పంట, ఆస్తి నష్టాల నివేదిక ఇవ్వండి

ABN , First Publish Date - 2020-10-20T07:25:20+05:30 IST

భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని పంట, ఆస్తి నష్టాలను అంచనావేసి ఈనెల 31లోగా ప్రభుత్వానికి నివేదించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వరద నష్టాలపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య

పంట, ఆస్తి నష్టాల నివేదిక ఇవ్వండి

 ఈనెల 31వ తేదీలోగా అందజేయాలి

 అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు

విజయవాడ సిటీ : భారీ వర్షాలు, వరదల కారణంగా జిల్లాలోని పంట, ఆస్తి నష్టాలను అంచనావేసి ఈనెల 31లోగా ప్రభుత్వానికి నివేదించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వరద నష్టాలపై కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌తో కలిసి అధికారులతో ఆయన సోమవారం సమీక్షించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద బాధితులను గుర్తించి, ప్రభుత్వపరంగా సహాయాన్ని అందిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ, పంచాయితీ రోడ్ల నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు. జిల్లాలో పంట నష్టాలను అంచనా వేసేందుకు ఎన్యూమరేషన్‌ బృందాలను నియమించి నివేదికలు పంపాలన్నారు.


కలెక్టర్‌ మాట్లాడుతూ వరదల కారణంగా జిల్లాలో 30 మండలాలకు సంబంధించి 36 గ్రామాలు, రెండు పట్టణాలు ముంపునకు గురైనట్టు చెప్పారు. 47,943 మంది వరదలతో ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 17,030 హెక్టార్లలో పంటనష్టం జరిగిందని, 6,192 హెక్టార్లలో పండ్ల తోటలు దెబ్బతిన్నాయని, 256 ఇళ్లు పాడయ్యాయని, 4,788 ఇళ్ల చుట్టూ నీరు చేరిందని, 6 పశువులు, 1,000 కోళ్లు మృతిచెందినట్టు కలెక్టర్‌ వివరించారు.


జిల్లాలో 834 కిలోమీటర్ల మేర 213 పంచాయితీ రోడ్లు దెబ్బతిన్నాయని, 13 గండ్లు పడ్డాయని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీ రోడ్లకు సంబంధించి 419 కిలోమీటర్ల మేర 109 రోడ్లు, ఇరిగేషన్‌కు సంబంధించి 16 మైనర్‌, ఇరిగేషన్‌ చెరువులు దెబ్బతిన్నాయన్నారు. 11.43 కిలోమీటర్ల మేర మున్సిపల్‌ రోడ్లు, 11.78 కిలోమీటర్ల మేర మున్సిపల్‌ డ్రెయినేజీలు, 6.1 కిలోమీటర్ల మేర వాటర్‌ సప్లయ్‌ పైపులైన్లు, 960 వీధిదీపాలు, 4 మున్సిపల్‌ పాఠశాలలు దెబ్బతిన్నాయని వివరించారు. 591 చేనేత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్టు కలెక్టర్‌ చెప్పారు. 


Updated Date - 2020-10-20T07:25:20+05:30 IST