ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీసుల రిహార్సల్స్
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే ఏర్పాట్లు
రోజూ పోలీసుల రిహార్సల్స్ జూ సిద్ధమవుతున్న శకటాలు
ఈసారి పురవీధుల్లో శకటాల ప్రదర్శన
పాయకాపురం, జనవరి 22 : గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ బుధవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఉత్సవాలకు సర్వంసిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుల రిహార్సల్స్ జరుగుతుండగా, శకటాల ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించే 16 శకటాలను సిద్ధం చేస్తున్నామన్నారు. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ అన్ని విశేషాలతో వ్యవసాయ శాఖ శకటం ఉంటుందని తెలిపారు. జగనన్న పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు లబ్ధి చేకూర్చే విధానాన్ని తెలిపే పశు సంవర్థక శాఖ శకటం, మత్స్యకార భరోసా, ఆక్వా ల్యాబ్ తదితర అంశాలను వివరించేలా మత్స్యశాఖ శకటం ఉంటాయని పేర్కొన్నారు. విద్యాశాఖకు సంబంధించి నాడు-నేడు, అమ్మ ఒడి ప్రధాన అంశాలుగా రెండు శకటాలు ఉంటాయన్నారు. జగనన్న విద్యా దీవెన తదితర పథకాలపై సాంఘిక సంక్షేమ శాఖ శకటం ఉంటాయని వెల్లడించారు. పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తున్న జగనన్న కాలనీలపై గృహ నిర్మాణ శాఖ శకటం, అంగన్‌వాడీలు, ప్రీ స్కూల్స్‌పై మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ శకటం, క్లీన్ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శకటం, జగనన్న పచ్చతోరణాన్ని వివరించేలా అటవీ శాఖ శకటం, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి, మార్పులు, మారుతున్న మన పల్లె ముఖచిత్రం వంటి అంశాలతో గ్రామ వార్డు సచివాలయ శకటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ఆయన చెప్పారు. కొవిడ్ కారణంగా పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతిస్తామని, నగర ప్రజలు వీక్షించేలా పురవీధుల్లో శకటాల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్, సహాయ సంచాలకుడు భాస్కర్ నారాయణ, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్‌వీ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.