కొత్తవి సరే, ఉన్న ఆనకట్టలను కాపాడుకోవద్దా!?

ABN , First Publish Date - 2020-08-07T06:03:59+05:30 IST

కళ్యాణ లోవ రిజర్వాయరు పరీవాహక ప్రాంతలోని కొండలలో మైనింగ్ అనుమతులు ఇచ్చిన దస్త్రాలు పరిశీలిస్తే మీకు ఏ అధికారి నివేదికలోనూ ఈ కొండల దిగువన...

కొత్తవి సరే, ఉన్న ఆనకట్టలను కాపాడుకోవద్దా!?

కళ్యాణ లోవ రిజర్వాయరు పరీవాహక ప్రాంతలోని కొండలలో మైనింగ్ అనుమతులు ఇచ్చిన దస్త్రాలు పరిశీలిస్తే మీకు ఏ అధికారి నివేదికలోనూ ఈ కొండల దిగువన రిజర్వాయరు ఉందని గాని, ఈ కొండలు ఆనకట్ట పరీవాహక ప్రాంతంలో భాగంగా ఉన్నాయని గాని ఒక్కమాట కనబడదు. అంతేకాదు, ఆనకట్టను కాపాడవలసిన నీటిపారుదల శాఖకు చెందిన ఒక్క అధికారి నుండి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక్క లేఖ కూడా కనిపించదు. మన వ్యవస్థలు అందులో పనిచేసే అధికారులు ఏ స్థాయికి పతనం అయ్యారో ఇది చెపుతుంది. 


నీటివనరుల శాఖ సమాచారం ప్రకారం మన 13 జిల్లాల్లో పెద్దవి, చిన్నవి అన్ని రకాలు కలుపుకొని 40వేల సాగు నీటి నిర్మాణాలు ఉన్నాయి. వీటి క్రింద 103.11 లక్షల ఎకరాలు సాగవుతుంది. ఇంకాచాలదని పోలవరం ప్రాజెక్టు వంటి భారీ ఆనకట్టల నిర్మాణాన్ని చేపడుతున్నాం. ప్రశ్న ఏమిటంటే– కోట్ల రూపాయల ఖర్చుతో, వేలాదిమందిని నిర్వాసితులను చేస్తూ కొత్త ఆనకట్టలను ఒకవైపు కడుతూనే ఇప్పటికే కట్టిన, రైతులకు సేవలు అందిస్తున్న ఆనకట్టలను దెబ్బతీసే పనులు చేపట్టవచ్చునా? 


విశాఖ జిల్లాలో 11 మండలాలు తూర్పు కనుమల పర్వత శ్రేణులుగా వున్నాయి. ఇదంతా ఆదివాసీ ప్రాంతం. ఆ కొండల నుండి పలు చిన్నచిన్న నదులు మైదానాలకు పరుగులు తీస్తూ వుంటాయి. ఈ మైదానాలు–పర్వత సానువులు కలిసేచోట్ల మనకు లోయలు కనిపిస్తాయి, స్థానికులు ‘లోవ’ అంటారు. ఇలాంటి ‘లోవ’లలో మొట్టమొదట కట్టిన ఆనకట్ట కళ్యాణ లోవ రిజర్వాయరు. ఇది విశాఖ జిల్లా, రావికమతం మండలం, చీమాలపాడు ఎలియాస్ కళ్యాణ లోవ పంచాయితీలో వుంది. చింతపల్లి, జి.మాడుగుల అటవీ ప్రాంతం నుండి దిగువకు పారే వరాహ నదిపై దీనిని కట్టారు. ఈ రిజర్వాయరు పరీవాహక ప్రాంతం 21.5 చదరపు మైళ్ళు వ్యాపించి వుంది. ఆ పైనున్న పరీవాహక ప్రాంతం పచ్చని తూర్పు కనుమల కొండలతోనూ, ఆదివాసీ గూడాలతో నిండి మనోహరంగా వుంటుంది. ఈ కొండల నుండి చిన్నవి, పెద్దవి అనేక కొండ గెడ్డలు, నీటి ఊటలు స్థానిక ఆదివాసీల సాగునీరు, త్రాగు నీరు, పారిశుద్ధ్య అవసరాలు తీర్చడంతోబాటు వన్యమృగాల అవసరాలను కుడా తీరుస్తూ చివరిగా రిజర్వాయరుకు నీటిని కూడా అందిస్తున్నాయి. రావికమతం మండంలోని పది మేజరు గ్రామ పంచాయితీలకు చెందిన ఐదు వేల ఎకరాలకు సాగు నీటిని ఈ రిజర్వాయరు గత 40 ఏళ్లుగా అందిస్తున్నది.  


ఈ కళ్యాణ లోవ రిజర్వాయరుకు 2015నుండి గ్రానైట్ మైనింగ్ రూపంలో ప్రమాదం మొదలయ్యింది. ఈ రిజర్వాయరు పరీవాహక ప్రాంతంలో గల ఆదివాసీలు దేవతలుగా భావించే చల్లగొండమ్మ తల్లి కొండ, సోమాలమ్మ కొండ, పొట్టి మెట్ట, తెల్ల కొండలలో మైనింగ్ అనుమతులకు రంగం సిద్ధం అయ్యింది. నిజానికి ఈ కొండలపై వున్న అడవులన్నీ రిజర్వు ఫారెస్టుగా ప్రకటితమై, రిజర్వాయరు పరీవాహక ప్రాంతలో భాగంగా వున్నాయి. వీటి గుండా అనేక జలవనరులు దిగువనున్న రిజర్వాయరులోకి వస్తున్న విషయాన్ని సర్వే ఆఫ్ ఇండియా తన టోపో షీట్సులో రికార్డు చేసింది. 


కళ్యాణ లోవ రిజర్వాయరు పరీవాహక ప్రాంతలోని కొండలలో మైనింగ్ అనుమతులు ఇవ్వడానికి అనుసరించిన పద్ధతి ఏమిటంటే, ముందుగా ఆయా ఆదివాసీ గూడాలలో వున్న పెద్దలను, స్థానిక నాయకులను దారిలోకి తెచ్చుకోవడం. రెవిన్యూ, అటవీ శాఖ, గనుల శాఖ, ప్రజాప్రతినిధుల గూడుపుటాణి. నీటి పారుదల శాఖ, పర్యా వరణ శాఖ అధికారులు నోరు ఎత్తకుండా నెలసరి మామూళ్ళు. రికార్డులను తారుమారు చేయడం, మైనింగ్ రావడానికి అభ్యంతరంగా వున్న వాస్తవాలను నివేదికలలోకి రాకుండా తొక్కిపెట్టడం, ఎక్కడికక్కడ ‘మేతలు’. మైనింగ్ అనుమతులు ఇచ్చిన దస్త్రాలు పరిశీలిస్తే మీకు ఏ అధికారి నివేదికలోనూ ఈ కొండల దిగువన రిజర్వాయరు ఉందని గాని, ఈ కొండలు ఆనకట్ట పరీవాహక ప్రాంతంలో భాగంగా ఉన్నాయని గాని ఒక్కమాట కనబడదు. అంతేకాదు, ఆనకట్టను కాపాడవలసిన నీటిపారుదల శాఖకు చెందిన ఒక్క అధికారి నుండి కూడా అభ్యంతరం వ్యక్త చేస్తూ ఒక్క లేఖ కూడా మీకు కనిపించదు. మన వ్యవస్థలు అందులో పనిచేసే అధికారులు ఏ స్థాయికి పతనం అయ్యారో ఇది చెపుతుంది. 


రిజర్వాయరు పరీవాహక ప్రాంతంలో ఒక మైనింగ్ కంపెనీ ఒక కొండను ఎంపిక చేసుకుంటుంది. మైనింగ్ చేయదలచుకున్న స్థలాన్ని 5హెక్టార్లకు లోబడి భాగాలుగా చేసుకొని మైనింగ్ కోసం రెండు, మూడు విడి దరఖాస్తులు సమర్పిస్తుంది. ఉదాహరణకు సోమాలమ్మ కొండలో ఒక కంపెనీ 4.11 హెక్టార్లకు ఒక దరఖాస్తు, 5.33 హెక్టా ర్లకు మరో దరఖాస్తు వేసి అనుమతి పొందింది. ఒకే కొండ, ఒకే కంపెనీ, ఒకే యజమాని. కానీ రెండు విడివిడి దరఖాస్తులు ఎందు కంటే, 5 హెక్టార్లకుపైన అయితే కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనుమతి తీసుకోవలసి వుంటుంది. అదే 5 హెక్టార్లకు లోపు అయితే రాష్ట్రంలోనే పని జరిగిపోతుంది. ఈ సులువులన్నీ గనుల శాఖ, పర్యావరణ శాఖ అధికారులే మీకు చెప్పగలరు. ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ మదింపు సంస్థ (SEIAA) 2015 సెప్టెంబర్ మొదటి వారంలో జరిపిన సమావేశంలో సోమాలమ్మ కొండలో ఒకే కంపెనీకి రెండు విడి దరఖాస్తులకుగాను 9.44 హెక్టార్లకు (23 ఎకరాలు) పర్యావరణ ఆమోదం తెలిపింది. 


పర్యావరణ చట్టాలను తప్పించుకోవడానికి ఇలా విడివిడిగా విస్తీర్ణాలను విడగొడుతున్నారన్న సంగతిని దీపక్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు గుర్తించి 2012 ఫిబ్రవరిలో కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. అందులో ‘క్లస్టర్ ఎప్రోచ్’ ఒకటి. అంటే 500 మీటర్ల పరిధిలో ఎన్ని మైనింగులు వున్నాయో విధిగా చూడాలి. అయితే 2012 కోర్టు ఆదేశాలు ఇస్తే నాలుగేళ్ల తరువాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2016లో వాటిపై ప్రభుత్వ ఆదేశాలను విడుదల చేసింది. దాని ప్రకారం చిన్న తరహా ఖనిజాల (ఉదహరణకు గ్రానైట్) మైనింగ్ దరఖాస్తులపై పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు జిల్లా స్థాయిలోని నిపుణల కమిటీ (DEAC) ఏర్పాటు చేయాలి. దీనికి ఆయా జిల్లాలలో ఎక్కువ అనుభవం గల నీటి పారుదల శాఖ అధికారి చైర్మన్‌గా వుంటారు. ఇక కలెక్టరు అధ్యక్షతన గల జిల్లా స్థాయి ప్రభావ మదింపు కమిటి (DEIAA) పరిశీలించి పర్యావరణ అనుమతికి సిఫారసు చేస్తుంది. కళ్యాణ లోవ రిజర్వాయరు పరీవాహక ప్రాంతంలోని పొట్టిమెట్టలో సాయికపిల్ గ్రానైట్ కంపెనీకి పర్యావరణ అనుమతి ఇవ్వవచ్చని తేది 18/09/2017న జరిగిన జిల్లా స్థాయి నిపుణల కమిటీ (DEAC) సిఫార్సు చేసింది. రిజర్వాయరు ఆయకట్టు రైతులు గగ్గోలు పెట్టడంతో 2019 మే 20న నీటిపారుదల శాఖ జిల్లా అధికారి ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజనీరుకు లేఖ రాస్తూ కళ్యాణ లోవ రిజర్వాయరు పరీవాహక ప్రాంతంలో మైనింగ్ చేయడానికి తాము ఎలాంటి అనుమతి (NOC) ఇవ్వలేదని చెప్పుకున్నారు. అలా లేఖ రాసినాయన వెళ్ళిపోగా కొత్తగా వచ్చిన అధికారి- ఇప్పుడు మైనింగ్ అనుమతులు రద్దు చేస్తే మదుపరులు (‘పెట్టుబడిదారులు’ అని అర్థం) మనోభావాలు దెబ్బతిని తప్పుడు సంకేతాలు వెడతాయని జిల్లా కలెక్టరుకు రాస్తారు. దీనిని బట్టి మన కమిటీల పనితీరును అర్థం చేసుకోవచ్చు. గత నలభై ఏళ్లుగా ఆనకట్ట ద్వారా సాగునీరు పొందుతున్న రైతులు, రెండు వందల మత్స్యకార కుటుంబాలు, తరతరాలుగా ఆ కొండలలో జీవిస్తున్న ఆదివాసీలకు ఎలాంటి మనోభావాలు వుండవు, వుండకూడదు. 


పరీవాహక ప్రాంతలో మైనింగ్ మొదలు పెట్టిన మైనింగ్ కంపెనీలు కొండలపై వున్న దట్టమైన అడవులను తొలగించి, జల వనరులను తవ్వేయడం మొదలుపెట్టాయి. తమ మైనింగ్ వ్యర్థాలతో గెడ్డలను కప్పేసి నీటి ప్రవాహాలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. సోమాలమ్మ కొండ, పొట్టి మెట్ట కొండలలో చేస్తున్న బ్లాస్టింగ్స్ ప్రకంపనాలతో కొండలు జలదరిస్తున్నాయి. సోమాలమ్మ కొండకు కలసిన, మట్టితో 40 ఏళ్ల క్రిందట కట్టిన మట్టి ఆనకట్టపై ఈ పేలుళ్ళు, అటు ఇటు రవాణా అవుతున్న భారీ వాహనాల ప్రభావం కరకట్టపై ఉంది. రైతులకు పరీవాహక ప్రాంతలో జరుగుతున్న మైనింగ్ గూర్చి సమాచారం అందడం మొదలయ్యింది. 2017 ఆగస్టులో కళ్యాణ లోవ రిజర్వాయరు ఆయకట్టు గ్రామ పంచాయితీ మత్స్యవానిపాలెం రైతులు మొదటిసారిగా నీటిపారుదల, గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు ఫిర్యాదు చేశారు. దానిపై ఆ శాఖలు విచారణకు కూడా ఆదేశించాయి. ఐదిలా వుండగానే 2018, 2019 లలో మరో రెండు కొత్త మైనింగ్ కంపెనీలు పర్యావరణ అనుమతులు తెచ్చుకోగాలిగాయి. బీబీసీ తో సహా అనేక వార్త చానళ్ళు, జాతీయ, ప్రాంతీయ మీడియా ఇక్కడ జరుగుతున్న అక్రమాలను వెలికి తీశాయి. జల మానవుడు రాజేంద్ర సింగ్, భారత ప్రభుత్వం విశ్రాంతి కార్యదర్శి ఇఎ‌ఎస్ శర్మ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత సందీప్ పాండే, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వంటి వారు ఆనకట్టను మైనింగ్ నుండి కాపాడమని కోరుతూ ప్రభుత్వానికి  లేఖలు రాశారు. ఇంత జరుగుతున్నా ఒక్కసారి కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి ఆదివాసీలు, రైతులు, దేశీయ మత్స్యకారుల గోడు వినడానికి జిల్లా కలెక్టరుకు తీరిక లేకపోయింది. 


కళ్యాణ లోవ రిజర్వాయరు వంటి ఒక రిజర్వాయరును నేడు కట్టాలంటే 450 కోట్లు ఖర్చవుతుందని భారత ప్రభుత్వంలో వివిధ హోదాలలో పని చేసిన విశ్రాంతి ఐఎ‌ఎస్ అధికారి ఇఎ‍ఎస్ శర్మ అంచనా వేశారు. 10 మేజర్ గ్రామ పంచాయితీల రైతులకు ఈ రిజర్వాయరు నీటిపై అనుభవ హక్కులు (రైపీరియన్ రైట్స్) ఏర్పడివున్నాయి. ఈ హక్కులు సహజంగానే ఆ రిజర్వాయరులోకి నీళ్ళు తెచ్చే అన్ని గెడ్డలు, వాగులు, చలమలు, వూటలకు కూడా విస్తరించి వుంటాయి. వాటిని భంగపరిచే అధికారం ఎంతటివారికైనా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1. హిమయత్ సాగర్ 2. ఉస్మాన్ సాగర్‌  చెరువులకు గల పరీవాహక ప్రాంతంలో  మైనింగు కార్యాకలపాలను జీవో.ఎమ్మెస్.నం.111 ద్వారా 1996లో ప్రభుత్వం నిషేధించింది. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం, లఖనల్ మిశ్రా రిజర్వాయరు పరీవాహక ప్రాంతంలో ఇచ్చిన మైనింగు లీజులను 2017 మార్చిలో రద్దు చేసింది. మన 13 జిల్లాల్లో వున్న కళ్యాణ లోవ రిజర్వాయరు వంటి చిన్న, మధ్య తరహా, భారీ నీటి ఆనకట్టల పరిరక్షణకు ప్రభుత్వం పూనుకోలేదా? 200 టన్నుల ఖనిజం కోసం 800 టన్నుల వ్యర్థాలను సృష్టించే మైనింగ్‌ను ఆనకట్టల పరీవాహక ప్రాంతాలలో అనుమతించడం, కొనసాగించడం వ్యవసాయం, రైతుల మేలు కోరేవారు చేయవలసిన పనేనా? చిన్న, మధ్య, భారీ ఆనకట్టలకు నిర్దిష్టమైన పరీవాహక ప్రాంతాలు వుంటాయి. వాటిని ‘నో మైనింగ్ జోన్స్’ గా గుర్తించి కాపాడుకోలేమా? 


పి.ఎస్. అజయ్ కుమార్ 

జాతీయ కార్యదర్శి అఖిల భారత వ్యవసాయ, 

గ్రామీణ కార్మిక సంఘం

Updated Date - 2020-08-07T06:03:59+05:30 IST