రేణుకా ఎల్లమ్మ ఆలయ ఆదాయం రూ.1.75కోట్లు

ABN , First Publish Date - 2022-05-28T05:56:55+05:30 IST

భువనగిరి పట్టణ శివారులోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయానికి బహిరంగ వేలంపాట ద్వారా భారీ ఆదాయం సమకూరింది.

రేణుకా ఎల్లమ్మ ఆలయ ఆదాయం రూ.1.75కోట్లు
ఆలయం వద్ద వేలంపాట నిర్వహిస్తున్న అధికారులు

 బహిరంగ వేలంపాట ద్వారా సమకూరిన వార్షిక ఆదాయం 

మరో రెండు అంశాలు వాయిదా

భువనగిరి టౌన్‌, మే 27: భువనగిరి పట్టణ శివారులోని శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయానికి బహిరంగ వేలంపాట ద్వారా భారీ ఆదాయం సమకూరింది. తొమ్మిది అంశాలకు శుక్రవారం నిర్వహించాల్సిన బహిరంగ వేలంపాటలో ఏడు అంశాలకే వేలం పాట నిర్వహించగా రూ.1,75,27,000 వార్షిక ఆదాయం సమకూరింది. మరో రెండు అంశాలను అధికారులు వాయిదావేశారు. ప్రైవేట్‌ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆలయాన్ని దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చిన మూడు నెలల అనంతరం పూజా సామగ్రి, భక్తులు సమర్పించిన ఒడి బియ్యం సేకరణ, బొమ్మలు, ప్రసాదాల తదితర విక్రయాల కోసం నిర్వహించిన వేలంపాటలో ఆలయానికి భారీ ఆదాయం సమకూరడం స్థానికంగా చర్చనీయాంశమైంది. రెండు సంవత్సరాల కాలవ్యవధికి నిర్వహించిన వేలంపాటలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం మొదటి ఏడాదికి వేలంపాట నిర్వహించగా, హక్కులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అంతే మొత్తాన్ని రెండో సంవత్సరానికి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రెండేళ్ల కాలానికి ఏడు అంశాల ద్వారా రూ.3,50,54,000 ఆదాయం సమకూరినట్లయ్యింది. వాయిదా పడిన రెండు అంశాలకు త్వరలో నిర్వహించనున్న వేలంపాట ద్వారా మరింత ఆదాయం సమకూరనుంది. ఏడాది కాలానికి పూజా సామగ్రి, పూల విక్రయ హక్కును రూ.55.07 లక్షలతో ఎన్‌.సాంబయ్య, కొబ్బరి కాయల విక్రయానికి రూ.52లక్షలతో జి.బాబూరావు, బొమ్మలు విక్రయ హక్కును రూ.25.37లక్షలతో ఎస్‌.లింగస్వామి, లడ్డూ పులిహోర ప్రసాద విక్రయాల హక్కును రూ.19.11లక్షలతో బచ్చు బాల ప్రభు, భక్తులు సమర్పించిన ఒడి బియ్యం, ఎండు కొబ్బరి, సేకరించే హక్కును రూ.12.16లక్షలతో కె.గణేష్‌, కొబ్బరి చిప్పల సేకరణ హక్కును రూ.9.06లక్షలతో హరినాథ్‌, తలనీలాలు సేకరించుకునే హక్కును రూ.2.50లక్షలతో సీహెచ్‌ ప్రవీణ్‌ దక్కించుకున్నారు. భక్తులు సమర్పించిన చీరలు సేకరించుకునే, ఫొటోలు తీసే అంశాల హక్కు వేలంపాటను అధికారులు వాయిదావేశారు. ఎండోమెంట్‌ ఉమ్మడి జిల్లా ఇన్‌స్పెక్టర్‌ సుమతి, ఆలయ కార్య నిర్వాహణ అధికారి నరేందర్‌రెడ్డి, అనంతారం సర్పంచ్‌ చిందం మల్లిఖార్జున్‌, భువనగిరి మునిసిపల్‌ 12వ వార్డు కౌన్సిలర్‌ ఊదరి లక్ష్మీ సతీ్‌షయాదవ్‌, సిబ్బంది వీరయ్య, నిత్యానందం, ఆలయ  అర్చకుల ఆధ్వర్యంలో వేలం పాట కొనసాగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2022-05-28T05:56:55+05:30 IST