజాయ్ చేస్తున్నాం కూడా. కానీ అది త‌ప్పు. మ‌నం ఎలా ఆలోచిస్తున్నామో అదే వ్య‌వ‌స్థ అవుతుంది. నేను ఎవ‌రినీ వేదిక‌పై విమ‌ర్శించ‌లేదు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ‌ల్ల పార‌దర్శ‌క‌త ఉంటుంది. కానీ త‌ర్వాత స్టెప్స్ ఏంట‌ని నేను అడిగానంతే.  


డైలాగ్ అనేది నా దృష్టిలో మాట‌ల గార‌డీ కాదు. ప్ర‌తి మాట ఓ ఆలోచ‌న‌. ఆలోచ‌న‌ను, త‌త్వాన్ని ప‌దునుగా ఎలివేట్ చేయాలి. ఆలోచ‌న ఎంత బ‌లంగా ఉంటే డైలాగ్ అంత ప‌దునుగా ఉంటుంది. ఈ సినిమా క‌థ‌ను చూసిన నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ రీమేక్ రైట్స్‌ను కూడా కొనేశారు. ఫ్ర‌స్టేష‌న్‌లో, బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకూడదు. అలా తీసుకున్న నిర్ణ‌య‌మే డైన‌మైట్ సినిమా. అదే స‌మ‌యంలో నేను యు.ఎస్‌లో ఫ్యామిలీని వ‌దిలేసి వ‌చ్చాను. ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి కార‌ణాల‌తో క‌న్విన్స్ అయి ఒప్పుకున్న సినిమా అది. ఆ సినిమాను నేను 9 రోజులు మాత్ర‌మే షూట్ చేశాను. త‌ర్వాత వాళ్ల‌కు కావాల్సి వ‌చ్చిన‌ట్లు వాళ్లే షూట్ చేసుకున్నారు. దాని త‌ర్వాత నేను ద‌ర్శ‌కుడిగా ఇత‌రుల న‌మ్మ‌కాన్ని సంపాదించుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టింది. రిప‌బ్లిక్ ఆ న‌మ్మ‌కాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నాను. ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. 


త‌మిళంలో కాక్కాముట్టై అనే సినిమాను చూసిన‌ప్పుడు అందులో ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌ట‌న బాగా ఆక‌ట్టుకుంది. ఆమెతో ఎప్పుడైనా ప‌నిచేయాల‌ని అనుకున్నాను. ఈ సినిమాకు కుదిరింది. అయితే నేను రొటీన్‌కు భిన్నంగా న‌టీన‌టుల‌ను ఇత‌ర పాత్ర‌ల్లో న‌టింపజేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. అలా ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను ఇందులో ఎన్నారై అమ్మాయిగా చూపించాను. త‌ను అద్భుతంగా న‌టించింది. ర‌మ్య‌కృష్ణగారు క్యారెక్ట‌ర్‌లో ముందుగా భార‌తీరాజానో, మ‌హేంద్ర‌న్ వంటి డైరెక్ట‌ర్స్‌ను పెట్టుకోవాల‌ని క్యారెక్ట‌ర్ రాసుకున్నాను. అయితే న‌టీన‌టుల ఎంపిక గురించి మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో తేజ్ ర‌మ్య‌కృష్ణ‌గారిని ఆ పాత్ర‌కు తీసుకుంటే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌ను చెప్పాడు. క్యాస్టింగ్‌లో కొత్త‌ద‌నం కోసం ఆ పాత్ర‌ను మ‌హిళ‌గా మార్చాం. ఆ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌గారిని లేదా విజ‌య‌శాంతిగారినో తీసుకోవాల‌ని అనుకున్నాం. అయితే అప్ప‌టికే విజ‌య‌శాంతిగారు పాలిటిక్స్‌లో ఉన్నారు. ఆమె రాజ‌కీయ జీవితం ఎక్క‌డ ప్ర‌భావిత‌మ‌వుతుందోన‌ని భావించి, ర‌మ్య‌కృష్ణ‌గారిని అప్రోచ్ అయ్యాం. అప్ప‌టికే న‌ర‌సింహ‌, బాహుబ‌లి సినిమాల్లో త‌న పాత్ర‌ల‌ను ర‌మ్య‌గారు మ‌రొక‌రు చేయ‌లేర‌నే గొప్ప‌గా చేసున్నారు. దాంతో ఈ పాత్ర‌కు ఆమె న్యాయం చేస్తుంద‌ని భావించాం. 

‘ఇంద్ర‌ప్ర‌స్థం’ అనేది చంద్ర‌బాబునాయుడుగారు, వై.ఎస్‌గారి జీవితాల‌ను బేస్ చేసుకుని వారీ కాలేజీ జీవితాల నుంచి వై.ఎస్‌.ఆర్ మ‌ర‌ణం వ‌ర‌కు ఉండే సినిమా. ఈ సినిమాను గాడ్‌ఫాద‌ర్ రేంజ్‌లో మూడు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాను. వెబ్ సిరీస్‌గానూ కూడా తెర‌కెక్కించ‌వ‌చ్చు. ఇంద్ర‌ప్ర‌స్థం అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను అనుకున్నాం. విష్ణువ‌ర్ధ‌న్‌గారితో ఎన్టీఆర్‌గారి బ‌యోపిక్ గురించి, ఈ క‌థ గురించి చ‌ర్చించాను. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌న సినిమా అనేలా బ‌య‌ట‌కు వెళ్లింది. కానీ ఇంద్ర‌ప్ర‌స్థం అనే సినిమా గురించి ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు. ఎలా రూపొందుతుందో అంద‌రూ ఎదురుచూస్తున్నారు. పెద్ద క్యాస్టింగ్ అవ‌స‌రం. స‌మ‌యం ప‌డుతుంది. ఇలాంటి స‌మ‌యంలో విష్ణువ‌ర్ధ‌న్‌గారు వారి జీవితాల‌పై సినిమాను తీస్తాన‌ని చెప్పిన‌ప్పుడు నాకేం అభ్యంత‌రం అనిపించ‌లేదు. అయితే స్టోరి ప‌రంగా నా క‌థ‌లో ఎలిమెంట్స్‌ను తీసుకుంటే లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని అన్నాను. 


బాహుబ‌లి ది బిగినింగ్ ముఖ్యోద్దేశం ఇండియాకు చెందిన గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్ కావాల‌నేదే. అలాంటి గొప్ప ఆశ‌యాన్ని ఒక‌రిద్ద‌రు ద‌ర్శ‌కుల‌తో ఒక‌ట్రెండు సంవత్స‌రాల్లో చేసేది కాదు. దానికి స‌మయాన్ని వెచ్చించ‌డం చాలా అవ‌స‌రం. ఉదాహ‌ర‌ణ‌కు గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను ప‌దేళ్లు క‌థ‌గా రాస్తే ప‌ది ప‌దిహేనేళ్లు స్క్రీన్‌ప్లే రాశారు. తీశారు. ఆపేశారు. మ‌ళ్లీ తీశారు. అలా ఎంతో క్లారిటీగా చేశారు. ఆ లెవ‌ల్ టీమ్ టెక్నీషియ‌న్స్‌, టైమ్‌, ఇన్వెస్ట్ చేస్తేనే ఔట్‌పుట్ వ‌స్తుంద‌ని భావించి.. మా జీవితాన్నంతా అక్క‌డే వెచ్చించ‌లేమ‌ని అర్థం చేసుకుని రాసిందంతా అక్క‌డే పెట్టేసి ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాం. ఓ సీజ‌న్‌ను రాసుకుని తీసే ప్రాజెక్ట్ అది కాదు. కాస్త షూట్ చేసినా కూడా ప‌క్క‌కు వ‌చ్చేశాం..’’ అని తెలిపారు.