ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ ఎఫెక్ట్.. రెండేళ్ల పాటు..

ABN , First Publish Date - 2020-07-10T18:00:08+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో స్టైరిన్‌ ప్రభావంపై రెండేళ్లు నిరంతర అధ్యయనం జరగాలని హై-పవర్‌ కమిటీ సూచించింది. ప్రమాదం జరిగిన రోజున స్టైరిన్‌ ట్యాంకు నుంచి వెలువడిన విషవాయువు(ఆవిరి) పీల్చి 12 మంది చనిపోగా 585 మంది అస్వస్థతతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే.

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ ఎఫెక్ట్.. రెండేళ్ల పాటు..

స్టైరిన్‌ ఎఫెక్ట్‌ రెండేళ్లు!

ఎల్జీ పాలిమర్స్‌ విషవాయువు ప్రభావంపై నిరంతర అధ్యయనం

ప్రజలతోపాటు జంతువులు, వృక్షాలు, పంటలు, నేల, నీరు, గాలి తరచూ పరిశీలన

గ్యాస్‌ పీల్చిన వారు క్యాన్సర్‌ సంబంధ వ్యాధులబారినపడే ప్రమాదం

అందుబాటులో పది రకాల వైద్య నిపుణులు ఉండాలి

ఆ 585 మంది ఆరోగ్యంపై ప్రత్యేక రికార్డులు నిర్వహించాలి 

నివేదికలో హై-పవర్‌ కమిటీ సూచన


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌ బాధిత గ్రామాల్లో స్టైరిన్‌ ప్రభావంపై రెండేళ్లు నిరంతర అధ్యయనం జరగాలని హై-పవర్‌ కమిటీ సూచించింది. ప్రమాదం జరిగిన రోజున స్టైరిన్‌ ట్యాంకు నుంచి వెలువడిన విషవాయువు(ఆవిరి) పీల్చి 12 మంది చనిపోగా 585 మంది అస్వస్థతతో ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ప్రమాదంపై వివిధ వర్గాల సాంకేతిక నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాలను నివేదికలో పొందుపరిచిన కమిటీ.. ఏయే అంశాలపై అధ్యయనం జరగాలో స్పష్టంగా పేర్కొంది. బాధిత గ్రామాల్లో ప్రజలు, జంతువులు, వృక్షాలు, పంటలు, నేల, నీరు, గాలిపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ప్రజలకు తగిన ఆరోగ్య సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించింది. 


క్యాన్సర్‌ సోకే ప్రమాదం

స్టైరిన్‌ ఆవిరిని ఎక్కువసేపు పీల్చిన వారికి దీర్ఘకాలంలో కాన్సర్‌ సంబంధిత వ్యాధులు లుకేమియా, లింఫోమియా వచ్చే అవకాశం ఉందని అమెరికా పర్యావరణ రక్షణ సంస్థ వెల్లడించిందని కమిటీ పేర్కొంది. అందువల్ల బాధిత గ్రామాలకు పది రకాల వైద్య నిపుణులను  కేటాయించి, బాధితులకు ఎప్పుడు అనారోగ్యం కలిగినా దానిని స్టైరిన్‌ కోణంలో విశ్లేషించాలని సూచించింది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో చేరి డిశ్చార్జి అయిన 585 మందికి ప్రత్యేక ఆరోగ్య రికార్డులు నిర్వహించాలని పేర్కొంది. వైద్య బృందంలో న్యూరాలజీ డాక్టర్‌ తప్పనిసరిగా ఉండాలని, మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున గైనికాలజిస్టులు కూడా ఉండాలని, గర్భిణులు, ప్రసవం అయ్యాక పుట్టే బిడ్డల ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది. వృద్ధులను ప్రత్యేకంగా చూడాలని పేర్కొంది.


హై-పవర్‌ కమిటీ చేసిన మరికొన్ని సూచనలు

స్టైరిన్‌ ఆవిరిగా మారి గాలిలో కలిసింది. ఆక్సిజన్‌ను హరించింది. ట్యాంకు నుంచి  ఆవిర్లు రావడం ఆగిపోయిన తరువాత ఆ ప్రాంతపు గాలిలో ఆక్సిజన్‌ శాతం పెరిగింది. స్టైరిన్‌ ఆవిరి బరువైనది కావడం వల్ల కిందకు దిగి ద్రవరూపంలోకి మారిపోతుంది. సూర్యరశ్మి తగిలితే క్రమంగా అదృశ్యమైపోతుంది. ప్రస్తుతం అక్కడ గాలిలో ఎటువంటి సమస్య లేనప్పటికీ, అప్పుడప్పుడు వాసనలు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నందున తరచూ గాలిని కూడా పరీక్షించాలి. 


నీటిలో స్టైరిన్‌ చేరితే... పైన తెట్టులా తేలుతుంది. ప్రవాహమైతే దానితోపాటు కొట్టుకుపోతుంది. నీరు నిల్వ ఉండే చెరువులాంటి ప్రాంతాలైతే క్రమంగా కిందకు దిగి అక్కడ స్థిరపడే అవకాశం ఉంటుంది. అక్కడ మైక్రో ప్లాస్టిక్‌గా రూపాంతరం చెందుతుంది. అందువల్ల నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో స్టైరిన్‌ చేరినట్టయితే ఆ నీటిని తరచూ పరీక్షించాలి. మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ నీటిని ‘నీరి’ సంస్థ ఇప్పటికే పలుమార్లు పరీక్షించి, తాగడానికి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పడంతో జీవీఎంసీ నీటిని సరఫరా చేయడం ప్రారంభించింది.


స్టైరిన్‌ ప్రభావం అక్కడి నేలపై ఎలా ఉంటుందనే దానిపై కూడా అధ్యయనాలు చేయాల్సి ఉంది. ఇది భూమిపై పొరగా ఏర్పడుతుంది. సెడిమెంట్‌గా మారే అవకాశం ఉంది. ఆ తరువాత అది పగిలి చిన్న సూక్ష్మరేణువులుగా విడిపోతుంది. అందువల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలను పరీక్షించాలి. ఆ ప్రాంతంలో పండించే వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులపై రెండేళ్లపాటు అధ్యయనం చేయాలి.  


శువులు, పెంపుడు జంతువులు.. 245 వరకు స్టైరిన్‌ బారిన పడ్డాయి. కొన్ని మరణించాయి. మరికొన్ని చికిత్సతో కోలుకున్నాయి. వాటి ఆరోగ్యాన్ని కూడా పశు సంవర్థక శాఖ తరచూ పరిశీలించాలి. 


గ్యాస్‌ ప్రభావిత ప్రాంతంలో చెట్లు, జంతుజాలంపై అటవీ శాఖ, జంతు ప్రదర్శన శాల అధికారులు అధ్యయనం చేయాలి. 


క్లినిక్‌ ఏర్పాటు

కమిటీ సూచనలను ముందే పరిగణలోకి తీసుకున్న జిల్లా అధికార యంత్రాంగం ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో రెండు రోజుల క్రితం వైఎస్‌ఆర్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ పది విభాగాలకు చెందిన వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని, స్టైరిన్‌ బాధితులకు అన్ని రకాల వైద్యసౌకర్యాలు అందిస్తారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ప్రకటించారు. 

Updated Date - 2020-07-10T18:00:08+05:30 IST