అద్దె బస్సులు నడిచేనా?

ABN , First Publish Date - 2021-06-24T07:15:15+05:30 IST

లాక్‌డౌన్‌ అనంతరం రవాణాకు ఆర్టీసీ సొంత వాహనాలనే వినియోగిస్తుండడంతో అద్దె బస్సుల యాజమాన్యాలు, కార్మికులకు తిప్పలు తప్పట్లేదు.

అద్దె బస్సులు నడిచేనా?

జిల్లా వ్యాప్తంగా రూ.13కోట్ల బకాయిలు పెండింగ్‌

ఇబ్బందుల్లో అద్దెబస్సుల యజమానులు,  కార్మికులు

సూర్యాపేట టౌన్‌, జూన్‌ 23:  కొవిడ్‌ ప్రభావంతో ఆర్టీసీ సంస్థను నమ్ముకుని జీవిస్తున్న అద్దె బస్సుల యజమానులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం రవాణాకు ఆర్టీసీ సొంత వాహనాలనే వినియోగిస్తుండడంతో అద్దె బస్సుల యాజమాన్యాలు, కార్మికులకు తిప్పలు తప్పట్లేదు. దీంతో అద్దె బస్సుల ఈఎంఐలు, డ్రైవర్ల, క్లీనర్ల జీతాల చెల్లింపు  అద్దె బస్సుల నిర్వాహకులకు తలకుమించిన భారంగా మారింది. ప్రస్తు తం లాక్‌డౌన్‌ తొలగించడంతో ఆర్టీసీ సంస్థ బకాయిలు చెల్లించి, అద్దెబస్సులను తిరిగి నడపాలని  నిర్వాహకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 287అద్దె బస్సులను నమ్ముకొని 574మంది డ్రైవర్లు, 100మందికి పైగా క్లీనర్లు జీవిస్తున్నారు. నిర్వాహకు లు ఎక్స్‌ప్రెస్‌ నడిపే డ్రైవర్లకు నెలకు రూ.15వేల నుంచి రూ.17వేలు, ఆర్డీనరీ  డ్రైవర్లకు రూ.14నుంచి రూ.16వేలు, క్లీనర్‌కు రూ.6వేల వరకు చెల్లిస్తున్నారు. వీరంతా కొద్ది రోజులుగా అద్దె బస్సులు నడవక జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అద్దె బస్సుల నిర్వాహకులు తమకు అవసరమైనపుడు డ్రైవర్లు దొరకరని బస్సులు నడవకు న్నా జీతాలు ఇస్తున్నారు. ఆర్టీసీ సంస్థ అద్దె బస్సులను టెండర్ల ద్వారా తీసుకుంటాయి. సుమారు ప్రతి అద్దె బస్సుకు కి.మీకు రూ.8నుంచి రూ.9 వరకు ఆర్టీసీ చెల్లిస్తోంది. కండక్టర్‌, డీజిల్‌ను అద్దె బస్సులకు ఆర్టీసీనే భరిస్తుంది. దీంతో ప్రతినెలా ఒక్కో ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీకి రూ.1.25లక్షలు, ఆర్డీనరీకి రూ.1లక్ష చెల్లిస్తోంది. లాక్‌డన్‌ నేపథ్యంలో అద్దె బస్సులు నడవక నిర్వాహకులు, డ్రైవర్లు, క్లీనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం గా  అద్దె బస్సుల నిర్వాహకులకు ఈఎంఐ రూపంలో ప్రతినెలా రూ.50 వేల నుంచి 65వేల వరకు చెల్లించాలి.  ఇదికాకుండా డ్రైవర్లుకు, క్లీనర్లకు జీతాలు వేలల్లో ఉన్నాయి. 

పేరుకుపోయిన బకాయిలు

గతేడాది లాక్‌డౌన్‌ విధించిన అనంతరం ఆర్టీసీ అద్దె బస్సులను తీసుకుంది.  ప్రస్తుతం మే నెల 12తేదీకి ముందు 4నెలల బకాయి అద్దె బస్సు నిర్వాహకులకు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.13కోట్లు బకాయిలు పేరుకుపోయాయి.  ప్రస్తుత పరిస్థితుల్లో బకాయిలు చెల్లించడంతోపాటు, అద్దె బస్సులను తిరిగి నడపుతారని  నిర్వాహకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 

బకాయిలు వెంటనే చెల్లించాలి: రౌతు నాగేశ్వర్‌రావు, అద్దె బస్సు యజమాని

అద్దె బస్సు నిర్వాహకులకు చెల్లించాల్సిన 4నెలల బకాయి వెంటనే చెల్లించాలి. డ్రైవర్లకు జీతాలు, బస్సులకు సంబంధించిన ఈఎంఐలు చెల్లించలేక పోతున్నాం. ఇటీవల కరోనాతో లాక్‌డౌన్‌ విధించగా బస్సులు నడవక ఇబ్బందులు పడుతున్నాము. ప్రస్తుతం లాక్‌డౌన్‌ లేనందున ఆర్టీసీ అద్దె బస్సులను వెంటనే నడపాలి. 

త్వరలోనే చెల్లింపులు: శివరామకృష్ణ, సూర్యాపేట డిపో మెనేజర్‌

అద్దె బస్సులకు సంబందించిన బకాయిలు త్వరలోనే చెల్లిస్తాం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ తొలగించడంతో ఆర్టీసీ బస్సులు అన్ని రూట్లల్లో నడవడం జరుగుతుంది.  


Updated Date - 2021-06-24T07:15:15+05:30 IST