ప్రతిష్ఠాత్మకంగా..పవర్‌హౌస్‌ పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-10-19T08:59:44+05:30 IST

కల్వకుర్తి ఎత్తి పోతల పథకంతోపాటు మిషన్‌ భగీరథకు అత్యంత కీలకం గా ఉన్న కేఎల్‌ఐ మొదటి లిఫ్టును పునరుద్ధరించడం అధికార టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా, ప్రధాన రాజకీయ పక్షాలైనా కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలకు ఆయుధంగా మారింది

ప్రతిష్ఠాత్మకంగా..పవర్‌హౌస్‌ పునరుద్ధరణ

టీఆర్‌ఎస్‌కు సవాల్‌.. విపక్షాలకు ఆయుధం

నెల రోజుల్లోగా ఒక్క మోటారునైనా ప్రారంభించాలి 

ఇరిగేషన్‌ అధికారులకు మౌఖిక ఆదేశాలు


నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): కల్వకుర్తి ఎత్తి పోతల పథకంతోపాటు మిషన్‌ భగీరథకు అత్యంత కీలకం గా ఉన్న కేఎల్‌ఐ మొదటి లిఫ్టును పునరుద్ధరించడం అధికార టీఆర్‌ఎస్‌కు సవాల్‌గా, ప్రధాన రాజకీయ పక్షాలైనా కాంగ్రెస్‌, బీజేపీ, వామపక్షాలకు ఆయుధంగా మారింది. దీంతో ఇరిగేషన్‌, పోలీస్‌ శాఖలకు చెందిన అధికారులు ఒత్తిళ్లకు గురవుతుండగా భారీ వర్షాలతో వానకాలం సీజన్‌లో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులు, యాసంగిలోగానైనా కేఎల్‌ఐ పథకం ద్వారా నీళ్లు అందుతాయా లేదా అనే సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


స్వల్ప సాంకేతిక ఇబ్బందులుంటే 20రోజుల్లోగా మొదటి పంపు ప్రారంభం

నీట మునిగిన కల్వకుర్తి మొదటి లిఫ్టులో స్వల్పంగా సాంకేతిక ఇబ్బందులుంటే అన్ని ఇబ్బందులను అధిగమిం చి 20 రోజుల్లోగా ఒక పంపును ప్రారంభించవచ్చునని ప్రజాప్రతినిధులు, అధికారులంటున్నారు. పంపుహౌజ్‌లో దాదాపు 120 అడుగుల మేరకు ఉన్న నీటిని వారం రోజుల్లో బయటకు పంపించగలిగితేనే ఇది సాధ్యమవుతుందని వారంటు న్నారు. ఇప్పటి వరకు స్థూలంగా పంపుహౌజ్‌ నీటి మునకకు సంబం ధించి ఇరిగేషన్‌ శాఖ అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం ఎంజీఎల్‌ఐలోని మూడో మోటారు, పంపును అనుసంధానించే క్రమం లో సాఫ్ట్‌వాల్‌ ఊడిపోయినందుకే పంపు హౌస్‌లోకి నీరు చేరాయని చెప్తుండడం గమనార్హం. నిజంగా ఇదే పరిస్థితి ఉంటే మొదటి లిఫ్టు పునరుద్ధరించే ప్రక్రియ వానకాలం పంటలకు, మిషన్‌ భగీరథకు ఎలాంటి నష్టం వాటిళ్లకుండా చూడొచ్చనే ఆశాభావంలో అధికార పార్టీ నేత లు ఉన్నారు.


అయితే శ్రీశైలం ఎడమ గట్టు పవర్‌ హౌస్‌లో ప్రమాదం చోటు చేసుకొని రెండు నెలలు కావడం, కృష్ణా నదిలో సమృద్దిగా ఉన్న జల విద్యుత్‌ ఉత్పాదన ఇంకా ప్రారం భించలేని దుస్థితిలో ఉన్న నేపథ్యంలో కేఎల్‌ఐ లిఫ్టు మునకను విపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు, కమ్యూనిస్టులు తమ ఆయుధంగా మలుచుకుం టున్నారు. ఈ క్రమంలో శనివారం తెలంగాణ కాంగ్రెస్‌ ప్రధానమైన నేతలు ఏనుముల రేవంత్‌రెడ్డి, మల్లు రవిలతోపాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు ఆదివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలను కల్వకుర్తి లిఫ్టును సందర్శించకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం పట్ల సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టింగ్‌లు వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - 2020-10-19T08:59:44+05:30 IST