నేటి నుంచే గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-23T07:28:45+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకుని 73వ గణతంత్ర దినోత్సవాలను ఆదివారం నుంచే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో..

నేటి నుంచే గణతంత్ర వేడుకలు

 నేతాజీ 125వ జయంతి 

సందర్భంగా కేంద్రం నిర్ణయం


న్యూఢిల్లీ, జనవరి 22 :  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకుని 73వ గణతంత్ర దినోత్సవాలను  ఆదివారం నుంచే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఆదివారం జరిగే కార్యక్రమంలో ప్రఽధాని నరేంద్రమోదీ నేతాజీకి పుష్పాంజలి ఘటించనున్నారు. అనంతరం ఇండియా గేట్‌ వద్ద నేతాజీ హోలోగ్రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరోపక్క, గణతంత్ర దినోత్సవం  పరేడ్‌కు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది జరగబోయే పరేడ్‌లో 16 మార్చ్‌ఫాస్ట్‌ బృందాలు, 17 మిలటరీ బ్యాండ్‌ బృందాలు, 25 శకటాలు పాల్గొంటున్నాయి. ఆర్మీ తరఫున 14 రకాల ఆయుధాలను పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. ఇందులో పలు యుద్ధ ట్యాంకులతోపాటు ఆయుధాలతో నిండిన ఇతర వాహనాలు, మిస్సైళ్లు ఉంటాయి.  ఓ హెలికాఫ్టర్‌ బృందం ఆకాశంలో విన్యాశాలు చేయనుంది. ఇండియన్‌ నేవీ మార్చ్‌ఫాస్ట్‌ బృందానికి లెఫ్ట్‌నెంట్‌ కమాండర్‌ ఆంచల్‌ శర్మ అనే మహిళా అధికారి సారథ్యం వహించనున్నారు. 17 మిలటరీ బ్యాండ్‌ బృందాలు తమ సంగీతంతో అలరించనున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్రాలు, భద్రతా విభాగాలకు చెందిన 25 శకటాలు పరేడ్‌లో పాల్గొననున్నాయి.  26 ఉదయం పదిన్నర గంటలకు మొదలయ్యే పరేడ్‌ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. రిపబ్లిక్‌ డే ముగింపు వేడుకలకు సూచికగా ‘అబైడ్‌ విత్‌ మీ(నాతో నే ఉండు)’ అనే శ్లోకాన్ని ఆలపించి బీటింగ్‌ రీట్రీట్‌ను ముగించడం ఆనవాయితీ. అయితే, ఈసారి కార్యక్రమం నుంచి ఈ శ్లోకాలాపనను తొలగించారు. మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన ఈ శ్లోకాన్ని కార్యక్రమం నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. 

Updated Date - 2022-01-23T07:28:45+05:30 IST