‘ఘన’తంత్రం

ABN , First Publish Date - 2021-01-27T06:15:22+05:30 IST

మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. అడుగడుగునా జాతీయ భావం ఉప్పొంగింది.

‘ఘన’తంత్రం
ఐజీఎంసీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

ఐజీఎంసీలో ఘనంగా వేడుకలు

గౌరవ వందనాన్ని స్వీకరించిన గవర్నర్‌

మచిలీపట్నంలో పతాకావిష్కరణ చేసిన కలెక్టర్‌


మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. అడుగడుగునా జాతీయ భావం ఉప్పొంగింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడ నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించగా, మచిలీపట్నంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ రాజకీయ పార్టీలు తమ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా, విద్యాసంస్థల్లోనూ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.


అభివృద్ధికి పునరంకితం : మచిలీపట్నం వేడుకల్లో కలెక్టర్‌ ఇంతియాజ్‌

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని మచిలీపట్నం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తిని చాటుతూ, పలు పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయా విభాగాల్లో అత్యుత్తమ సేవలందించిన 711 మంది అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. పోలీస్‌ జాగిలాల విన్యాసాలు అబ్బురపరిచాయి. కలెక్టర్‌ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో కృష్ణాజిల్లాకు గొప్ప స్థానమున్నదని, ఆ స్ఫూర్తిని ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదన్నారు. 


జిల్లా ప్రగతి ఇలా.. 

ఈ సందర్భంగా కలెక్టర్‌ జిల్లాలో అమలవుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోదాహరణగా వివరించారు. 845 గ్రామ, 440 వార్డు సచివాలయాలు, గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలను తీసికెళుతున్నామన్నారు. 


కొవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో..

కొవిడ్‌పై అలుపులేని పోరాటం కొనసాగిస్తున్నామని కలెక్టర్‌ వివరించారు. వైద్యులు, పోలీస్‌, పారిశుధ్య కార్మికులు ఈ పోరాటంలో ముందుండి నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను జిల్లాలో 30 కేంద్రాల్లో వేస్తున్నామని, ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడకుండా స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో పేదలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.


రైతులకు భరోసా

వైఎస్సార్‌ రైతు భరోసా ద్వారా జిల్లాలో మొదట విడత రూ. 234.44కోట్లు, రెండో విడత రూ.305కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. కౌలు రైతులకు మొదటి విడత రూ.10.82 కోట్లు, రెండో విడత రూ.78.36 కోట్లను జమచేశామని, గత ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన 1.62 లక్షల మంది రైతులకు రూ.122 కోట్లను నష్ట పరిహారంగా అందించామని చెప్పారు.


ఇంటికే నాణ్యమైన బియ్యం

‘ఫిబ్రవరి నుంచి నాణ్యమైన బియ్యాన్ని పేదలకు ఇంటి వద్దనే అందజేయనున్నాం. ఇందుకోసం జిల్లాకు 817 మినీట్రక్కులు అందుబాటులో ఉన్నాయి.’ అని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 4.15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ. 539 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని చెప్పారు. జిల్లాలో పలు పథకాలు జయప్రదంగా అమలు చేస్తున్నామని గణాంకాలతో సహా వివరించారు.


పిల్లలపై దృష్టి పెట్టాలి

మద్యం మహమ్మారి నుంచి కుటుంబాలను కాపాడేందుకు మద్య నిషేధం అమలు చేస్తున్నామని కలెక్టర్‌ తెలిపారు. యువత మాదకద్రవ్యాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని, దీనిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలన్నారు. మతసామరస్యాన్ని పెంపొందిచండంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిస్తున్న పోలీస్‌ యంత్రాంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జేసీలు మాధవీలత, శివశంకర్‌, మోహనకుమార్‌, ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు, ఏఎస్పీలు వకుల్‌జిందల్‌, సత్యనారాయణ, మల్లికాగర్గ్‌, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్‌డీవో ఖాజావలి, డ్వామా పీడీ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-01-27T06:15:22+05:30 IST