కూచ్‌బెహర్‌ పోలింగ్ కేంద్రంలో 29న రీపోలింగ్

ABN , First Publish Date - 2021-04-27T16:35:05+05:30 IST

పశ్చిమబెంగాల్ తుది విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కూచెబెహర్ జిల్లా సీతల్‌కుచి..

కూచ్‌బెహర్‌ పోలింగ్ కేంద్రంలో 29న రీపోలింగ్

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ తుది విడత ఎన్నికల పోలింగ్‌లో భాగంగా కూచెబెహర్ జిల్లా సీతల్‌కుచి అసెంబ్లీ నియోజకవర్గంలోని 126వ పోలింగ్ స్టేషన్‌లో ఈనెల 29న రీ-పోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎనిమిదవది, చివరిది అయిన పోలింగ్ ఈనెల 29న జరగనుండటంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఈనెల 10న జరిగిన నాలుగో రౌండ్ పోలింగ్‌లో హింస చోటుచేసుకోవడం, బలగాల కాల్పుల్లో నలుగురు మృతి చెందిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ 126లో పోలింగ్‌ను ఈసీ నిలిపివేసింది. ప్రత్యేక పరిశీలకుల తాత్కాలిక నివేదిక ప్రకారం రీపోలింగ్ నిర్ణయం తీసుకుంది.


మరోవైపు, ఎనిమిదో విడత పోలింగ్ కోసం ప్రచారం సోమవారం ముగిసింది. 72 గంటలకు ముందుగా ప్రచారం ఆపేయాలని ఈసీ నిర్ణయంతో ప్రచార ఘట్టానికి తెరవేశారు. ప్రచారం చివరిరోజన మమతా బెనర్జీ మరోసారి కేంద్రం, ఈసీ చర్యలను తప్పుపట్టారు. దేశంలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల కమిషన్ బాధ్యులని విమర్శించారు. కోవిడ్ కేసుల పెరుగుదలకు ఈసీఐను మద్రాసు హైకోర్టు తప్పుపట్టడాన్ని ఆమె స్వాగతించారు. తమిళనాడు, కేరళలో ఒకే దశలో పోలింగ్ పూర్తి చేయగా, బెంగాల్‌లో ఎనిమిది విడతలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది? రాష్ట్ర ప్రజలను చంపడానికా? అని ఆమె ఘాటుగా విమర్శించారు.  చివరి విడత పోలింగ్‌లో నాలుగు జిల్లాలకు (మాల్దా, బీర్‌భూమ్, ముర్షీదాబాద్, కోల్‌కతా నార్త్) చెందిన 35 నియోజకవర్గాలు ఉన్నాయి. మే 2న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2021-04-27T16:35:05+05:30 IST