ఎస్సారెస్పీ గేట్లకు మరమ్మతులు

ABN , First Publish Date - 2022-06-30T07:22:25+05:30 IST

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను 40ఏళ్ల తర్వాత అధికారులు చేపట్టారు. ప్రాజెక్టులోని 42 గేట్లకు మరమ్మతులను పూర్తి చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం 17కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడంతో పనులను కొనసాగిస్తున్నారు.

ఎస్సారెస్పీ గేట్లకు మరమ్మతులు

రూ.17 కోట్ల నిధులను విడుదల చేసిన ప్రభుత్వం

ఏడాది లోపు 42 గేట్ల మరమ్మతులకు కసరత్తు

ఇసుక, మట్టి కొట్టుకు రావడం వల్ల పెరుగుతున్న పూడిక

తగ్గిపోతున్న ప్రాజెక్టు సామర్థ్యం

నిజామాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను 40ఏళ్ల తర్వాత అధికారులు చేపట్టారు. ప్రాజెక్టులోని 42 గేట్లకు మరమ్మతులను పూర్తి చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం 17కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడంతో పనులను కొనసాగిస్తున్నారు. వరద భారీగా వచ్చిన సమయంలో పనులు నిలిపివేసి మిగతా సమయంలో చేపట్టేవిధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రాజెక్టుపై మోటార్‌ల మరమ్మతులను చేస్తూనే ఇతర పనులను పూర్తిచేయనున్నారు. ప్రాజెక్టులో భారీ వరదలు వచ్చిన సమయంలో గత ఏడాది ఇబ్బందులెదురవడం, నాలుగు గేట్లు ఎత్తే సమయంలో మొరాయించడంతో ప్రభుత్వానికి నివేదించడంతో అనుమతులిచ్చారు. 

1983లో ఎస్సారెస్పీ జాతికి అంకితం..

1982లో ఎస్సారెస్పీ నిర్మాణం పూర్తి కాగా.. ప్రాజెక్టును 1983లో జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. పూర్తిగా మాన్యువల్‌ ఆధారంగా ఈ గేట్లను నిర్మాణం చేశారు. వరదలు వచ్చే సమయంలో ఆటోమెటిక్‌ స్విచ్‌లు కాకుండా మోటార్‌లను ఏర్పాటు చేసి గేట్లను గేట్‌మెన్‌ల సహాయంతో ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు వరదలు వచ్చే సమయంలో ఒక్కోసారి 4లక్షల నుంచి 5లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చి చేరుతోంది. ఆ సమయంలో ప్రాజెక్టులోని మొత్తం 42గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చిన్నచిన్న పనులు చేపడుతూ వరద సమయంలో గేట్లను ఎత్తుతున్నారు. గత సంవత్సరం భారీగా వరదలు వచ్చిన సమయంలో నాలుగు గేట్లు ఎత్తే సమయంలో సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. కొన్ని గేట్లు మొత్తం లేవకపోవడం వల్ల ఇతర గేట్లను ఎక్కువగా తెరచి నీటిని దిగువకు వదిలారు. తర్వాత మెకానిక్‌లను పిలిచి కొంత సరిచేసి గేట్లను ఎత్తారు.  గేట్లకు తాత్కాలిక మరమ్మతులు కాకుండా పూర్తిస్థాయిలో చేపట్టాలని డిసెంబరులో ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ప్రభుత్వం రూ.17 కోట్లను విడుదల చేయడంతో టెండర్‌లను పూర్తిచేసి పనులను చేపట్టారు. పది రోజుల క్రితం చేపట్టిన ఈ పనులను సంవత్సరంలోపు పూర్తి చేయనున్నారు. ఈ గేట్లతో పాటు వరద కాలువ గేట్లను కూడా మరమ్మతులను చేయనున్నారు.

మట్టి, ఇసుకతో తగ్గుతున్న సామర్థ్యం.. 

శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణమై 40ఏళ్లు అవుతోంది. 40ఏళ్ల క్రితం గోదావరి నదిపై 112 టీఎంసీల కెపాసిటీతో ఎస్సారెస్సీని నిర్మించారు. అయితో గోదావరికి భారీ వరదలు వస్తుండడంతో ఆ వరదతో పాటు ఇసుక, మట్టి కొట్టు కు వస్తుండడం వల్ల మేటలు ఎక్కువగా వేస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తగ్గుతోంది. నిర్మాణం సమయంలో 112 టీఎంసీలుగా ఉన్న ప్రాజెక్టు 2010లో 90 టీఎంసీలకు చేరింది. ఆ తర్వాత రాష్ట్ర సాగునీటిశాఖ ఇంజనీరింగ్‌ పరిశోధన అధికారులు శ్రీరామ్‌సాగర్‌ నీటి నిల్వల కెపాసిటీపై సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్రలో అన్ని నల్లరేగడి భూములు ఉండడం, గోదావరికి వరదలు వచ్చే సమయంలో భారీగా కోతకు గురై కొట్టుకు వస్తుండంతో ఈ కెపాసిటి తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.

నీటి విడుదలకు ప్రణాళిక..

ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికను ప్రభుత్వానికి అధికారులు పంపించారు. ఈ ప్రణాళికపై సివమ్‌ కమిటీ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టులోకి 60 టీఎంసీల నీళ్లు రాగానే ప్రాజెక్టు పరిధిలోని ఎల్‌ఎండీకి ఎగువన ఉన్న మొత్తం ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతున్నందున భారీ వరదలు వస్తే జూలై నెలలో ఈ నీటిని ఆయకట్టుకు అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతులను చేపట్టామని సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రీనివాస్‌లు తెలిపారు. ప్రాజెక్టు పెట్టినప్పటి నుంచి ఈ 40ఏళ్లలో పూర్తిస్థాయి మరమ్మతులను చేపట్టలేదని, ప్రభుత్వం నిధులను విడుదల చేయడం వల్ల ఇప్పుడు చేస్తున్నామని వారు తెలిపారు. సంవత్సరంలోపు అన్ని మరమ్మతు పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రాజెక్టులోకి 60 టీఎంసీల నీళ్లురాగానే ఆయకట్టుకు విడుదల చేస్తామని వారు తెలిపారు.

ప్రాజెక్టులోకి 

4498 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో.. 

ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన నిజామాబాద్‌ జిల్లా శ్రీరామసాగర్‌లోకి స్వల్ప ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. బుధవారం ప్రాజెక్టులోకి 4498 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకుగాను ప్రస్తుతం 1067 అడుగుల మేర నీటి నిల్వ ఉంది.  

Updated Date - 2022-06-30T07:22:25+05:30 IST