జగన్ స్పీచ్ మొదలవగానే సభా ప్రాంగణం ఖాళీ
ఆపిన పోలీసులను తోసుకుని బయటకు
ఏలూరు రైతు భరోసా సభలో తిరుపతి సీన్ రిపీట్
ఏలూరు, మే 16 (ఆంధ్రజ్యోతి): ఏలూరు జిల్లా గణపవరం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సభలో తిరుపతి సీన్ రిపీట్ అయింది. సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగానికి ముందే గ్రౌండ్ కొంత ఖాళీ అయితే...ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన పది నిమిషాలకే ఒక్కసారిగా కుర్చీలు వదిలి జనం బయటకు వెళ్లిపోవడం కనిపించింది. బస్సుల్లో ప్రజలను తరలించుకురాగలిగినా, వారిని కుర్చీల్లో మాత్రం కూర్చోబెట్టలేకపోయారు. చివరకు పోలీసులను కూడా తోసుకుని ప్రజలు బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో రైతులు అసలు ఉన్నారా అనే సందేహం అధికారులకే వచ్చింది. ఉదయం 10.30 గంటలకు సీఎం ప్రసంగం ఉంటుందని ప్రకటించారు. కానీ, జగన్ ఆలస్యంగా సుమారు 12 గంటలకు ప్రసంగం ప్రారంభించారు. సమయానికే సభాస్థలికి వచ్చినా, ఆయన వెంటనే వేదికపైకి వెళ్లలేదు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద కొంత సమయం గడిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన కొందరు రైతు సంఘం నాయకులతో మాట్లాడి.. వారితో ఫొటోలు దిగారు. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత వేదిక మీదకు వెళ్లారు.
తొలుత ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరావు మైకు తీసుకుని ఏకంగా గంటకుపైగా మాట్లాడారు. దీంతో ప్రజల్లో విసుగు పెరిగింది. ఒక్కొక్కరుగా లేచి వెళ్లడం ప్రారంభించారు. అది గమనించిన వేదిక మీది నాయకులు.. అక్కడున్న పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. వెళ్లిపోతున్న ప్రజలను బలవంతంగా ఆపేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. మహిళలను ఆపేందుకు ప్రయత్నించగా.. ‘ఎందుకు ఆపుతున్నారు? అంటూ తోసుకుంటూ ముందుకు కదిలారు. సభ కోసమని ప్రత్యేకంగా తీసుకొచ్చిన నాయకులు, కార్యకర్తలను వేదికకు ఇరు వైపులా ముందు వరుసలో కూర్చోబెట్టారు. జగన్ తన ప్రసంగం ముగించేసరికి వీళ్లు మాత్రమే సభలో మిగిలారు. ఉదయం సభ ప్రారంభమయ్యేసరికి కొద్దిపాటి చినుకులతో వాతావరణం కొంత చల్లగా మారింది. దీంతో ప్రజలు ఓపిగ్గా 12 గంటల దాకా కూర్చోగలిగారు. సాధారణ వేసవి రోజుల్లాగే ఉండి ఉంటే 11 గంటలకు ముందు నుంచే ఖాళీ అయిపోయేవని, అక్కడున్న కొందరు అధికారులు గుసగుసలాడుకోవడం గమనార్హం.
ఫ్లెక్సీలతో నిరసన
జగన్ సభ జరుగుతుండగా ‘సీఎం గారూ మాకు న్యాయం చేయండి’ అని రాసున్న ఫ్లెక్సీలను పట్టుకుని పలువురు మహిళలు నిరసన తెలిపారు. ఉండి మండలం, ఎన్నార్పీ అగ్రహారానికి చెందిన వీరికి జగనన్న ఇళ్లల్లో భాగంగా ఊరుకి దూరంగా స్థలాలు కేటాయించారు. దీనిపై స్థానిక నాయకులను, అధికారులను కలిసినా ఫలితం లేదు. తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకురావడానికి నిరసన దారి ఎంచుకున్నారు. ఫ్లెక్సీలతో సభ వద్దకు చేరుకున్నారు. అయితే..పోలీసులు ఫ్లెక్సీలను లాక్కుని వాళ్లను కూర్చోమని గద్దించారు. ఆ తర్వాత ఆ మహిళలు బిక్కముఖంతో వెనుతిరిగారు.