అద్దెల ఎగనామం

ABN , First Publish Date - 2021-07-31T05:52:37+05:30 IST

శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించి దుకాణాల అద్దెల బకాయిలు భారీగా పేరుకుపోయాయి.

అద్దెల ఎగనామం
శింగరకొండలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయం

శింగరకొండ ఆంజనేయుని ఆలయానికి పేరుకుపోతున్న బకాయిలు

దుకాణదారుల నుంచి రావాల్సిన సొమ్ము రూ.1.5 కోట్లు

పట్టించుకోని అధికారులు 

బంధువులు, సన్నిహితుల పేర్లతో మళ్లీ ఎగవేతదారుల పాగా

అద్దంకి, జూలై 30 : శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి సంబంధించి దుకాణాల అద్దెల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దశాబ్దం నుంచి అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టకపోవటంతో ఇవి గుదిబండలా మారాయి. శింగరకొండలోనే తిష్ట వేసిన పలువురు వ్యాపారులు ఏటా బహిరంగ వేలంలో  షాపులను దక్కించుకుని కొంత మొత్తం బకాయి ఉంచి స్వామి వారికి ఎగనామం పెడుతున్నారు. ఇలా ప్రస్తుతం సుమారు రూ.1.50 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తం సొమ్ము 10 మంది వ్యాపారులు చెల్లించాల్సి ఉండగా, వారిలో నలుగురైదుగురి నుంచి రూ.కోటి వరకూ రావాల్సి ఉంది. 


షాపుల అద్దే ప్రధాన ఆదాయం

 శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామికి ఎటువంటి  భూములు  లేవు. ఆలయం వద్ద ఉన్న దుకాణాల ద్వారా వచ్చే అద్దెలే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి.  కొబ్బరికాయలు, పూజా ద్రవ్యాలు అమ్మే దుకాణాల  ద్వారా ఏటా రూ.50లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ అద్దె వస్తుంది. వీటికి నిర్వహించే వేలంలో పూజాద్రవ్యాల దుకాణాల కోసం వ్యాపారులు పోటీ పడుతున్నారు. దుకాణం దక్కించుకున్న వారు  చివరలో  ఎంతోకొంత బకాయి ఉంచుతున్నారు. అలాంటి వారు ఆతర్వాత సంవత్సరం  వేలం  పాటలో పాల్గొనే అవకాశం లేకపోవటంతో బంధువులు, కుటుంబసభ్యులు, సన్నిహితులను తెరపైకి తెస్తున్నారు. వారి పేర్లతో దుకాణాలను దక్కించుకుంటున్నారు. దీంతో పాత బకాయిలు వసూలు కావటం లేదు. అధికారులు, సిబ్బంది కూడా వాటి వసూలు కోసం ఒత్తిడి చేయడం లేదు. ఎవరైనా గట్టిగా అడిగినా వ్యాపారులు రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేసి భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు పుష్కరకాలం తర్వాత ఏర్పడి ఆలయ పాలక మండలి బకాయిల వసూలుపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు. 


కోర్టులో కేసులు వేశాం 

శ్రీనివాసరెడ్డి, శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయ ఈవో

 పలువురు వ్యాపారులు దుకాణాల నిర్వహణకు సంబంధించి చాలా కాలంగా బకాయిలు ఉన్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించ లేదు. దీరి వారిపై కోర్టులో  కేసులు వేశాం. వసూలుపై ప్రత్యేక దృష్టి పెడతాం. 

Updated Date - 2021-07-31T05:52:37+05:30 IST