ఇక రెండ్రోజులే

ABN , First Publish Date - 2022-04-25T05:16:44+05:30 IST

పదో తరగతి వార్షిక పరీక్షలకు ఇక రెండు రోజులే మిగిలింది. దీంతో విద్యార్థులో ఒకింత టెన్షన మొదలైంది.

ఇక రెండ్రోజులే
ఆదోని పురపాలక ఉన్నత పాఠశాలలో ప్రీఫైనల్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

  1. పది పరీక్షలకు మిగిలిన సమయమిది
  2.  రెండేళ్ల తరువాత నిర్వహణ
  3.  తొలిసారి బుక్లెట్‌.. ఏడు పేపర్లు
  4.   పరీక్షలకు సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ

ఆదోని(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 24: పదో తరగతి వార్షిక పరీక్షలకు ఇక రెండు రోజులే మిగిలింది. దీంతో విద్యార్థులో ఒకింత టెన్షన మొదలైంది. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ముందస్తుగా విద్యార్థులను మానసికంగా పరీక్షలకు సిద్ధం చేశారు. వీటితోపాటు విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. మారిన నూతన విద్యా విధానంతో ఈ ఏడాది 7 పేపర్‌లే ఉండేలా ప్రశ్నపత్రాలను రూపొందించారు. వీటితోపాటు తొలిసారిగా బుక్‌లెట్‌ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు మానసికంగా, శారీరకంగా, ఒత్తిడి లేకుండా ఆరోగ్యకరంగా జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు హాజరు కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 27 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే మండలాల వారీగా పోలీస్‌ స్టేషనలకు ప్రశ్నాపత్రాలు చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో 273 పరీక్ష కేంద్రాలు ఉండగా ఇందులో 52,352 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 

  తొలిసారిగా బుక్లెట్‌.. 7 పేపర్లు.. 

ఇప్పటి వరకు 11 పేపర్లు ఉండగా.. తొలిసారిగా ఈ ఏడాది పది విద్యార్థులు ఏడు పేపర్ల ప్రశ్నపత్రాలు రూపొందించారు. మరిన్ని కీలకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. విద్యార్థులంతా 24 పేజీల బుక్లెట్‌లో జవాబులు రాయాలి. అదనంగా పేపర్లు ఇవ్వరు. తెలుగు, ఆంగ్లం, హిందీ, గణితం, సాంఘిక శాస్త్రం ఒక్కో పేపర్‌ మాత్రం ఉంటుంది. వీటికి 100 మార్కులు కేటాయించారు. భౌతిక, రసాయన శాసా్త్రలకు ఒక పేపరు 50 మార్కులు, జీవశాస్త్రం మరో పేపరుగా విభజించారు. దీనికి 50 మార్కులు ఉంటాయి. 

  ఓఎంఆర్‌ ఇలా.. 

పరీక్షా కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలి. ఓఎంఆర్‌ పత్రాలను సమగ్రంగా పరిశీలించాలి. ఓఎంఆర్‌ పత్రాలపై ఉన్న బార్‌ కోడ్‌ను మడత పడకుండా చూసుకోవాలి. కొంత మందికి ఆందోళన, వేసవికారణంగా చెమటలు ఎక్కువ పడే అవకాశం ఉంది. ఓఎంఆర్‌ పత్రాలపై చెమట చుక్కలు పడకుండా చూసుకోవాలి. తాగునీటి బాటిల్‌ పక్కన పెట్టుకుని ఉంటే ఆ నీరు ఓఎంఆర్‌ షీట్‌ మీద బార్‌ కోడ్‌పై పడకుండా చూసుకోవాలి. 

  రాయండి ఇలా.. జవాబు పత్రంలో చేతిరాత స్పష్టంగా ఉండాలి. అక్షరాలు ముత్యాలు లేకున్నా స్పష్టంగా అర్థం చేసుకునేలా రాస్తే సరిపోతుంది. సైడ్‌ హెడ్డింగులు, హెడ్డింగులకు ఎరుపు, ఆకుపచ్చ రంగు పెన్నులను ఉపయోగించరాదు.

  ఇలా రాయొద్దు.. 

జవాబు పత్రాల్లో కొంత మంది విద్యార్థులు అనవసరమైన రాతలు రాస్తున్నారు. కష్టాల్లో ఉన్న సరిగా చదువుకోలేదు దయచేసి పాస్‌ చేయండి కంత మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇలాంటివి చేయరాదు. అనవసరమైన పదాలు రాస్తే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 

  విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేశాం

పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకున్నాం. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి కనీస మార్కులు సాధించేలా సన్నద్ధం చేశాం. మంచి మార్కులు సాధించేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు తగు సూచనలు ఇచ్చాం.

-అలీమ్‌సిద్దికి, ప్రధానోపాధ్యాయుడు, నెహ్రూ మెమోరియల్‌ పాఠశాల, ఆదోని:

  ఒత్తిడికి గురికాకూడదు

ప్రణాళికాబద్ధంగా విద్యార్థులు సమయాన్ని విభజించుకొని సబ్జెక్టుల వారీగా సిద్ధపడాలి. సమయం కొద్దిగా ఉంది కాబట్టి ప్రస్తుత దశలో కొత్త మెటీరియల్‌కు కొత్త గైడ్‌లకు జోలికి వెళ్లకుండా ఉండాలి. గతంలో చదివిన వాటిపైనే పునశ్చరణ చేసుకోవాలి. తెలియని విషయాలను సబ్జెక్టు ఉపాధ్యాయులతో తోటి విద్యార్థులతో చర్చించుకుని పరీక్షలు బాగా సిద్ధపడాలి. 

-సుధాకర్‌, సైకాలజిస్ట్‌, ఆదోని

 

మంచి మార్కులతో ఉత్తీర్ణత

ఈ ఏడాది ఏడు పేపర్‌లే ఉన్నాయి. అందుకనుగుణంగా ఉపాధ్యాయులు మమ్మల్ని వార్షిక పరీక్షల కోసం సిద్ధం చేశారు. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తాం అని నమ్మకం నాకు ఉంది. 

-కీర్తి, పదో తరగతి విద్యార్థిని, ఆదోని

 

పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం

ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. 11 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశాం. పరీక్ష కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాం. తాగునీరు, ఫ్యాన్లు, బెంచీలు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. 

-డాక్టర్‌, రంగారెడ్డి, డీఈవో కర్నూలు





Updated Date - 2022-04-25T05:16:44+05:30 IST