పశ్చాత్తాపంతోనే పరివర్తన

ABN , First Publish Date - 2020-06-19T05:30:00+05:30 IST

సాధ్యమైనంత వరకూ తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. తెలిసో, తెలియకో ఏదైనా తప్పు దొర్లితే, పశ్చాత్తాపం చెంది క్షమాపణ వేడుకోవాలి. ఈ విషయంలో ఆలస్యం చెయ్యకూడదు...

పశ్చాత్తాపంతోనే పరివర్తన

సాధ్యమైనంత వరకూ తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. తెలిసో, తెలియకో ఏదైనా తప్పు దొర్లితే, పశ్చాత్తాపం చెంది క్షమాపణ వేడుకోవాలి. ఈ విషయంలో ఆలస్యం చెయ్యకూడదు. ఎందుకంటే ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తం అవుతుందో ఎవరికీ తెలియదు. శ్వాస ఉండగానే ఆశతో దైవ కారుణ్యాన్ని అన్వేషించాలి. 


మనిషి ఎంత పవిత్రంగా, పునీతంగా ఉండాలని అనుకున్నా ఏదో తప్పు జరుగుతూ ఉంటుంది. దానికి ఎవరూ అతీతులు కాదు. పొరపాటునో, గ్రహపాటునో మనిషి తప్పు చేయడం సహజం. అనుకోకుండా జరిగే చిన్న చిన్న తప్పులను అల్లాహ్‌ క్షమిస్తాడు. అయితే, బుద్ధిపూర్వకంగా, తలబిరుసుతనంతో చేసే తప్పులు వేరు. వాటికి అటువంటి క్షమాపణ ఉండదు. 

కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను తెలుసుకుంటారు. పశ్చాత్తాపపడతారు. దాన్ని సరిదిద్దుకుంటారు. మరికొందరు ఆ విషయం ఏమాత్రమూ పట్టించుకోరు. ఒక తప్పును సమర్థించుకోవడానికి మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తారు. శ్రేయోభిలాషులు ఆ తప్పులను వాళ్ళ దృష్టికి తీసుకువచ్చినా, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వితండవాదం చేస్తారే తప్ప, సంస్కరించుకోవడానికి ముందుకు రారు. చాలా తక్కువమంది మాత్రమే విమర్శను స్వీకరిస్తారు. సద్విమర్శను ఆహ్వానించడం వల్ల తప్పును తెలుసుకొనే అవకాశం లభిస్తుంది. మళ్ళీ అలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసుకొనే వీలు కలుగుతుంది. అలా చేసినవారే నిజమైన విశ్వాసులు.

‘‘ఎప్పుడైనా తమ కారణంగా ఏదైనా అశ్లీలకార్యం జరిగినా, లేదా ఏదైనా పాపానికి పాల్పడి తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నా... అలాంటి వ్యక్తులకు వెంటనే అల్లాహ్‌ జ్ఞాపకం వస్తాడు. అప్పుడు తమ తప్పులను క్షమించాలని ఆయనను వారు వేడుకుంటారు. ఎందుకంటే అల్లాహ్‌ తప్ప పాపాలను క్షమించగలిగేవారు ఎవరున్నారు!’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. ‘‘క్షమాభిక్ష కోసం మీరు మీ ప్రభువును వేడుకోండి. ఆయన వైపు మరలండి. మీ ప్రభువు నిశ్చయంగా అమిత దయామయుడు. అపార కృపాసాగరుడు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ స్పష్టం చేసింది. 

‘‘జనులారా! మీ తప్పులకు అల్లా్‌హను క్షమాపణ వేడుకోండి. ఆయన వైపు మరలండి. నేను రోజుకు వందసార్లు క్షమాపణ కోసం దైవాన్ని అర్థిస్తూ ఉంటాను’’ అని  దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు. 

నైతిక విలువలు పాటిస్తూ జీవితం గడిపేవారిని అల్లాహ్‌ ప్రేమిస్తాడు. తన దాసులు చేసే పాపాలను అల్లాహ్‌ మన్నిస్తాడు. ఆయనను క్షమాభిక్ష కోసం వేడుకున్న వారిని క్షమిస్తాడు. కాబట్టి చేసిన పాపాల పట్ల సిగ్గు పడాలి. తోటి మానవుల విషయంలో తప్పు జరిగితే ముందుగా వారినీ, ఆ తరువాత దైవాన్నీ క్షమాపణ కోరాలి. పశ్చాత్తాపం అంతరంగాన్ని మారుస్తుంది. మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. 

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-06-19T05:30:00+05:30 IST