రమేష్‌కుమార్‌ను తొలగించడం అంత సులభం కాదు... నిపుణులు

ABN , First Publish Date - 2020-04-10T22:03:42+05:30 IST

ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ తొలగింపు అంత సులభం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఎలక్షన్‌ కమిషనర్‌ తొలగింపు

రమేష్‌కుమార్‌ను తొలగించడం అంత సులభం కాదు... నిపుణులు

అమరావతి: ఎన్నికల కమిషనర్‌గా రమేష్‌కుమార్‌ తొలగింపు అంత సులభం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. రాజ్యాంగంలోని 243 (కె) నిబంధన ప్రకారం ఎలక్షన్‌ కమిషనర్‌ తొలగింపు అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి బాధ్యతలు చేపట్టాక పూర్తి కాలం పదవిలో ఉంటారని, మధ్యలో తొలగించాలంటే విస్పష్టమైన కారణం ఉండాలని, ఇందుకు సంబంధించి 243 (కె) నిబంధన నిర్దేశిస్తోందని చెబుతున్నారు. అంతేకాదు వీరితో పాటుగా రమేష్‌కుమార్‌ను తొలగించే అధికారం జగన్‌ ప్రభుత్వానికి లేదని సీపీఐ నేత రామకృష్ణ చెబుతున్నారు. ఎస్‌ఈసీని తొలగించే అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని రామకృష్ణ పేర్కొన్నారు. 


స్థానిక ఎన్నికల్లో వైసీపీ అవకతవకలపై రమేష్ కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్రంలో శాంతభద్రతలు క్షిణించాయంటూ కేంద్రానికి లేఖ రాశారు. తన వ్యక్తిగత భద్రతకు భరోసా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రమేష్‌కుమార్ ముక్కుసూటి తనంపై సీఎం జగన్ భగ్గుమన్నారు. సీఎంతో పాటుగా మంత్రులు కూడా రాజకీయ, కుల విమర్శలకు దిగారు. నిర్ణయాత్మకంగా వ్యవహరించిన రమేష్‌పై వేటుకు రంగం సిద్ధం కావడంతో రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్న అధికారులను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. 


ఏపీ ఎన్నికల కమిషనర్‌ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ... ప్రభుత్వ ఆర్డినెన్స్‌ ఫైల్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ఆమోదం రాగాకే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను ప్రభుత్వం రహస్యంగా పెట్టింది. రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ మరో జీవో జారీ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెండు జీవోలను ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్‌లో పెట్టింది. 

Updated Date - 2020-04-10T22:03:42+05:30 IST