Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాలనలో దివ్యాంగులకు ప్రాతినిధ్యం

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కులు గాని, ఆదేశిక సూత్రాలు గాని, న్యాయ స్థానాల ద్వారా వర్తించే పౌర హక్కులు గాని దివ్యాంగులకు ఉపయోగపడే విధంగా అమలు కావటం లేదు. రాజకీయ భాగస్వామ్యం లేకపోవటంతో దివ్యాంగులు వెనుకబాటుతనానికి గురవుతున్నారు. ప్రతిచోట అథమ శ్రేణి పౌరులుగానే పరిగణించబడుతున్నారు.


జనాభాలో పది శాతం ఉన్న దివ్యాంగులకు కనీస హక్కులు, న్యాయం అందటం లేదు.  వైకల్యం పట్ల వివక్ష లేని సమాజ నిర్మాణ లక్ష్యాలను మానవ హక్కుల కోణం నుంచి పరిశీలించాలి. ‘‘దివ్యాంగుల చేత దివ్యాంగుల యొక్క దివ్యాంగుల కొరకు’’ అన్న విధంగా దివ్యాంగుల సాధికారిత సాధన కావాలి. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వలన, ప్రభుత్వాల లోపభూయిష్టమైన పాలన మూలంగా అనేక మంది దివ్యాంగులు తయారైనారు. తరతరాలుగా వివక్షకు, అపహాస్యాలకు, దోపిడికి గురైన దివ్యాంగులకు సాంఘిక న్యాయం అందకపోగా, సకలాంగుల చేతిలో దౌర్జన్యాలకు, అత్యాచారాలకు, దాడులకు, అకృత్యాలకు గురవుతున్నారు. 


రాజకీయ అధికారమే మాస్టర్‌ కీ అని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ గతంలోనే చెప్పారు. రాజకీయ అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో వారే అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించగలరు. గ్రామ స్థాయి వార్డు మెంబర్లు మొదలుకొని పార్లమెంట్‌ వరకు చట్టసభల్లో దివ్యాంగులను భాగస్వామ్యం కల్పించినప్పుడే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. కాలానుగుణంగా సమాజంలో వచ్చే మార్పులను, దివ్యాంగులపై వాటి ప్రభావాన్ని నిరంతరం అధ్యయనం చేయాలి. దీని కోసం ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. దివ్యాంగుల సమస్యలపై ఈ కేంద్రాల్లో తరచూ చర్చలు జరగాలి. దివ్యాంగులు పరస్పరం తరచు మాట్లాడుకునే ఏర్పాట్లు చేయటం వల్ల వారిలో న్యూనతా భావం పోయి ఆత్మస్థైర్యం పెరిగే అవకాశం ఉంటుంది. 


చట్టాలపై దివ్యాంగులకు అవగాహన ఉండాలి. దివ్యాంగ మహిళలపై వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నా ఆ సంఘటనలు వెలుగు చూడటం లేదు. చట్టాలు తెలియక వారు అన్యాయానికి గురవుతున్నారు.  వారిలో ఆత్మస్థైర్యం, సమానత్వ స్పృహ కల్పించాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై వుంది. 1995, 2016  దివ్యాంగుల చట్టాల ప్రకారం దివ్యాంగులను మానసికంగా గానీ, శారీరకంగా గానీ హింసకు గురిచేస్తే చట్ట రీత్యా కఠిన శిక్షలు తప్పవని అందరికీ అర్థం అయ్యే విధంగా వివరించాలి. దివ్యాంగులు తమకు జరిగిన అన్యాయం గురించి సమీప పోలీసు స్టేషనుకు వెళ్ళి ఫిర్యాదు ఇచ్చే స్థితిలో వారిలో చైతన్యం కలిగేలా చర్యలు తీసుకోవాలి. అధికారిక నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు జనాభా ప్రాతిపదికన స్థానాల్ని కేటాయించాలి. ముందుగా పాలకుల్లో, ప్రభుత్వంలో, అధికారుల్లో మార్పు రావాలి. వీరు దివ్యాంగులను గౌరవిస్తే అందరూ గౌరవించటం ప్రారంభిస్తారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలు వారి అభ్యున్నతికి సంబంధించి నిర్దిష్టమైన చర్యలు ప్రకటించాలి.

పెదమళ్ళ శ్రీనివాసరావు

Advertisement
Advertisement