గణతంత్ర వేళ... మన ఘనత చాటేలా..

ABN , First Publish Date - 2022-01-20T05:13:58+05:30 IST

అంకితభావంతో నిరంతర సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు కొత్తగూడేనికి చెందిన నర్తకి మధురాపంతుల సీతామహాలక్ష్మి

గణతంత్ర వేళ... మన ఘనత చాటేలా..

అంకితభావంతో నిరంతర సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు కొత్తగూడేనికి చెందిన నర్తకి మధురాపంతుల సీతామహాలక్ష్మి. తన హావభావాలు, హస్తముద్రలు, పదనర్తనలతో దేశ విదేశాల్లో నృత్యాభిమానులను మంత్రముగ్ధుల్ని చేసిన ఆమె వందల మందికి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. తెలుగువారి సంపద అయిన కూచిపూడి నృత్య వైభవాన్ని ఈ ఏడాది ఢిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవాల్లో ఆమె నేతృత్వంలోని శిష్య బృందం ప్రదర్శించనుంది. ఈ సందర్భంగా సీతామహాలక్ష్మి ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు...


‘‘దాదాపు పాతికేళ్ళ నాటి సంగతి ఇది. సింగరేణి సంస్థలో ఫ్యామిలీ డే సందర్భంగా పోటీలు నిర్వహించారు. డ్యాన్స్‌ పోటీలో నేను పాల్గొన్నాను. నా నృత్యానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ’బహుమతి నీకే’ అని అందరూ చెప్పారు. కానీ నాకు బహుమతి రాలేదు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ప్రముఖ ప్రేరిణీ నాట్యాచార్యుడు రతన్‌కుమార్‌ను కలిసి... ‘‘నాకు బహుమతి ఎందుకు రాలేదు?’’ అని అడిగాను. ‘‘నేను నీకు వేసినవి సున్నా మార్కులు’’ అంటూ చూపించారు. నేను దిగ్ర్భాంతి చెందాను. అందరూ మెచ్చుకున్న నా ప్రదర్శనకు సున్నా మార్కులా? చాలా బాధనిపించింది. కారణం ఏమిటని అడిగాను. ‘‘నీలో లయ ఉంది. కానీ నువ్వు ఎంచుకున్న పాట సరైనది కాదు. ఆసక్తి ఉంటే ఆంధ్రనాట్యంలో నీకు శిక్షణ ఇస్తాను’’ అని ఆయన బదులిచ్చారు. అది నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన రోజు.


ఆ సినిమాలే ప్రేరణ...

నేను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో పుట్టాను. పదకొండు నెలల వయసులోనే మా నాన్న చనిపోయారు. నా బాల్యమంతా ఢిల్లీలో మా మేనమామ దగ్గర గడిచింది. ఇంటర్‌ వరకూ అక్కడే చదివాను. తరువాత హైదరాబాద్‌ వచ్చి, చదువు కొనసాగించాను. ఇలా ఎన్నో ఒడుదొడుకుల మధ్య నా ప్రయాణం సాగింది. నాట్యమంటే చిన్నప్పటి నుంచీ ఆసక్తి. ‘సప్తపది’, ‘స్వర్ణకమలం’ లాంటి నృత్య ప్రధాన చిత్రాలే దానికి ప్రేరణ. అందుకే శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నాను. 1994లో మధురాపంతుల ప్రసాద్‌తో నాకు వివాహమైంది. ఆయన సింగరేణి సంస్థ ఉద్యోగి కావడంతో గోదావరిఖనిలో ఉండేవాళ్ళం. అబ్బాయి పుట్టడం, ఇంటి బాధ్యతలతో నా అభిరుచులకు తాత్కాలికంగా విరామం ఇచ్చినా, నాట్యం పట్ల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. అందుకే సింగరేణి ఫ్యామిలీడే పోటీల్లో పాల్గొన్నాను. అప్పుడు... నా నాట్యం గురించి నాట్యాచార్యుడు రతన్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలు నాలో పట్టుదలను పెంచాయి. ఆయన దగ్గర ఆంధ్ర నాట్యం నేర్చుకుంటానని నా భర్తను అడిగారు. ‘‘ఇంటి బాధ్యతలకు ఆటంకం లేకపోతే సరే!’’ అన్నారు. రతన్‌కుమార్‌ గోదావరిఖనికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్‌లో ఉండేవారు. రెండేళ్ళ వయసున్న మా అబ్బాయిని తీసుకొని... రోజూ కరీంనగర్‌ వెళ్ళి, నృత్య తరగతులకు హాజరయ్యేదాన్ని. కష్టమైనా భరించేదాన్ని. కానీ నా భర్తకు కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయానికి బదిలీ కావడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది. అయితే అక్కడ ఉమెన్స్‌ కాలేజీలో నృత్య శిక్షకురాలు మధు నిర్మల దగ్గర నృత్యం అభ్యసించే అవకాశం దొరికింది. సర్టిఫికెట్‌ కోర్సు కూడా పూర్తి చేశాను. ఆ తరువాత వేదాంతం వెంకట చలపతి గారి దగ్గర శిక్షణ పొంది... కూచిపూడిలో డిప్లమా చేశాను. ఆధునిక కూచిపూడికి ఆద్యులైన పద్మశ్రీ వెంపటి చినసత్యం గారి అబ్బాయి వెంపటి రవిశంకర్‌ దగ్గర పొందిన శిక్షణ నా నాట్యంలో కొత్త శైలిని తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో.. ‘నవదుర్గ’ నృత్య రూపకంలో చంద్రఘంటగా చేసిన నాట్యానికి ప్రశంసలు లభించాయి. వెంపటి చినసత్యం గారి నృత్య దర్శకత్వంలో ‘శ్రీకృష్ణపారిజాతం’లో, వేదాంతం వెంకట చలపతి నృత్య నిర్దేశకత్వంలోని ‘నరకాసుర వధ’ రూపకంలో శ్రీకృష్ణుడిగా అభినయించాను. దీపా శశిధరన్‌ రూపొందించిన ‘పంచనాయిక’లో సత్యభామగా నర్తించాను. మన దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా,  యూరప్‌లోని ఏడు దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. కూచిపూడి సిద్ధేంద్ర యోగి ఉత్సవాలు, వరుసగా ఆరేళ్ళకు పైగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, నాదనీరాజనం.. ఇలా ఎన్నో గొప్ప కార్యక్రమాల్లో నా నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 


అది నాకు గర్వకారణం...

నాకు తెలిసిన విద్యను నలుగురికీ పంచాలనే ఆలోచనతో... 2002లో ఖమ్మం జిల్లాలోని కొత్తగూడంలో ‘శ్రీ దుర్గాసాయి నృత్యనికేతన్‌’ పేరుతో కూచిపూడి నాట్యాలయాన్ని స్థాపించాను. ఇప్పటివరకూ 600 మందికి పైగా నా దగ్గర శిక్షణ పొందారు. నా స్వీయ నృత్య దర్శకత్వంలో రూపొందించిన ‘శ్రీ శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకం, ‘జయ జయ దుర్గే’, ‘జై తెలంగాణ’, ‘నృత్య భారతీయం’ లాంటి అంశాలు ప్రముఖుల మన్ననలు పొందాయి. అన్నమాచార్య కీర్తనను సమకాలీన నాట్యంతో కలిపి చేసిన ప్రయోగానికి సిడ్నీలో స్టాండింగ్‌ ఒవేషన్‌ లభించడాన్ని ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర శిక్షణ పొందినవారు నాట్య కళాకారులుగా రాణిస్తూ ఉండడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. ‘వందేభారతం’ పేరిట మన దేశ సంస్కృతిని చాటి చెపంనడం కోసం... ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌, సాంస్కృతిక, రక్షణ శాఖల నేతృత్వంలో కిందటి ఏడాది నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 29 వరకూ... దేశవ్యాప్తంగా నృత్య పోటీలు నిర్వహించారు. మా బృందం జిల్లా, రాష్ట్ర, జోనల్‌ స్థాయిల్లో గెలుపొంది, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయింది. ఢిల్లీలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాల్లో నా శిష్యులు 20 మంది తమ ప్రతిభను, కూచిపూడి నృత్య వైభవాన్ని చాటబోతున్నారు. నా దగ్గర శిక్షణ పొందిన వారిలో కొందరు నృత్యాన్ని కెరీర్‌గా మార్చుకుంటున్నారు. అది నాకు గర్వకారణం. ఇదంతా నా వైపు నుంచి చిన్న ప్రయత్నం మాత్రమే. నేను ఈ స్థాయికి చేరడానికి కారణం నా భర్త ప్రోత్సాహం, గురువుల ఆశీస్సులు, నా శిష్యులు, వారి తల్లిదండ్రుల సహకారం.’’


సేవలోనూ మిన్న...

సీతా ప్రసాద్‌గా కొత్తగూడెం ప్రజలకు సుపరిచితురాలైన సీతామహాలక్ష్మి సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తన సంపాదనలో పది శాతం వరకూ సామాజిక సేవా కార్యక్రమాలకు ఆమె ఖర్చు చేస్తున్నారు. దివ్యాంగులకు, కళల పట్ల ఆసక్తి ఉన్న పేదలకూ తన నాట్యాలయం ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొత్తగూడెంలో కూచిపూడి నృత్య అకాడమీకి శాశ్వత భవన నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. నామమాత్రపు రుసుముతో నృత్య శిక్షణను అందిస్తున్న సీతామహాలక్ష్మి మంచి గాయని, చిత్రకారిణి కూడా. దూరదర్శన్‌ ‘ఏ’ గ్రేడ్‌ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆమె ‘స్త్రీ శక్తి’, ‘అవుట్‌ స్టాండింగ్‌ యంగ్‌ పర్సన్‌ ఆఫ్‌ ఇండియా’ అవార్డులు, ఒడిశా-కటక్‌ మహోత్సవాల్లో ‘నృత్య శిరోమణి’ అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ‘ప్రతిభా పురస్కారం’... ఇలా ఎన్నో గౌరవాలను అందుకున్నారు. 2017లో యూకే పార్లమెంట్‌ ఆహ్వానంపై ‘హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో కూచిపూడి నృత్యం గురించి ఉపన్యాసం, ప్రదర్శన ఇచ్చారు.

                                                                                                  జోగం తారక రామారావు, కొత్తగూడెం 

Updated Date - 2022-01-20T05:13:58+05:30 IST