రేపల్లె.. రెవె‘న్యూ’

ABN , First Publish Date - 2022-05-18T05:41:50+05:30 IST

రేపల్లెవాసుల చిరకాల వాంఛ నెరవేరింది. తీర ప్రాంతంలోని రేపల్లె కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదలైంది.

రేపల్లె.. రెవె‘న్యూ’
బాపట్ల జిల్లా మ్యాప్‌

9 మండలాలతో డివిజన్‌ 

ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల

నెరవేరిన రేపల్లెవాసుల చిరకాల వాంఛ

జిల్లాలో 10 మండలాలతో పెద్దగా చీరాల

జిల్లా కేంద్రమైన బాపట్లలో 6 మండలాలు


బాపట్ల, మే 17 (ఆంధ్రజోతి): రేపల్లెవాసుల చిరకాల వాంఛ నెరవేరింది. తీర ప్రాంతంలోని రేపల్లె కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదలైంది. 9 మండలాలతో రేపల్లె డివిజన్‌ను ప్రకటించారు. ఇటీవలే మంత్రివర్గ సమావేశం ఈ మేరకు తీర్మానం చేయగా తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేశారు. రేపల్లెను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలనే అభీష్టాన్ని అక్కడి ప్రజలు ఉమ్మడి జిల్లాలో భాగంగానే వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు సమయంలో ఆ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇప్పుడు అందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించడంతో రేపల్లెవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముసాయిదా నోటిఫికేషన్‌ను మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వం అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు అవకాశం ఇచ్చింది. జిల్లా వ్యాప్తంగా మారిన రెవెన్యూ డివిజన్ల స్వరూపం వల్ల ప్రభావితమయ్యే ప్రజలు తమ విన్నపాలను కలెక్టర్‌ కార్యాలయంలో నెల రోజుల లోపు అందచేయాలని సూచించింది. దానికి అనుగుణంగా తుది నోటిపికేషన్‌ ఉండనుందని తెలిపింది. జిల్లాలో కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుండడంతో ప్రస్తుతం డివిజన్లుగా ఉన్న బాపట్ల, చీరాలకు సంబంధించి ముఖచిత్రమే మారిపోయింది. జిల్లా ఏర్పాటు ప్రక్రియలో 13 మండలాలతో చీరాల పెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఆవిర్భవించింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం కూడా చీరాల 10 మండలాలతో జిల్లాలో అగ్రస్థానంలోనే ఉంది. గతంలో ఈ డివిజన్‌లో ఉన్న పర్చూరు, మార్టూరు, యద్దనపూడి మండలాలను బాపట్ల రెవెన్యూ డివిజన్‌లో కలిపారు. మిగిలిన పది మండలాలతో చీరాల రెవెన్యూ డివిజన్‌ కొనసాగనుంది. బాపట్ల డివిజన్‌ 12 మండలాలతో ఉంది. ఈ డివిజన్‌లోని తొమ్మిది మండలాలతో రేపల్లె రెవెన్యూ డివిజన్‌ ప్రకటించారు. ఈ క్రమంలో మిగిలిన మూడు మండలాలు, చీరాల నుంచి మరో మూడు మండలాలను తెచ్చి బాపట్ల డివిజన్‌లో కలిపారు. దీంతో ఆరు మండలాలతో జిల్లా కేంద్రంలోని బాపట్ల డివిజన్‌ పరిమితమైంది. 

మండలాల మార్పుపై వ్యతిరేకత

పర్చూరు, మార్టూరు, యద్దనపూడి మండలాలను బాపట్ల రెవెన్యూ డివిజన్‌లో చేర్చడం పట్ల అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ను ఎప్పటినుంచో అడుగుతున్నామని దానిని పట్టించుకోని ప్రభుత్వం మళ్లీ బాపట్లలో కలపడం వల్ల తమ కష్టాలు మరింత రెట్టింపవుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు

రెవెన్యూ డివిజన్ల స్వరూపం

రేపల్లె : రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, భట్టిప్రోలు, వేమూరు, కొల్లూరు, అమర్తలూరు, చుండూరు, నగరం

చీరాల : చీరాల, వేటపాలెం, చినగంజాం, కారంచేడు, ఇంకొల్లు, కొరిశపాడు, జె.పంగలూరు, అద్దంకి, బల్లికురవ, సంతమాగలూరు

బాపట్ల : బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, పర్చూరు, మార్టూరు, యద్దనపూడి


Updated Date - 2022-05-18T05:41:50+05:30 IST