విపత్తు తొలగే దారి!

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

ఇప్పుడు మహమ్మారి కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజూ వేలాదిమంది ఈ వ్యాధి బారినపడి మృత్యువు ఒడిలోకి జారుతున్న వార్తలు కంటతడిపెట్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న విషాద దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి...

విపత్తు తొలగే దారి!

ఇప్పుడు మహమ్మారి కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రోజూ వేలాదిమంది ఈ వ్యాధి బారినపడి మృత్యువు ఒడిలోకి జారుతున్న వార్తలు కంటతడిపెట్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా, ఎవరిని కదిపినా ఆరోగ్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న విషాద దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్న కథనాలు తీవ్రంగా కలచివేస్తున్నాయి. ఎటు చూసినా మరణ మృదంగం మోగుతోంది. కరోనా సృష్టిస్తున్న హైరానా ఇంతా అంతా కాదు. ఏ గుండె తట్టి చూసినా ఆవేదనా, విచారమే! ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింది. వ్యాపారాలన్నీ కుదేలయ్యాయి. ఉపాధి కోల్పోయి లక్షల మంది అలమటిస్తున్నారు. ఈ ఆపత్కాలం నుంచి బయటపడే మార్గమేదీ కానరాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు మనిషి. 


అయితే మానవాళికి ఇలాంటి విపత్తులు కొత్త కాదు. సృష్టి ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ ఎన్నో జాతులపై విపత్తులు విరుచుకుపడ్డాయి. మనిషి దారి తప్పినప్పుడు చిన్న చిన్న వ్యాధులకూ, ప్రకృతి విపత్తులకూ గురి చేసి దైవం హెచ్చరిస్తాడనీ, అప్పటికీ మనిషి దానవుడుగానే ఉంటే మహా విపత్తులకు గురిచేసి వినాశనం పాలు చేస్తాడని ధార్మిక గ్రంథాలు చెబుతాయి. ఆ తరువాత మనిషికి ఇచ్చిన జీవిత వ్యవధి ముగిసిపోతుంది. అందుకే ‘‘మనిషి తనపైకి వచ్చిపడే చిన్న చిన్న ఆపదలూ, కరువుకాటకాలూ, నష్టాలకు కారణాన్ని గుర్తించి కళ్ళు తెరవాలి. దౌర్జన్యం, అన్యాయం, దుర్మార్గం, అశ్లీలం లాంటి చెడులను విడిచిపెట్టి, పశ్చాత్తాపం చెందాలి. మంచి వైపు మరలాలి. అప్పుడే ఈ విపత్తులన్నీ మటుమాయమవుతాయి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ చెబుతోంది. అంటువ్యాధులైనా, కరువుకాటకాలైనా, ప్రకృతి విపత్తులైనా దైవానుగ్రహంతోనే దూరమవుతాయి. ఈ ప్రాపంచిక జీవనంలో దైవం వైపు మరలే అవకాశాలు బతికినన్ని రోజులూ వస్తూనే ఉంటాయి. ఆ రోజులను సద్వినియోగం చేసుకున్నవారే సాఫల్యం పొందుతారు. కాబట్టి అందరూ దైవం వైపు మరలాలి. అప్పుడే ఆపద నుంచి బయటపడగలం.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST