Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ సారి కూడా రెపో మారదు...

 ద్రవ్యవిధానంపై విశ్లేషకుల అంచనా

 నేటి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశం


ముంబై : ప్రపంచం యావత్తు కరోనా కొత్త వేరియెంట్‌ ఒమైక్రాన్‌ భయాలతో గడగడలాడుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక సమావేశం సోమవారం ప్రారంభ కాబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణ కట్టడి లక్ష్యాన్ని అతిక్రమించకుండానే వృద్ధికి ఊతం ఇచ్చే లక్ష్యంతో ఆర్‌బీఐ వడ్డీరేట్ల విషయంలో వేచి చూసే ధోరణి అనుసరించవచ్చునని ఆర్థిక విశ్లేషకుల అంచనా. అదే జరిగితే ఆర్‌బీఐ కీలక రేట్ల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించడం ఇది వరుసగా తొమ్మిదో సారి అవుతుంది. 2020 మే 22న ఆర్‌బీఐ  చివరి సారిగా రెపోరేట్లను సవరించింది. అప్పటి నుంచి రేట్లు చారిత్రక కనిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయి. దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4 శాతం (రెండు శాతం ఎగువకు లేదా దిగువకు సద్దుబాటు వెసులుబాటుతో) స్థాయికి కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐకి కేంద్రప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం. కాగా రిస్క్‌లన్నీ సమతూకంగా ఉన్న కారణంగా 2021-22లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.3 శాతంగా ఉండవచ్చునని అక్టోబరు సమీక్షలో ఆర్‌బీఐ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.2 శాతం ఉండవచ్చునని పేర్కొంది.


రివర్స్‌ రెపో సవరణ అప్పుడే వద్దు : ఎస్‌బీఐ రీసెర్చ్‌

ప్రపంచం ఒమైక్రాన్‌ భయాలతో గడగడలాడుతున్న ప్రస్తుత వాతావరణంలో రివర్స్‌ రెపో రేటు సవరణ జోలికి పోవద్దని, అప్పుడే ఆర్థిక రికవరీ మరింత బలోపేతం అవుతుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. మార్కెట్లో లిక్విడిటీని సాధారణ స్థితికి తెచ్చే లక్ష్యంతో ఆర్‌బీఐ రివర్స్‌ రెపో రేటు పెంచే ఆస్కారం ఉన్నదన్న ఊహాగానాల నడుమ ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొంత కాలంగా ఆర్‌బీఐ ఇతర విధానపరమైన అవకాశాలు ఉపయోగించుకుని మార్కెట్లోని అదనపు లిక్విడిటీని ఉపసంహరిస్తూ వస్తోందని వారంటున్నారు. రివర్స్‌ రెపో రేటు సవరణ అనేది తప్పనిసరిగా ద్రవ్య విధాన సమయంలో తీసుకుని తీరాల్సిన నిర్ణయం ఏమీ కాదన్నది వారి అభిప్రాయం. పరిస్థితి గందరగోళంగానే ఉన్నందు వల్ల రివర్స్‌ రెపోపై నిర్ణయం వాయిదా వేయడం మంచిదని ఎస్‌బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ అన్నారు.  

Advertisement
Advertisement