టీచర్ల పదోన్నతులకు తొలగిన అడ్డంకి!

ABN , First Publish Date - 2022-04-26T08:23:40+05:30 IST

టీచర్ల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులను

టీచర్ల పదోన్నతులకు తొలగిన అడ్డంకి!

  • కోర్టు కేసులను ఉపసంహరించుకుంటాం...
  • మంత్రి సబితకు స్పష్టం చేసిన ఉపాధ్యాయులు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): టీచర్ల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న కోర్టు కేసులను ఉపసంహరించుకోవడానికి ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ముందుకొచ్చారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వారు స్పష్టం చేశారు. దాంతో ఉపాధ్యాయుల పదోన్నతులకు అవరోధాలు తొలగినట్టేనని అధికారులు అంచనా అంచనా వేస్తున్నారు. పీఈటీ, పండిట్‌ పోస్టుల అప్‌గ్రెడేషన్‌కు సంబంధించి ఎస్‌జీటీలు కోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఈ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి, బదిలీలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.


అయితే దీనికి కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. ఈ విషయంపై చర్చించటానికి సోమవారం ప్రభుత్వ ఉపాధ్యాయులతో మంత్రి సబిత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోర్టు కేసుల కారణంగా మొత్తం పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోనుందని, తద్వారా ఉపాధ్యాయులందరికీ నష్టం వాటిల్లుతుందని మంత్రి వారి దృష్టికి తీసుకొచ్చారు. దాంతో కోర్టు కేసులను ఉపసంహరించుకోవడానికి ఉపాధ్యాయులు సంసిద్ధత వ్యక్తం చేశారు.


ఈ నేపథ్యంలో కోర్టులో ప్రత్యేక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. కేసులు దాఖలు చేసిన వారి నుంచి ఉపసంహరణ సంతకాలను తీసుకుని, అదే విషయాన్ని కోర్టుకు స్పష్టం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత పదోన్నతులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ వేసవి సెలవుల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు.



అందరికీ టెట్‌ హాల్‌ టికెట్లు ఇవ్వాలి

దరఖాస్తు చేసిన అభ్యర్థులందరికీ టెట్‌ హాల్‌ టికెట్లను ఇవ్వాలని డీఎడ్‌, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం డిమాండ్‌ చేసింది. దరఖాస్తు సమయంలో చిన్నచిన్న తప్పులను సరిచేసుకోవడానికి ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వకపోవడం, దరఖాస్తు గడువు పెంచకపోవడంతో అభ్యర్థులు ఆందోళనతో ఉన్నారని పేర్కొంది. 28న టెట్‌పై సమీక్ష నిర్వహిస్తున్నందున... సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Updated Date - 2022-04-26T08:23:40+05:30 IST