గణతంత్ర వేడుకలకు సిద్ధం

ABN , First Publish Date - 2022-01-26T05:56:33+05:30 IST

గణతంత్ర వేడుకలకు సిద్ధం

గణతంత్ర వేడుకలకు సిద్ధం
స్టేడియంలో రిహార్సల్స్‌..

త్రివర్ణ పతాకాలు, విద్యుత్‌ దీపాలతో సుందరంగా ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్డేడియం

ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ను పరిశీలించిన గవర్నర్‌ ప్రత్యేక కార్యదర్శి సిశోడియా

పాయకాపురం, జనవరి 25: జాతీయ సమైక్యత ఉట్టిపడేలా త్రివర్ణ పతాకాలు, విద్యుత్‌ దీపాల కాంతులతో గణతంత్ర దినోత్సవ శోభను సంతరించుకున్న ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియం బుధవారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు సిద్ధమైంది. స్టేడియంలో మంగళవారం ఫుల్‌ డ్రెస్‌ రిహార్సల్స్‌ నిర్వహించారు. రిహార్సల్స్‌ను గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిశోడియా, రాష్ట్ర అడిషనల్‌ పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌, ఏపీఎస్పీ బెటాలియన్‌ అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌ బి.శంకర్‌బ్రాత భక్షి, ప్రొటోకాల్‌ డైరెక్టర్‌, జీఏడీ డిప్యూటీ సెక్రటరీ ఎం.బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, కలెక్టర్‌  జె. నివాస్‌, నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా పరిశీలించారు. పోలీసు పరేడ్‌లో కర్నాటక స్టేట్‌ పోలీసు, ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ కర్నూల్‌, ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కాకినాడ, ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ విజయనగరం, ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌ వెంకటగిరి, ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌ కడప బృందాలతో పాటు బ్రాస్‌ బ్యాండ్‌ ఏపీఎస్పీ 2వ బెటాలియన్‌ కర్నూల్‌, 3వ బెటాలియన్‌ కాకినాడ, 5వ బెటాలియన్‌ విజయనగరం, 6వ బెటాలియన్‌ మంగళగిరి, 9వ బెటాలియన్‌ వెంకటగిరి, 11వ బెటాలియన్‌ బాకరావుపేట, 14వ బెటాలియన్‌ అనంతపురం, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, ఏపీ యూనిట్‌ హైదరాబాద్‌, పైప్‌బ్యాండ్‌ ఏపీఎస్పీ బెటాలియన్‌ మంగళగిరి బృందాలు పాల్గొన్నాయి. నిర్ణయించిన కాలవ్యవధిలో బృందాలు పరేడ్‌లో పాల్గొని కవాతు చేశాయి. కలెక్టర్‌ నివాస్‌, అధికారులు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జేసీలు కె.మాధవీలత, కె.మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ జి.ప్రవీణ్‌చంద్‌ పాల్గొన్నారు. 

ప్రదర్శనకు 16 శకటాలు ..

పాయకాపురం: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రదర్శించేందుకు 16 శకటాలను ఏర్పాటు చేస్తున్నామని సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అలంకృత శకటాల తుది ఏర్పాట్లను ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మంగళవారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతు భరోసాపై వ్యవసాయ శాఖ శకటం ఉంటుందని తెలిపారు. పశు సంవర్ధక శాఖ శకటం, మత్య్స శాఖ శకటాలు ప్రదర్శిస్తామని తెలిపారు. నాడు-నేడు, అమ్మ ఒడి ప్రధాన అంశాలుగా విద్యాశాఖ శకటాలు రెండు ఉంటాయన్నారు. జగనన్న విద్యాదీవెన తదితర పథకాలపై సాంఘిక సంక్షేమ శాఖ శకటం, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన మూడు శకటాలు ప్రదర్శనలో పాల్గొంటాయన్నారు. జగనన్న కాలనీలపై గృహ నిర్మాణ శాఖ శకటం, అంగన్వాడీలు, ఫౌండేషన్‌ ప్రీస్కూల్స్‌కు మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ శకటం, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ పథకాలపై అవగాహన కల్పించే సెర్ప్‌ శకటం, పరిశ్రమల శాఖ శకటం, క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శకటం, జగనన్న పచ్చతోరణాన్ని వివరించే అటవీ శాఖ శకటం, గ్రామ, వార్డు సచివాలయ శకటం ప్రధాన ఆకర్షణగా ఉంటాయని తెలిపారు. పౌర సంబంధాల శాఖ జాయింట్‌ డైరక్టర్‌ కిరణ్‌కుమార్‌, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరక్టర్‌ శ్రీధర్‌, శకటాల ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-26T05:56:33+05:30 IST