త్రివర్ణ శోభితం

ABN , First Publish Date - 2021-01-27T04:53:41+05:30 IST

ఉమ్మడి జిల్లాలో గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

త్రివర్ణ శోభితం
జెండావందనం చేస్తున్న రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, చిన్నారుల నృత్య ప్రదర్శన

  • ఘనంగా గణతంత్ర దినోత్సవం
  • వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా


ఉమ్మడి జిల్లాలో గణతంత్ర వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాడవాడలా, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యాసంస్థలపై మువ్వన్నెల జెండాలను ఎగుర వేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ ఎలాంటి హడావిడి లేకుండా సాదాసీదాగా నిర్వహించారు. వైరస్‌ వ్యాప్తి కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా రద్దు చేశారు.


ప్రభుత్వ పథకాలు పటిష్టం : రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ప్రభుత్వ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసు కవాతులో ప్రతిభచాటిన కమాండర్‌ రమాలక్ష్మిని కలెక్టర్‌తోపాటు అదనపుకలెక్టర్లు డాక్టర్‌ హరీష్‌, ప్రతీక్‌జైన్‌, ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ కవిత అభినందించారు. ఈసందర్భంగా గణతంత్ర వేడుకలను ఉద్దేశించి కలెక్టర్‌ మాట్లాడారు. అధికారులు అంకితభావంతో, నిజాయితీతో, నిస్వార్థంగా, పారదర్శకంగా ప్రజలకు సేవలందించాలని సూచించారు. 

ప్రతి ఒక్కరికి కొవిడ్‌ టీకా..

జనవరి 16 నుంచి జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభమైనట్లు తెలిపారు. తొలి విడతలో 4,175 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య సిబ్బందికి టీకా అందించామన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో పోలీసులు, పారిశుధ్య కార్మికులు, 50 ఏళ్లు పైబడిన వారికి, ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ..

జిల్లాలో 19,333 ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణం కానున్నట్లు తెలిపారు. సింగిల్‌ విండోలో పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులు పొందేలా రూపొందించిన టీఎ్‌స-ఐపాస్‌ ద్వారా 847 పరిశ్రమలకు 18.24కోట్ల పెట్టుబడితో 2,91,000 మం దికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. 

ఫారెస్ట్‌ అధికారులకు ప్రతిభా పురస్కారాలు..

హరితహారంలో ప్రతిభ చూపిన శంషాబాద్‌ ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి జె. పీర్యనాయక్‌, రంగారెడ్డి ఫారెస్ట్‌ సెక్షన్‌  అధికారి ఎన్‌. శ్రీధర్‌కు ప్రతిభా పురస్కారాలను కలెక్టర్‌ అందజేశారు. దీంతోపాటు ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున నగదును అందించారు. 

మహిళా సంఘాలకు చెక్కు పంపిణీ

రంగారెడ్డిజిల్లా జీవనజ్యోతి జిల్లా మహిళసమాఖ్య(3096 ఎస్‌హెచ్‌జిలకు) రూ.125,46, 90,000 చెక్కును జిల్లా కలెక్టర్‌  అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ హరీష్‌, ప్రతీక్‌జైన్‌ పంపిణీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం 9,626 స్వయం సహాయక సంఘాలకు 361 కోట్లు రుణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. స్ర్తీనిధి బ్యాంకు ద్వారా రూ.35 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. 

జాబ్‌మేళాతో 2,770 మందికి ఉపాధి

నిరుద్యోగ యువతీ యువకులకు జీవనోపాధి కల్పించేందుకు ఉచిత శిక్షణ, జాబ్‌ మేళా ద్వారా 2,770 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. ఆసరా పథకం కింద అర్హులైన 1,67,400 మంది వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ, పైలేరియా బాధితులు, ఒంటరి మహిళలకు ప్రతినెలా రూ.40 కోట్లు పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 4,91,637 మంది 45 వేల పనిదినాలు కల్పించి రూ.155 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 


బంగారు తెలంగాణ సాధనకు ముందుకు సాగాలి : వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : బంగారు తెలంగాణ సాధన కోసం ముందుకు సాగుతూ, సమగ్రాభివృద్ధి సాధించే దిశగా పునరంకితమవుదామని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు పిలుపునిచ్చారు. మంగళవారం వికారాబాద్‌ పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పౌసుమి బసు మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధి ఫలాలను అన్నివర్గాలకు అందించేందుకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నేతృత్వంలో రూపొందించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, నాటి నుంచి నేటి వరకు దేశాభివృద్ధికి సేవలందించిన అన్నిరంగాల ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. 

దేశ స్వాతంత్య్రం కోసం త్యాగం చేసిన మహానుభావుల స్ఫూర్తితో వికారాబాద్‌ జిల్లా ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని ఆమె గుర్తుచేశారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం, మునిసిపల్‌, గ్రామీణ పారిశుధ్య కార్మికుల సమిష్టి కృషితో జిల్లాలో కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామన్నారు. ఈనెల 16 నుంచి ప్రారంభమైన కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మొదటి విడతలో 3,026 మంది ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేశారని, ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అందరి భాగస్వామ్యంతో స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భూగర్భ జలాల నిల్వల సంరక్షణ కోసం చేసిన కృషికి జిల్లాకు జాతీయ స్థాయిలో 3వ స్థానం లభించిందని చెప్పారు. హరితహారంలో 91.65 శాతం లక్ష్యం సాధించి రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచామన్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా జిల్లాలో 2598 కిలోమీటర్ల పైపులైన్‌ వేసి ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో రూ.21.34 కోట్లతో 97 రైతువేదికలను రైతులకు అందుబాటులో తీసుకువచ్చామన్నారు.  ఈ ఏడాది 2,18,352 మంది కూలీలకు 62,91,540 పని రోజులు కల్పించి జిల్లాను రాష్ట్రంలో 6వస్థానంలో నిలిపామని తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన నిర్మాణం పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా ప్రజలకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల వంటి సేవలు పారదర్శకంగా, వేగవంతంగా అందుతున్నాయని తెలిపారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో రైతుబంధు కింద వికారాబాద్‌ జిల్లాలో 2,07,313 మంది రైతుల ఖాతాల్లో రూ.290.24కోట్లు జమ చేశారని తెలిపారు. రైతు బీమా కింద 266మంది లబ్ధిదారుల నామినీలకు రూ.13.30 కోట్లు అందజేశారన్నారు. రాష్ట్రంలో మొత్తం కందిపంట దిగుబడిలో మన జిల్లా నుంచే 44 శాతం ఉత్పత్తి అవుతోందని చెప్పారు. ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో రైతులు 15,231 ఎకరాల్లో పండ్లు, 26,757 ఎకరాల్లో కూరగాయలు సాగు చేశారన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా రైతుల ఆధ్వర్యంలో మోమిన్‌పేట, కులకచర్లలో కొనసాగుతున్న ఎఫ్‌పీవో కేంద్రాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మత్స్యకారుల అభివృద్ధికి నీటి లభ్యత మేరకు 509 చెరువుల్లో కోటి చేప పిల్లలను వేశారని, జీవనోపాధి పెంపొందించేందుకు 300 మంది మత్స్యకారులకు రూ.89.60 లక్షల రుణాలు ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, ఏఎస్పీ రషీద్‌, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న కవాతు

గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ రత్నం నేతృత్వంలో సాయుధ బలగాలు, పోలీసులు, హోంగార్డులు నిర్వహించిన కవాతు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమం, భరోసా, సంక్షేమ శాఖలు, వ్యవసాయ అనుబంధం, జిల్లా వైద్య ఆరోగ్యం, అటవీ, పశువైద్య పథకం (1962) స్టాల్స్‌ ఏర్పాటు చేయగా, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ అంబులెన్స్‌ (108), 102 వాహనాలను ప్రదర్శనకు ఉంచారు. 

81 మందికి ఉత్తమ ప్రశంసా పత్రాలు

గణతంత్ర వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు, రైతులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్లు సమక్షంలో వీటిని అందజేశారు. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, జడ్పీ సీఈవో ఉష,  డీఆర్‌డీవో కృష్ణన్‌, డీపీవో షేక్‌ రిజ్వానా, డీఎస్‌వో రాజేశ్వర్‌, బీసీడబ్ల్యువో పుష్పలత, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ భోగీశ్వర్లు, ఎస్‌డీపీవో సంజీవరావు, ఇన్‌స్పెక్టర్లు రవికుమార్‌, డీకే లక్ష్మిరెడ్డి, శ్రీనివాసరావు, డాక్టర్‌ రమ్యశ్రీ, డీఎస్‌వో డాక్టర్‌ అర వింద్‌కుమార్‌, ఎంపీడీవోలు కె.ఉష, లక్ష్మినారాయణ, డాక్టర్‌ హాతిరాం, టీ పీవో శ్రీనివాసులు, ఏపీఎం జి.శోభ, ఏపీవో వై.శ్రీను, ఏఏసీవో మల్లికార్జున్‌, నందకుమార్‌, ఆర్‌ఎం స్త్రీ నిధి శ్రీను, జ్ఞానేశ్వర్‌, హెచ్‌వో అబ్దుల్‌ గఫార్‌, ఎస్‌వో విజయకుమార్‌ ప్రశంసాపత్రాలు అందుకున్నారు. 


సమగ్రాభివృద్ధి వైపు అడుగులు : అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి) : మేడ్చల్‌- మల్కాజ్‌గిరిజిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని కొవిడ్‌-19 వైరస్‌ ప్రభావంతో నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్‌ కె.విద్యాసాగర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా విద్యాసాగర్‌ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధి ఫలాలను అన్నివర్గాలకు అందించుటకు మహనీయులు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ద్వారా గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నామని వెల్లడించారు. కరోనాను నియంత్రించడంలో వైద్య, మునిసిపల్‌, పంచాయతీ, పోలీసు, రెవెన్యూ యంత్రాంగం చేసిన కృషి అనన్య సామాన్యమైనదని వెల్లడించారు. కరోనాను అరికట్టడంలో తమవంతు కృషి చేసిన ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో 3,270 ప్రభుత్వ సిబ్బందికి విజయవం తంగా కరోనా వ్యాక్సిన్‌ను ఇచ్చామన్నారు. టీకా రూపకల్పనలో జిల్లాలోని ఔషధ పారిశ్రామిక సంస్థలు ముఖ్య భూమిక పోషించడం గర్వకారణమని తెలిపారు. అన్ని పీహెచ్‌సీ పరిధిలో ఉచితంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని, మాతా శిశు సంక్షేమంలో భాగంగా కేసీఆర్‌ కిట్‌ పథకం కింద ఇప్పటివరకు జిల్లాలో 7,399 కిట్లు అందించామని వెల్లడించారు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు, మ్యూటేషన్లు పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌ను ప్రారంభించిందని, జిల్లాలోని మూడుచింతలపల్లి నుంచి శ్రీకారం చుట్టడం గర్వకారణమని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతిలో జిల్లాలో వైకుంఠధామాలు, స్మృతివనాలు, పార్కులు, డంపింగ్‌యార్డులు, పచ్చదనం కోసం నర్సరీలు, విద్యుత్‌ సౌకర్యం వంటివి చేపట్టామని తెలిపారు. రైతుల సమన్వయంతో వారి సమస్యలు-పరిష్కారాలు చర్చించేందుకు జిల్లాలో 9 రైౖతువేదికలను రూ.1.98కోట్లతో నిర్మించి అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. రైతు బంధు పథకం కింద  30,200మంది రైతులకు రూ. 65.62కోట్లు అందించామన్నారు. వానాకాలంలో రూ.13.10 కోట్లతో 6,944 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. సామాజిక భద్రత కోసం జిల్లాలో ఆసరా కింద 40లక్షల మందికి రూ.24కోట్లు అందిస్తున్నట్టు వెల్లడిం చారు. స్ర్తీ నిధి ద్వారా 4,295ఎస్‌హెచ్‌జీలకు రూ.13.17 కోట్లు మంజూరు చేశామని, 2018 సంఘాలకు రూ.68.78కోట్లు అందించి,వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేశామని తెలిపారు. హరితహారం కింద జిల్లాలో 61.67లక్షల మొక్కల లక్ష్యానికి గానూ 70.43లక్షల నాటామని తెలిపారు. గొర్రెల పంపిణీ పథకం కింద ఇప్పటివరకు 3,675 యూనిట్లను పంపిణీ చేశామని, మత్స్య అభివృద్ధి పథకంలో 183 చెరువుల్లో రూ.35లక్షల విలువ గల చేపపిల్లలను వదిలామన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.14.700కోట్లతో పరి శ్రమలు నెలకొల్పి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన వారికి ఆదుకునేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకంలో భాగంగా 27,200మంది వీధి వ్యాపారులకు బ్యాంకుల ద్వారా ఒక్కొక్కరి రూ.10వేల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణ భవన నిర్మాణ, కార్మిక సంక్షేమ చట్టం కింద ఇప్పటివరకు 682మంది కార్మికులకు రూ.3.28కోట్ల ఆర్థిక సాయాన్ని అందించినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద 6,380 మంది లబ్ధిదారులకు రూ.63.76కోట్లు అందించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 2,350 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరు చేయగా 560 పూర్తి చేశామన్నారు. నగరంలో ఉంటున్న వారి కోసం జిల్లాలో 36,216ఇళ్లు నిర్మిస్తున్నామని, ఇప్పటివరకు 364మందికి పంపిణీ చేసినట్లు తెలిపారు. రజకుల కోసం ఆధునిక యంత్ర పరికరాలతో నిర్మిస్తున్న దోబీఘాట్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. అంబేద్కర్‌ విదేశీ విద్యానిధి పథకం ద్వారా 20మంది విద్యార్థులకు రూ.4.2కోట్లు మంజూరు చేశామన్నారు. 15మంది మైనార్టీ విద్యార్థులను రూ.1.58కోట్లతో విదేశాలకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. రూ.18.20కోట్ల మైనింగ్‌ నిధులతో 226 అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు వెల్లడించారు.  కలెక్టరేట్‌పై అదనపు కలెక్టర్‌ జాన్‌ శ్యాంసన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. 



Updated Date - 2021-01-27T04:53:41+05:30 IST