నృత్య ప్రదర్శనలు.. భళా!

ABN , First Publish Date - 2021-01-27T06:20:42+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు దేశభక్తిని చాటి చెప్పాయి.

నృత్య ప్రదర్శనలు.. భళా!

     గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు దేశభక్తిని చాటి చెప్పాయి. తొలుత బందరు మండలం చిన్నాపురం జిల్లా పరిషత్‌ హైస్కూల్‌కు చెందిన 35 మంది విద్యార్థులు వందేమాతరం, గాంధీ ఓంకారం అనే దేశభక్తి గీతానికి నృత్యప్రదర్శన నిర్వహించారు. ఎస్వీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 23 మంది విద్యార్థులు ‘ఓ భారతమాత’ అంటూ నృత్యప్రదర్శన ఇచ్చారు. యుద్ధభూమిలో సైనికుల పోరాటాన్ని తలపించేలా ప్రదర్శన చేశారు. మోపిదేవి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులు ‘చూడరండమ్మా’ అంటూ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. కృష్ణుడు, గోపికలతో చూడముచ్చటగా ఈ నృత్యప్రదర్శన నిలిచింది. మచిలీపట్నం రాజుపేట, లిటిల్‌ ఫ్లవర్‌ హైస్కూల్‌ విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని జై హింద్‌ అంటూ నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శన ప్రేక్షకులను కనువిందు చేసింది. తెల్లవాళ్ళను తరిమికొడదామంటూ బ్రిటీషు కాలం నాటి చరిత్రను కళ్లకుకట్టారు. రెడ్డిగూడెం కేజీబీవీ  విద్యార్థులు 40 మంది కలిసి ఘల్లుఘల్లు అంటూ జానపద నృత్యాన్నికి వీక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. మతం కాదు, గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, క్షుద్రవాదం, ఉగ్రవాదం కాదు అంటూ ఈకే బాలభాను పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యప్రదర్శన చరిత్రలోని సారాన్ని, భవితలోని భావాన్ని చాటి చెప్పింది. రెడ్డిగూడెం విద్యార్థులు జానపద నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

- మచిలీపట్నం టౌన్‌

Updated Date - 2021-01-27T06:20:42+05:30 IST