జిల్లా సమగ్రాభివృద్ధిలో ముందడుగు

ABN , First Publish Date - 2022-01-27T06:51:42+05:30 IST

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటన నడిపేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు.

జిల్లా సమగ్రాభివృద్ధిలో ముందడుగు
జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం చేస్తున్న కలెక్టర్‌ నివాస్‌, ఎస్పీ సిద్ధార్థకౌశల్‌, జేసీ మాధవీలత తదితరులు

కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ముమ్మర ప్రయత్నాలు

విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రగతి

రానున్న రోజుల్లో పేదలందరికీ ఇళ్లు

గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ నివాస్‌

అత్యుత్తమ సేవలందించిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసా పత్రాలు 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటన నడిపేందుకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. 73వ గణతంత్ర దినోత్సవాన్ని మచిలీ పట్నంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఎస్పీ సిద్ధార్థకౌశల్‌తో కలసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశ అతి పెద్ద రాజ్యాంగం ప్రజలు స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన హక్కులను కల్పించిందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన ఉద్యమంలో జిల్లాకు చెందిన నాయకులు ప్రముఖ పాత్ర పోషించారన్నారు. దేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించడానికి కృషి చేసిన మహనీయుల స్ఫూర్తితో, అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి బాట నడిపిస్తున్నామన్నారు. 


నూరు శాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నూరు శాతం పూర్తి చేయగలిగామన్నారు. ఇప్పటివరకు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు మొత్తం 22 వేల మందికి బూస్టర్‌ డోస్‌ అందిం చామని కలెక్టర్‌ తెలిపారు. 15 - 18 సంవ త్సరాల వయ సున్న యువతకు వ్యాక్సిన్‌ వేశామన్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొ నేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. కొవిడ్‌ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున, సభ్యులను కోల్పోయిన 23 కుటుం బాల్లోని చిన్నారులకు రూ.10 లక్షల చొప్పున అంద జేశామన్నారు. 


సంక్షేమ రంగానికి పెద్దపీట  

జిల్లాలో 5,27,146 మందికి  ప్రతినెలా ఒకటో తేదీన రూ.134.19 కోట్లను సామాజిక  పింఛన్ల రూపంలో నగదు అందజేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. వైస్సార్‌ ఆసరా ద్వారా 57వేల గ్రూపులకు రూ.1,042 కోట్లను, మహిళలకు 30,913 మందికి రూ.46.37 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. జగనన్నతోడు ద్వారా చిరువ్యాపారులు 24వేల మందికి వడ్డీలేని రుణాలను, వైఎస్సార్‌ బీమా కింద 2,024 క్లెయిమ్‌లను పరిష్కరించి 2.54కోట్లను పరిహారంగా ఇచ్చామని తెలిపారు. చేపలవేట నిషేధసమయంలో 8,733 మత్స్యకార కుటుంబాలకు రూ.10వేల చొప్పున రూ.8.73 కోట్లను అందించామన్నారు. 


3,838 కోట్లతో నూతన గృహాలు 

జిల్లాలో నిరుపేదలందరికీ సొంతింటికలను సాకారంచేసే దిశగా 2,13,231 గృహాలను రూ. 3,838 కోట్లతో నిర్మిం చేందుకు అనుమతులు ఇచ్చామన్నారు. వీటిలో 1,05,648 గృహాలు తొలివిడత ప్రారంభించామన్నారు. జగనన్న ఓటీఎస్‌ పథకం ద్వారా లబ్ధిదారులకు సంపూర్ణ గృహ హక్కు కల్పిం చేందుకు 2.79 లక్షల మందిని గుర్తించామన్నారు.

నాడు-నేడులో భాగంగా పాఠశాలలకు రూ.272కోట్లతో రెండు విడతలుగా నూతన హంగులు సమకూర్చామని చెప్పారు. అమ్మఒడి ద్వారా 3.76 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.564కోట్లను జమ చేశామన్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం ద్వారా మూడు సంవత్సరాల్లో 3.26 లక్షల మంది రైతులకు రూ.935 కోట్లను జమచేశామని చెప్పారు. ఈ ఏడాది 5.12 లక్షల మంది రైతులకు రూ.8,078 కోట్లను పంట రుణాలుగా, లక్షా 1,11,000 మందికి రూ.275 కోట్లను పంటబీమా ఇచ్చా మన్నారు. ఇప్పటి వరకు 45,340 మంది రైతుల నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.


ఉపాధిహామీతో 1.38 లక్షల పనిదినాలు 

ఉపాధి హామీ పథకం ద్వారా 2021-22 సంవత్సరంలో 1.38 కోట్ల పని దినాలను కల్పించి, రూ. 314 కోట్ల విలువైన పనులు చేయించామన్నారు. ఉపాధి పనుల్లో రాష్ట్రంలో  జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అత్యుత్తమంగా పనిచేసిన ఉద్యోగులు, అధికారులకు మంత్రి పేర్నినాని, జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక,  జేసీలు  మాధవీలత, శివశంకర్‌, మోహన్‌ కుమార్‌, శ్రీవాస్‌ నుపూర్‌, అజయ్‌కుమార్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఆర్డ్డీవో ఖాజావలి ప్రశంసాపత్రాలు అందజేశారు. 



Updated Date - 2022-01-27T06:51:42+05:30 IST